Shah Rukh Khan: సీఎస్‍కే అభిమానుల మనసులు గెలిచిన షారుఖ్ ఖాన్.. ఏం చేశారంటే!
Shah Rukh Khan - IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు కో-ఓనర్ షారుఖ్ ఖాన్ సంబరాలు చేసుకున్నారు. చెపాక్ స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ఓ పనితో సీఎస్‍కే అభిమానుల మనసులను గెలిచారు.
Shah Rukh Khan: ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టు (KKR) టైటిల్ దక్కించుకుంది. ఆదివారం (మే 26) జరిగిన ఫైనల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన కోల్‍కతా ఛాంపియన్‍గా నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే, హోం టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ పోరుకు రాకపోయినా.. చెన్నై ప్రేక్షకులు ఈ టైటిల్ ఫైట్‍కు భారీగా హాజరయ్యారు. కొందరు సీఎస్‍కే జెర్సీలు వేసుకొని కనిపించారు.
కోల్‍కతా నైట్‍రైడర్స్ విజయం సాధించాక బాలీవుడ్ స్టార్ హీరో, ఆ జట్టు కో-ఓనర్ షారుఖ్ ఖాన్ సెలెబ్రేట్ చేసుకున్నారు. కేకేఆర్ ఆటగాళ్లను అభినందించారు. ఆ తర్వాత గ్రౌండ్‍లో తిరుగుతూ ఈ మ్యాచ్‍కు హాజరైన ప్రేక్షకులకు అభివాదం చేశారు.
సీఎస్‍కే.. సీఎస్‍కే అని అరిచిన షారుఖ్
షారుఖ్ ఖాన్ అభివాదం చేస్తుండగా కొందరు అభిమానులు సీఎస్‍కే.. సీఎస్‍కే అని గట్టిగా అరిచారు. దీంతో షారుఖ్ కూడా వారితో పాటు జైకొడుతూ సీఎస్‍కే.. సీఎస్‍కే అని అరిచారు. ఐదుసార్లు చాంపియన్ చెన్నై జట్టు పట్ల గౌరవం చూపారు. దీంతో సీఎస్‍కే అభిమానుల మనసులను షారుఖ్ గెలిచారు.
షారుఖ్ ఖాన్ సీఎస్‍కే అని అనడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. షారుఖ్ మనసు ఎంత మంచిదో మరోసారి రుజువైందని చాలా మంది కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
కేకేఆర్ ఫైనల్ గెలిచాక తన భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానాతో కలిసి గ్రౌండ్‍లో సెలెబ్రేట్ చేసుకున్నారు షారుఖ్. బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, శద్ధా కపూర్, కో ఓనర్ జూహి చావ్లా కూడా వీరివెంట ఉన్నారు.
ఈ సీజన్‍లో జట్టుకు దిశానిర్దేశం చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ నుదుటిపై షారుఖ్ ముద్దు పెట్టారు. గతంలో గంభీర్ సారథ్యంలోనే రెండుసార్లు కేకేఆర్ టైటిల్ కొట్టింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ అతడి మార్గదర్శకత్వంలో ఛాంపియన్‍గా నిలిచింది. మొత్తంగా ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక, ఐపీఎల్ ట్రోఫీతోనూ సందడి చేశారు షారుఖ్. ప్లేయర్లను ఆలింగనం చేసుకుంటూ అభినందించారు.
ఫైనల్ ఇలా..
ఐపీఎల్ సీజన్ 2024 ఫైనల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ఆల్‍రౌండ్ షోతో దుమ్మురేపి అలవోకగా గెలిచేసింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచిన ఆ జట్టు.. అదే జోష్ కొనసాగించి ఛాంపియన్‍గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టైటిల్ పట్టింది. ఫైనల్‍లో కోల్‍కతా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍పై గెలిచింది. ఏకంగా 57 బంతులు మిగిల్చి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో కోల్‍కతా దుమ్మురేపింది. వెంకటేశ్ అయ్యర్ మెరుపు అజేయ అర్ధశకతంతో అదరగొట్టాడు. దీంతో అలవోకగా ఆ టీమ్ గెలిచేసింది. 10.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 114 రన్స్ చేసి విజయం సాధించింది. కోల్‍కతా టైటిల్ కైవసం చేసుకోగా.. హైదరాబాద్ రన్నరప్‍గా నిలిచింది.