Singareni Employee Murder: వరంగల్‌లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ దారుణ హత్య.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
Singareni Employee Murder: వరంగల్ నగరంలో ఓ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ప్లాట్ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తగా.. కట్టుకున్న భార్యే అతడిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది.
Singareni Employee Murder: మలి వయసులో తోడుండాల్సింది పోయి తానే ఊపిరి తీయించిన భార్య ఉదంతం ఇది. లక్ష రూపాయల కోసం హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న బాలుడు, మరికొందరు ఇంటర్ స్టూడెంట్లతో కలిసి మర్డర్ చేయగా చివరకు అందరూ కటకటాల పాలయ్యారు.
మూడు రోజుల కిందట వెలుగు చూసిన సింగరేణి Singareni విశ్రాంత ఉద్యోగి హత్య కేసును వరంగల్ కాకతీయ యూనివర్సిటీ KU Police పోలీసులు ఛేదించారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి జైలు పంపారు. నిందితుల అరెస్ట్ కు సంబంధించిన వివరాలను హనుమకొండ Hanmakonda ఏసీపీ దేవేందర్ రెడ్డి బుధవారం వెల్లడించారు.
మంచిర్యాల mancherial జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన గజెల్లి పోషం(70) సింగరేణిలో పని చేసి, ఏడు సంవత్సరాల కిందట ఉద్యోగ విరమణ పొందాడు. ఆ తరువాత కరీంనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు.
అప్పటికే వయసు మీద పడటం, ఉద్యోగ విమరణ కూడా పూర్తవడంతో మద్యానికి అలవాటు పడ్డాడు. తరచూ మద్యం తాగి వచ్చి భార్య లక్ష్మితో గొడవ పడేవాడు. భర్త పోశం తీరుతో విసుగు చెందిన లక్ష్మి తాను అక్కడ ఉండలేనని, హైదరాబాద్ లోని అనాథ శరణాలయంలో ఉంటానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.
అనంతరం పోషం వరంగల్ నగరంలోని కుమార్ పల్లిలో ఉంటున్న తన కూతురు దివ్య ఇంటికి వచ్చి ఉంటున్నాడు. అనాథ శరణాలయంలో ఉంటానని వెళ్లిన లక్ష్మి కొద్దిరోజులకే కరీంనగర్ కు తిరగి వచ్చేసింది. అక్కడ సరస్వతి నగర్ లో ఓ రూమ్ ను అద్దెకు తీసుకుని నివసిస్తోంది.
మైనర్ బాలుడితో మర్డర్ స్కెచ్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పోషం కొంతకాలం కిందట హనుమకొండ గుండ్ల సింగారం ప్రాంతంలో ఒక ప్లాట్ Residential Flat కొనుగోలు చేశాడు. భార్య తనతో ఉండకపోవడంతో ఆ స్థలాన్ని అమ్మేందుకు పోషం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ భూమిని అమ్మడం ఇష్టం లేకపోవడంతో లక్ష్మి తన భర్తతో వాదనకు దిగుతుండేది.
లక్ష్మీ కరీంనగర్ లో ఉంటున్న విషయం తెలుసుకున్న పోషం కూడా ఓసారి అక్కడికి వెళ్లి గొడవ పడి వచ్చాడు. భర్త తీరు పట్ల తీవ్ర అసహనానికి గురైన లక్ష్మి ఆయనను చంపించాలని నిర్ణయించుకుంది.
కరీంనగర్‌లో తన ఇంటి పక్కనే ఉండే ఓ మైనర్ బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడగా.. మెల్లగా ఆ బాలుడికి విషయం మొత్తం చెప్పింది. తన భర్త తనను వేధిస్తున్నాడని, ఆయనను చంపితే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పింది. దీంతో డబ్బులకు ఆశపడిన ఆ బాలుడు డీల్ కు ఓకే చెప్పాడు.
ఇంటర్ విద్యార్థులతో కలిసి
లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్న మైనర్ బాలుడు తన స్నేహితులు, కరీంనగర్‌కు చెందిన సూర సిద్ధు, మహేందర్ అనే యువకులకు విషయం చెప్పాడు. అనంతరం పోషం ఫొటోను తెప్పించుకుని ఈ నెల 9న సాయంత్రం మర్డర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
సుపారీ తీసుకున్న బాలుడితో పాటు అతని స్నేహితులు సిద్దు, మహేందర్, పోషం భార్య లక్ష్మి నలుగురూ కలిసి కరీంనగర్ లో ఒక కారును అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ నగరానికి వచ్చారు. ఆ తరువాత వారిని హనుమకొండ గుండ్ల సింగారం తీసుకెళ్లిన లక్ష్మి అక్కడ వారికి ఉన్న ప్లాట్ ను చూపించి కరీంనగర్ కు తిరుగు ప్రయాణమైంది.
అనంతరం అనంతరం సుపారీ తీసుకున్న బాలుడు, అతని స్నేహితులు సిద్దు, మహేందర్, తమకు పరిచయం ఉన్న వరంగల్ కు చెందిన మరో బాలుడికి ఫోన్ చేశారు. అతని ద్వారా వరంగల్ నగరంలో ఉన్న భీమారంలోని సాయి శివాని కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థులను కాంటాక్ట్ అయ్యారు. అందులో ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్ బాలురతో పాటు రాంచరణ్, వినయ్ అనే ఇద్దరు యువకులను కలిశారు.
మద్యం తాగించి మర్డర్
సుపారీ తీసుకున్న బాలుడు, అతడితో పాటు కరీంనగర్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు, వరంగల్ లో కలిసి మరో బాలుడు, సాయి శివాని కాలేజీకి చెందిన నలుగురు ఇంటర్ స్టూడెంట్స్ మొత్తం ఎనిమిది మంది తమ పథకంలో భాగంగా గుండ్ల సింగారంలో ఉన్న పోషం ప్లాట్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి పోషం ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు.
ప్లాట్ కొనడానికి వచ్చామని చెప్పి, ఆయనను బయటకు పిలిపించారు. ప్లాట్ చూసిన అనంతరం అప్పటికే రాత్రయిందని, రేపు వచ్చి ప్లాట్ కొంటామని పోషంతో మాటలు కలిపారు. ఆ తరువాత మద్యం తాగుదామని వరంగల్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో కోమటిపల్లి సమీపంలో ఉన్న ఆల్య తండా వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు.
పోషం మద్యం తాగి పడిపోగా అందరూ కలిసి ఆయనపై దాడి చేశారు. చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ ఘటన ఈ నెల 9న అర్ధరాత్రి జరగగా.. 11వ తేదీన ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతుడి ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎంక్వైరీ చేసి పోలీసులు నిందితులను గుర్తించారు. మృతుడి భార్య 60 ఏళ్ల లక్ష్మితో పాటు నలుగురు మైనర్లు, మరో నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభచూపిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం