Mahabubabad Murders: పాలల్లో విషం కలిపి చిన్నారుల హత్య! తల్లిదండ్రుల అదృశ్యం.. మహబూబాబాద్‌లో దారుణం-killing children by poisoning milk disappearance of parents ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Killing Children By Poisoning Milk! Disappearance Of Parents..

Mahabubabad Murders: పాలల్లో విషం కలిపి చిన్నారుల హత్య! తల్లిదండ్రుల అదృశ్యం.. మహబూబాబాద్‌లో దారుణం

HT Telugu Desk HT Telugu
Mar 11, 2024 11:58 AM IST

Mahabubabad Murders: మహబూబాబాద్‌లో దారుణం జరిగింది. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపేసిన ఘటన వెలుగు చూసింది. పిల్లల తల్లిదండ్రులు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.

మహబూబాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన చిన్నారులు
మహబూబాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన చిన్నారులు

Mahabubabad Murders: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పురుగుల మందు కలిపిన పాలు తాగి, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. వారి తల్లిదండ్రులు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Garla గార్ల మండలం సీతంపేట Seetampet village గ్రామ పంచాయతీ పరిధి అంకన్నగూడెం లో ఈ ఘటన జరగగా.. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అంకన్న గూడెం గ్రామానికి చెందిన పెండకట్ల అనిల్ కు బయ్యారం మండలం నామాలపాడులోని రాయికుంటకు చెందిన దేవితో దాదాపు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది.

వ్యవసాయం తో పాటు ఇటుక బట్టీల్లో పని చేసే అనిల్ తన అత్తగారి గ్రామమైన రాయకుంటలోనే కొద్దిరోజులుగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి లోహిత(3), జశ్విత(1) అనే ఇద్దరు చిన్నారులు సంతానంగా ఉన్నారు. అనిల్-దేవీ దంపతులు తమ ఇద్దరు చిన్నారులను తీసుకొని శనివారం సాయంత్రం రాయికుంట నుంచి అంకన్నగూడెం వచ్చారు.

విగతజీవులైన ఇద్దరు చిన్నారులు

అనిల్ తండ్రి వెంకన్న అంకన్న గూడెంలో Ankanna Gudem చిన్నపాటి కిరాణ షాప్ నడుపుతున్నారు. ఇంటికి కొడుకు, కోడలితో పాటు ఇద్దరు మనువరాళ్లు రాగా.. వెంకన్న రోజువారీలాగే ఆదివారం తెల్లవారుజామునే దుకాణం తెరిచేందుకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న సమయంలో ఇంట్లో అందరూ ఉండగా.. తిరిగి ఉదయం 9.30 గంటల వరకు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొడుకు అనిల్, కోడలు దేవి కనిపించలేదు.

దీంతో వారి కోసం వెతుకుతుండగా లోహిత, జశ్విత ఇద్దరూ విగతాజీవులుగా కనిపించారు. అది చూసి కంగు తిన్న వెంకన్నకు ఏం చేయాలో తోచలేదు. ఇద్దరు మనువరాళ్లు ప్రాణాలు కోల్పోయి అచేతన స్థితిలో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

బ్యాగులో పాల ప్యాకెట్లు, పురుగుల మందు డబ్బాలు

వెంకన్న నుంచి సమాచారం అందుకున్న మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, సిఐ రవి కుమార్, ఎస్సై జీనత్ కుమార్ హుటాహుటిన అంకన్న గూడెం చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, వెంకన్న ను విచారించారు.

స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో పరిశీలించగా మంచంపై పాల సీసా కనిపించగా, దాన్ని సేకరించారు. గదిలో ఓ చోట చిరిగి ఉన్న పాల ప్యాకెట్ తో పాటు అనిల్ దేవిల దుస్తుల బ్యాగ్ లో పురుగుల మందు డబ్బాను గుర్తించారు.

విచారణ జరుపుతున్న పోలీసులు

పిల్లలు మంచంలోనే విగత జీవులుగా పడి ఉండటం, తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు పురుగుల మందు కలిపిన పాలు తాగించి తల్లిదండ్రులే హత మార్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు అక్కడున్న ఆధారాలు సేకరించారు.

తన ఇద్దరు మనువరాళ్లను కొడుకు కోడలు విషం ఇచ్చి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత పిల్లలు మృతి చెంది ఉన్న మంచంపై కనిపించిన పాల సీసాలో పురుగుల మందు కలిసిందా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు దానిని ల్యాబోరేటరీకి పంపించారు.

అనిల్ దేవి సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో పోలీసులు వారి గురించి గాలిస్తున్నారు. చుట్టూ పక్కల వారిని ఆరా తీయడంతో పాటు ఆ మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వారి ఆచూకీ లభ్యమైతే అసలు వాస్తవాలు బయట పడతాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel