Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం
05 May 2024, 8:31 IST
- Maoist Kasaraveni Ravi killed in Encounter : తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత కాశవేయిన రవి(55) ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. చత్తీస్ గడ్(Chhattisgarh) అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా… ఆయన స్వగ్రామం వంగరలో శనివారం అంత్యక్రియలు జరిగాయి.
మావోయిస్ట్ నేత కాశవేయిన రవి(55) మృతి
Maoist Kasaraveni Ravi : ఇటీవల ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని అబూజ్ మాఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి(Bheemadevarapally) మండలం వంగర గ్రామానికి చెందిన మావోయిస్ట్ నేత కాశవేయిన రవి(Maoist Kasaraveni Ravi) అలియాస్ అశోక్ అలియాస్ వినయ్ అసువులు బాశారు.
చత్తీస్ గడ్(Chhattisgarh) అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ (Encounter)జరగగా.. ఐదు రోజుల అనంతరం రవి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో రవి కుటుంబ సభ్యులతో పాటు అమరుల బంధు మిత్రుల కమిటీ సభ్యులు, వివిధ పౌర హక్కుల సంఘాల నేతల హాజరై ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 33 సంవత్సరాల పాటు ఉద్యమంలో కొనసాగిన రవి అలియాస్ వినయ్ చివరకు ఎన్ కౌంటర్ లో నేలకొరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ఉద్యమ ప్రస్థానం ఇలా..
వంగర గ్రామానికి చెందిన కాశవేయిన రాజయ్య–లక్ష్మీ దంపతులకు నలుగురు పిల్లలు. అందులో చిన్న కొడుకు రవి(Maoist Kasaraveni Ravi). కాగా రాజయ్యకు సింగరేణిలో ఉద్యోగం రావడంతో వంగర నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి షిఫ్ట్ అయి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రవి బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివాడు.
1991లో సింగరేణి కార్మిక సమాఖ్య సంఘంలో చేరాడు. నాటి సింగరేణి కార్మిక సమాఖ్య డివిజన్ కమిటీ మెంబర్ అయిన గెల్లి రాజలింగ్ అలియాస్ సురేశ్ తో కలిసి కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు. ఆ తరువాత దండ కారణ్యానికి వెళ్లి పోయి ఫుల్ టైమర్ గా పని చేశాడు. ఆ తరువాత ఆయన ఎన్నడూ ఇంటి ముఖమే చూడలేదు.
వైద్య రంగంలో నిపుణత సాధించిన రవి దళంలో డాక్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తరువాత డివిజన్ కమిటీ మెంబర్ స్థాయికి చేరాడు. పార్టీ సూచనల మేరకు వివిధ కార్యకలాపాలు చేపట్టిన రవి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరాడు. ఈ క్రమంలోనే ఆయనను తుద ముట్టించేందుకు జరిపిన అనేక ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు.
ఫ్యామిలీ అంతా సొంతూరికి షిఫ్ట్
రవి దళంలో చేరిన తరువాత ఆయన తల్లిదండ్రులు రాజయ్య–లక్ష్మీ చనిపోయారు. అనంతరం రవి వేటలో ఉన్న పోలీసులు తరచూ విచారణ పేరున ఇబ్బందులకు గురి చేయడంతో ఆ వేధింపులు భరించలేక రవి సోదరులైన తిరుపతి, వెంకటేశ్, అక్క ఆల్య బెల్లంపల్లిని విడిచి పెట్టారు. అక్కడి నుంచి తమ సొంతూరైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు వచ్చారు.
కాగా ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్(Chhattisgarh Encounter) లో రవి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర పడినట్లయ్యింది. ఆయన మృత దేహాన్ని అమరుల బంధు మిత్రుల కమిటీ సభ్యులు వంగర తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి..
ఎన్ కౌంటర్ జరిగిన ఐదు రోజుల తరువాత రవి మృత దేహం స్వగ్రామం వంగరకు చేరుకుంది. శనివారం మధ్యాహ్నం డెడ్ బాడీ వంగరకు రాగా.. అమరుల బంధు మిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, తదితర ప్రజా సంఘాల నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో వంగరకు చేరుకున్నారు.
రవి మృత దేహం వద్ద ఉద్యమ నివాళులర్పించిన అనంతరం పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ ద్వారా డ్రోన్ల ద్వారా నక్సల్స్ స్థావరాలను గుర్తించి విష రసాయనాలు స్ప్రే చేస్తున్నారని, వారు స్పృహ కోల్పోయేలా చేసి బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో అడవిలోని 300 రకాల ఖనిజ సంపదను దోచుకుంటోందని, వాటిని స్వదేశీ కార్పొరేట్లకు అప్పగించేందుకు సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లో ఉన్న ఆదివాసుల మీదకి ఉసిగొల్పి ఊచకోతలకు పాల్పడుతోందన్నారు. అబుజ్ మడ్ ఎన్ కౌంటర్ పై అనుమానాలు ఉన్నాయని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్