Kavya Maran: హైదరాబాద్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్.. గంభీర్‌కు షారూఖ్ ముద్దు.. భుజాన మోసిన కేకేఆర్ ప్లేయర్లు-kavya maran gets emotional after srh lost against kkr in ipl 2024 final shah rukh khan kisses mentor gautam gambhir ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kavya Maran: హైదరాబాద్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్.. గంభీర్‌కు షారూఖ్ ముద్దు.. భుజాన మోసిన కేకేఆర్ ప్లేయర్లు

Kavya Maran: హైదరాబాద్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్.. గంభీర్‌కు షారూఖ్ ముద్దు.. భుజాన మోసిన కేకేఆర్ ప్లేయర్లు

Kavya Maran - KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 సీజన్‍ ఫైనల్‍లో కోల్‍కతా చేతిలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. తుదిపోరులో తడబడి రన్నరప్‍గా నిలిచింది. ఎస్ఆర్‌హెచ్ ఓటమితో ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు.

Kavya Maran: హైదరాబాద్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్

Kavya Maran: ఐపీఎల్ 2024 సీజన్‍‍లో ధనాధన్ ఆటతో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‍లో మాత్రం నిరాశపరిచింది. తుదిపోరులో అన్ని విభాగాల్లో విఫలమై ఘోరంగా కోల్‍కతా నైట్‍రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేడు (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్‍లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో కోల్‍కతా చేతిలో పరాజయం పాలైంది. ఈ సీజన్‍లో రికార్డుల మోత మోగించి దూకుడుకు కేరాఫ్‍గా నిలిచిన హైదరాబాద్ ఫైనల్‍లో చతికిలపడి రన్నరప్‍గా నిలిచింది. తుదిపోరులో సన్‍రైజర్స్ ఓటమితో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు.

కన్నీరు పెట్టుకున్నా.. చప్పట్లతో అభినందిస్తూ..

ఫైనల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత ఆ జట్టు యజమాని కావ్య మారన్ ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. వెనక్కి తిరిగి కన్నీరు తుడుచుకున్నారు. బాధ ఉన్నా.. ఫైనల్ వరకు వచ్చిన తన టీమ్ హైదరాబాద్‍ను, విజేతగా నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్‌ను చప్పట్లతో అభినందించారు కావ్య.

కావ్య మారన్ బాధగా ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. సీజన్ మొత్తం జట్టుతోనే ఉంటూ ప్రోత్సహిస్తూ వచ్చారు కావ్య.

గతేడాది 10.. ఇప్పుడు రన్నరప్

2023 సీజన్‍లో చివరిదైన పదో స్థానంలో నిలిచి సన్‍రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచింది. అయితే, ఈ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్‌ను వేలంలో హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ రూ.20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత కమిన్స్‌ను కెప్టెన్ చేసింది హైదరాబాద్ మేనేజ్‍మెంట్. హెడ్‍ను కూడా వేలంలో తీసుకుంది. ఈ సీజన్‍లో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా జట్టును ముందుకు నడపగా.. దూకుడైన బ్యాటింగ్‍తో హెడ్ అదరగొట్టాడు. అభిషేక్ శర్మ కూడా దుమ్మురేపాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు (287 పరుగులు) సహా చాలా రికార్డును ఈ సీజన్‍లో హైదరాబాద్ సాధించింది. అయితే, ఫైనల్‍లో ఓడి రన్నరప్‍గా నిలిచింది. తుదిపోరులో ఓడినా.. ఈ సీజన్‍లో అందరి మనసులను గెలిచింది హైదరాబాద్. గతేడాది పదో స్థానంలో నిలిచిన ఆ జట్టు.. ఈ ఏడాది రన్నరప్‍గా రెండో ప్లేస్ దక్కించుకొని అదరగొట్టింది.

గంభీర్‌కు షారుఖ్ ముద్దు

2012, 2014 సీజన్లలో కెప్టెన్‍గా కోల్‍‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు గౌతమ్ గంభీర్. ఆ తర్వాత మళ్లీ ఆ జట్టు టైటిల్ గెలువలేకపోయింది. ఇక ఈ 2024 సీజన్ కోసం గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా కోల్‍కతా మేనేజ్‍మెంట్ తీసుకొచ్చింది. గంభీర్ తన మార్క్ దూకుడుతో కోల్‍కతాకు దిశానిర్దేశం చేశాడు. గత రెండేళ్లు ఏడో స్థానంతో నిరాశపరిచిన కోల్‍కతా.. ఈసారి శ్రేయస్ అయ్యర్ సారథ్యం, గంభీర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన ఆటతో టైటిల్ కొట్టేసింది. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఫైనల్ గెలిచాక కోల్‍కతా కో-ఓనర్, బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్‌ నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఆటగాళ్లు భుజాన మోసి స్టేడియంలో తిప్పారు. సంబరాలు చేసుకున్నారు. ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా చెపాక్ మైదానంలో తిరుగుతూ సెలెబ్రేట్ చేసుకున్నారు. కోల్‍కతా ప్లేయర్లను కౌగిలించుకుంటూ అభినందించారు.

ఐపీఎల్ 2024 ఫైనల్‍లో నేడు (మే 26) కోల్‍కతా 8 వికెట్ల తేడాతో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 113 పరుగుల స్పల్ప స్కోరుకే ఆలౌట్ కాగా.. 10.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది కోల్‍కతా. మూడోసారి ఐపీఎల్ టైటిల్‍ను కేకేఆర్ కైవసం చేసుకుంది.