GST on rent: ఇంటి అద్దెపై జీఎస్టీ ఉందా?.. కేంద్రం వివరణ
ఇంటి అద్దెపై జీఎస్టీ విషయంలో గందరగోళం నెలకొంది. దాంతో, ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై జీఎస్టీ చెల్లించాలా? వద్దా ? అనే విషయంపై కేంద్రం శుక్రవారం వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించిన సందేహాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఒక ప్రకటనలో తీర్చింది.
GST on rent: యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇవ్వడం సాధారణం. ఇంటి అద్దె చాలా మందికి ఒక అవసరమైన ఆదాయ వనరు. తాజాగా, 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇంటి అద్దెపై జీఎస్టీ విధిస్తున్నట్లు నిర్ణయించారని వార్తలు వచ్చాయి. దీనిపై పీఐబీ వివరణ ఇచ్చింది.
GST on rent: ఆ అద్దెకే జీఎస్టీ
కిరాయిదారులు చెల్లించే అద్దెపై 18% జీఎస్టీ చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని మింట్ సహా పలు మీడియాల్లో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. అయితే, ఆ ఇల్లు, లేదా భవనాన్ని వ్యక్తులకు, కుటుంబాలకు కాకుండా, వ్యాపార అవసరాల కోసం అద్దెకు ఇస్తే మాత్రం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే మీ ఇల్లు, లేదా భవనాన్ని ఎవరైనా వ్యాపార అవసరాల కోసం అద్దెకు తీసుకుని ఉంటే, తద్వారా మీకు లభించే అద్దెపై జీఎస్టీ ఉంటుందని తెలిపింది. అలాగే, ఎవరైనా వ్యాపారస్తుడు, లేదా భాగస్వామ్య సంస్థలో పార్ట్‌నర్ వ్యక్తిగత అవసరాల కోసం మీ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటే కూడా, జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, తన సొంత ఇంటిని ఎవరైనా వ్యాపారస్తుడు, లేదా భాగస్వామ్య సంస్థలో పార్ట్‌నర్ వ్యక్తిగత అవసరాల కోసం అద్దెకు ఇచ్చి ఉంటే, ఆ ఆదాయంపై జీఎస్టీ ఉండదు. జులై 18 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అది కూడా జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన అద్దెదారులకే ఈ 18% జీఎస్టీ వర్తిస్తుంది.
GST on rent: 2017 నుంచి..
జీఎస్టీ(Goods and Services Tax - GST)ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2017 జులై నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో దేశంలో రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అలాగే, జులైలో రూ. 1.49 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను(GST) వసూలు కావడం విశేషం.