Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం, ధర్మ సమాజ్‌పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హత్య
Hanamkonda Crime : హనుమకొండ జిల్లా కౌకొండలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ హత్యకు భూతగాదాలు కారణమని బంధువులు అంటున్నారు.
Hanamkonda Crime : హనుమకొండ జిల్లా పరకాల మండలం కౌకొండలో మంగళవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో కిరాతకంగా నరికారు. గొడ్డలి గాట్లకు తీవ్ర రక్త స్రావమై ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్(35) ధర్మ సమాజ్‌పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కాగా ఇటీవల అదే గ్రామానికి చెందిన యుగంధర్ వాళ్ల పెద్దమ్మ మేకల సారమ్మ అనారోగ్యానికి గురై చనిపోగా.. మంగళవారం దశదిన కర్మ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద కథా కాలక్షేపం ఏర్పాటు చేయగా.. అందరూ అక్కడికి చేరుకుని కథలో నిమగ్నమయ్యారు.
తల భాగంలో గొడ్డలి వేటు
దశ దిన కర్మకు హాజరైన గ్రామస్థులంతా కథలో లీనమై ఉండగా.. యుగంధర్, తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాడు. కథ వైపు చూస్తూ ఉండిపోగా.. అప్పటివరకు అక్కడే ఉన్న యుగంధర్ కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా యుగంధర్ పై దాడి చేశారు. గొడ్డలితో యుగంధర్ తల, దవడ భాగంంలో వేటు వేయడంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలాడు. అక్కడున్న గ్రామస్థులు గుమిగూడి కేకలు వేయడంతో యుగంధర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వెంటనే పరకాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి డాక్టర్లు యుగంధర్ ను పరీక్షించి, ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
భూ వివాదమే కారణమా?
యుగంధర్ హత్యకు గ్రామంలోని భూ వివాదమే కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని మెయిన్‌సెంటర్‌లో తాతల నుంచి సంక్రమించిన కొంత భూమి ఉండగా.. దాని విషయంలో యుగంధర్‌కు, వారి పాలి వాళ్లకు కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఇందులో యుగంధర్ఒక్కడే భూమి గురించి పట్టుబట్టి కొట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో తమ పాలి వాళ్లే యుగంధర్‌ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పరకాల రూరల్ సీఐ మల్లేశ్ తెలిపారు. యుగంధర్ ను అతి కిరాతకంగా నరికి చంపడం గ్రామంలో కలకలం సృష్టించింది.
నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో ఖిల్లా రోడ్డులో ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశారు. పాడుబడిన భవనంలో ఓ వ్యక్తిని హత్య చేసి తగలబెట్టారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థిలిలో షేక్ అహ్మద్ అనే వ్యక్తి కాలిన గాయాలతో ఉండగా, అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో హత్యకు గురైంది నిజామాబాద్ కు చెందిన ముఖిద్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసి ఎందుకు తగలబెట్టారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న షేక్ అహ్మద్ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)