తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bathukamma Sarees : మహిళలకు గుడ్ న్యూస్.. బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడంటే?

Bathukamma Sarees : మహిళలకు గుడ్ న్యూస్.. బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu

21 September 2022, 17:23 IST

    • Bathukamma Sarees Distribution : రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. దాదాపు కోటి మంది మహిళలు దసరా పండుగ సందర్భంగా చీరలను అందుకోనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
బతుకమ్మ చీరలు
బతుకమ్మ చీరలు

బతుకమ్మ చీరలు

ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న మహిళలకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం సుమారు రూ.339.71 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలను బహుమతిగా అందించడమే కాకుండా, రాష్ట్రంలోని నేత కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో తమ కుటుంబాల పోషణ కోసం నేత కార్మికులు కష్టాలు పడ్డారని, ఇప్పుడు వారి ఆదాయం రెండింతలు పెరిగిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

'నేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా వస్త్ర పరిశ్రమను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కేంద్రం మాత్రం నేత కార్మికుల పురోగతిని దెబ్బతీసేలా వస్త్రాలపై జీఎస్టీ(GST)ని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం మొగ్గు చూపనప్పటికీ, వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

చీరలన్నీ(Sarees) ఇప్పటికే గమ్యస్థానాలకు చేరుకోగా, పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ చీరలను సిరిసిల్లలో 20,000 మంది పవర్‌లూమ్ నేత కార్మికులు తయారు చేశారు. ప్రతి రోజు గడువుకు అనుగుణంగా సుమారు లక్ష చీరలు తయారు చేస్తారు. కొరత లేకుండా చూసేందుకు 3 లక్షల చీరల బఫర్ స్టాక్‌ను ఉంచారు.

100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలును ఉపయోగించి 24 డిజైన్లలో 10 రంగులు, 240 థ్రెడ్ బార్డర్‌లలో చీరలు ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలోని మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్లను ఖరారు చేశారు. కోటి చీరల్లో 6 మీటర్ల పొడవున్న 92 లక్షల చీరలను తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేయనున్నారు. 9 మీటర్ల పొడవున్న మిగిలిన ఎనిమిది లక్షల చీరలను ప్రత్యేకంగా వృద్ధ మహిళల కోసం వారి ప్రాధాన్యత మేరకు తయారు చేశారు.

2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళలకు బతుకమ్మ చీర(Bathukamma Sarees)లను ఏటా పంపిణీ చేస్తోంది. దీని ప్రకారం, 2017లో 95 లక్షలు, 2018లో 96.7 లక్షలు, 2019లో 96.5 లక్షలు, 2020లో 96.24 లక్షలు, 2021లో 96.38 లక్షలకు పైగా చీరలు పంపిణీ జరిగింది. చేనేత కార్మికులే కాకుండా కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు సహా అనుబంధ కార్మికులు కూడా ప్రభుత్వం జారీ చేసిన బతుకమ్మ చీరల ఆర్డర్‌ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

సంవత్సరాల వారీగా బతుకమ్మ చీరల పంపిణీ వివరాలు

2017 – 95,48,439

2018 – 196,70,474

2019 – 96,57,813

2020 – 96,24,384

2021 – 96,38,000