Project Z Review: ప్రాజెక్ట్ జెడ్ రివ్యూ - మనిషికి మరణమే లేకుంటే… సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Project Z Review: సందీప్‌కిషన్ హీరోగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిన ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఆహా ఓటీటీలో రిలీజైంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్‌గా కనిపించాడు.
Project Z Review: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఆహా ఓటీటీలో రిలీజైంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించాడు. ఈ మూవీ ఎలా ఉందంటే…
సైంటిస్ట్ ప్రయోగం...
కుమార్ (సందీప్‌కిషన్) ఓ పోలీస్ ఆఫీసర్. చిల్లర దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఓ హత్యను కళ్లారా చూస్తాడు కుమార్. ఆ హంతకుడిని పట్టుకునే ప్రయత్నంలో కుమార్ తీవ్రంగా గాయపడతాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి ఉద్యోగంలో చేరిన కుమార్‌కు సిటీలో జరుగుతోన్న వరుస హత్యల కేసు ఛాలెంజింగ్‌గా మారుతుంది. సినీ హీరోయిన్ విస్మ (అక్షరా గౌడ), ఆమె మేకప్ మెన్ (మైగ్ గోపి) తో పాటు మరికొందరు ప్రముఖులు ఒకే రీతిలో హత్యలకు గురవుతారు.
ఈ హత్యలు చేస్తున్నది మేటివేషనల్ స్పీకర్ రుద్ర (డేనియల్ బాలాజీ) అని కుమార్ అనుమానపడతాడు. అతడిని కష్టపడి పట్టుకుంటాడు. రుద్ర ఆలోచనలు, మాటతీరు మొత్తం ఆత్మహత్య చేసుకున్న న్యూరాలజీ సైంటిస్ట్ ప్రమోద్‌ను పోలి ఉంటాయి. మనిషి మెదడులోని జ్ఞాపకాలు వెయ్యేల్లైనా నాశనం కాకుండా పదిలంగా ఉండేలా ప్రయోగం చేస్తాడు ప్రమోద్. ఆ ప్రయోగాన్ని తనపైనే చేసుకుంటాడు. ఆ ప్రయోగం ద్వారా తన మెదడులోని జ్ఞాపకాలను ఇతరుల మెదడుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రమోద్ ఈ హత్యలకు పాల్పడుతున్నాడని కుమార్ అన్వేషణలో తేలుతుంది.
సైంటిస్ట్ అయినా ప్రమోద్ సీరియల్ కిల్లర్‌గా ఎందుకు మారాడు? ప్రమోద్ ప్రయోగం కారణంగా నరరూప రాక్షసుడిగా మారిన ఆర్మీ మేజర్ సత్యన్‌ను ( జాకీ ష్రాఫ్) కుమార్ ఎలా అడ్డుకున్నాడు? ఈ పోరాటంలో కుమార్‌కు అండగా నిలబడిన అతడి ప్రియురాలు అదిరా (లావణ్య త్రిపాఠి) ఎలా చిక్కుల్లో పడింది? ప్రేయసిని కాపాడటం కోసం కుమార్ ఏం చేశాడు? అన్నదే ప్రాజెక్ట్ జెడ్ మూవీ కథ.
సైన్స్ ఫిక్షన్ మూవీ...
ఇదివరకు సైన్స్‌ఫిక్షన్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్‌లోనే తెరకెక్కేవి. ఇప్పుడు ఈ ట్రెండ్ తెలుగులోనూ ఎక్కువైంది. సైన్స్‌ఫిక్షన్ జానర్ కథలు ఎన్నో చిక్కుముడులతో సాగుతుంటాయి. సాధారణ ఆడియెన్స్‌కు అర్థమయ్యేలా లాజిక్‌లతో కన్వీన్సింగ్‌గా ఈ కథలను స్క్రీన్‌పై చెప్పడం అంటే దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదే. ప్రాజెక్ట్ జెడ్‌ను ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సీవీ కుమార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
మనిషికి మరణమే లేకుండా...
ఓ వైపు సీరియల్ కిల్లర్ కోసం కుమార్ సాగించే అన్వేషణ...మరోవైపు ప్రమోద్ అనే సైంటిస్ట్ ప్రయోగాన్ని చూపిస్తూ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మూవీని ఉత్కంఠభరితంగా నడిపించారు. మనిషికి మరణమే అన్నది లేకుండా చేసేందుకు జరుగుతోన్న పరిశోధనల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు రాసుకున్న స్టోరీ ఐడియా బాగుంది.
మర్డర్ మిస్టరీ....
పోలీస్ ఆఫీసర్‌గా కుమార్ పాత్ర పరిచయం, అతడికి ఉన్న మానసిక సమస్య, సైకోథెరఫిస్ట్ అదిరాతో పరిచయం లాంటి సన్నివేశాలతో నెమ్మదిగా సినిమా మొదలవుతుంది. సిటీలో వరుస హత్యలు జరగడం, వాటి వెనుక ఉన్న మిస్టరీ కుమార్‌తో పాటు మిగిలిన పోలీసులకు అంతుపట్టకపోవడం లాంటి అంశాలతో దర్శకుడు కథను ముందుకు ఆసక్తికరంగా నడిపించాడు. ఒక్కో చిక్కుముడి విప్పుతూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ హత్యల వెనుక ప్రమోద్ ఉన్నాడని తేలడంతో సినిమా సైన్స్ ఫిక్షన్ లోకి టర్న్ తీసుకుంటుంది. ప్రమోదం ప్రయోగం గురించి వచ్చే సీన్స్ ఆసక్తిని పంచుతాయి.
విలనిజం పీక్స్...
సందీప్‌కిషన్, జాకీష్రాఫ్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులతో సెకండాఫ్ పోటాపోటీగా నడిపించారు దర్శకుడు. జాకీ ఫ్రాఫ్ విలనిజాన్ని పీక్స్‌లో చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించిందే అయినా సర్‌ప్రైజింగ్‌గా దర్శకుడు రాసుకున్నాడు.
లవర్ బాయ్ పాత్రలకు భిన్నంగా...
పోలీస్ ఆఫీసర్ కుమార్ పాత్రలో సందీప్‌కిషన్ కొత్తగా కనిపించాడు. ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలు చేసిన అతడు సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేరియేషన్ చూపించిన విధానం బాగుంది. విలన్‌గా జాకీ ఫ్రాఫ్ అదరగొట్టాడు. సెకండాఫ్‌లో హీరోను డామినేట్ చేశాడు. అదిరాగా లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. డేనియాల్ బాలాజీ ఫస్ట్ హాఫ్ విలనిజంతో అదరగొట్టాడు.
బెస్ట్ ఛాయిస్...
ప్రాజెక్ట్ జెడ్ డిఫరెంట్ ఎమోషనల్ సైన్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ వారం ఓటీటీలో మంచి థ్రిల్లర్ మూవీ చూడాలనే బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.