Wedding rituals: పెళ్ళైన తర్వాత వధువు ఎందుకు బియ్యం వెనక్కి విసిరేస్తుంది?
14 March 2024, 15:15 IST
- Wedding rituals: పెళ్లి జరిగిన తర్వాత అప్పగింతల సమయంలో వధువు తల మీద నుంచి వెనక్కి విసిరేస్తుంది. పుట్టింటి వాళ్ళు వాటిని భద్రంగా దాచిపెడ్తారు. ఈ ఆచారం పాటించడం వెనుక ఉన్న అర్థం ఏంటి? ఎందుకు ఇలా చేస్తారు?
పెళ్ళైన తర్వాత వధువు బియ్యం ఎందుకు విసిరేస్తుంది?
Wedding rituals: హిందూ ధర్మ శాస్త్రంలో ప్రతి సందర్భానికి భిన్నమైన ఆచారాలు ఉంటాయి. వాటిని ఆచరించడం వల్ల వచ్చే ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. వివాహం సమయంలో చేసే ప్రతి పని వెనుక ప్రత్యేక అర్థం, భావం ఉంటాయి.
లేటెస్ట్ ఫోటోలు
పెళ్లి సమయంలో పాటించే ఒక్కో ఆచారం వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క ఆచారాన్ని పవిత్రంగా చేస్తారు. హిందూ వివాహాలలో ఎక్కువగా కనిపించే ఆచారం వధువు బియ్యం విసరడం. ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు చాలా భావోద్వేగానికి లోనవుతారు. అప్పగింతల సమయంలో వధువు పుట్టింటిని వదిలి వెళ్తున్నప్పుడు ఈ ఆచారం పాటిస్తారు.
తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి భర్తతో కలిసి వెళ్లిపోతూ వధువు ఈ ఆచారం పాటిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో నూతన వధువు వరుడు ఇంట్లో అడుగుపెట్టే సమయంలో గుమ్మం మీద బియ్యం ఉన్న చెంబుని కాలితో కొడుతుంది. ఇలా చేసే ప్రతి ఒక్క ఆచారం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది.
బియ్యం విసిరే ఆచారం ఎందుకు పాటిస్తారు?
కుమార్తె రెండు వంశాలను పవిత్రం చేస్తుందని పండితులు చెబుతారు. శాస్త్రాల ప్రకారం కుమార్తెను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. పెళ్లయ్యాక వీడ్కోలు పలికే సమయంలో పెళ్లికూతురు వెనుకకి చూడకుండా బియ్యంతో పాటు నాణేలను వెనక్కి విసిరేయడం బాగా ప్రాచుర్యం పొందిన ఒక ఆచారం.
తల్లిదండ్రులు ఆడపిల్లని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. వీడ్కోలు పలుకుతున్న సమయంలో పుట్టింటి లక్ష్మీదేవిని తన వెంట తీసుకొని వెళ్లకుండా ఉండడం కోసం ఇలా బియ్యం నాణేలు తల మీద నుంచి వెనక్కి విసురుతారు. అలా విసిరిన బియ్యాన్ని పుట్టింటి వాళ్ళు కొంగుతో కిందపడకుండా పట్టుకుంటారు. తన పుట్టింటిని పేదరికంలోకి నెట్టకుండా సుఖసంతోషాలతో ఉండమని కోరుకుంటూ ఇలా బియ్యం విసురుతారు.
ఇలా ఐదు సార్లు వెనక్కి విసురుతారు. ఇలా చేయడం వల్ల ఇంటి లక్ష్మి తమతోనే ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తారు. తన తల్లి ఇంటి అదృష్టాన్ని, లక్ష్మీదేవిని తనతో పాటు తీసుకువెళ్లడం లేదని సూచిస్తుంది. అలాగే తన పుట్టిల్లు ఎప్పుడు ఆహారం, డబ్బుతో నిండి ఉండాలని కోరుకుంటూ ఈ ఆచారం పాటిస్తారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులు తోబుట్టువులు తన మీద చూపించిన ప్రేమకి కృతజ్ఞతగా ఇలా చేస్తారు.
ఈ ఆచారం వెనుక ఉన్న కారణం
వధువు వీడ్కోలు పలికిన తర్వాత ఇంటికి కొంత దూరంలో తన సోదరుడు ఆమె కాళ్ళు నీటితో కడుగుతాడు. అలాగే ఒకసారి ఇంటి వైపు చూడమని చెప్తారు. వధువు మీద తన పుట్టింటి వాళ్లకున్న ప్రేమ తరగదని, కొన్నాళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వచ్చినా సొంత ఇంటికి వచ్చిన భావన అలాగే ఉంటుందని ఇలా చేస్తారు.
పెళ్లి కూతురు తన గ్రామం పొలిమేరలో ఒకసారి ఆగి ఒక రాయి తీసుకుని తల చుట్టూ తిప్పి వెనక్కి విసురుతుంది. అంటే ఆమె వెనుక ఏమైనా చెడు శక్తులు ఉంటే అవి అక్కడే ఆగిపోవాలని ఇలా చేస్తారు. ఆ సమయంలో వధువు వెనక్కి తిరిగి చూడకుండా తన అత్తమామల ఇంటికి పయనమవుతుంది. ఏవైనా దుష్టశక్తులు ఉంటే అవి ఆమెపై ఆధిపత్యం చేలాయించకుండా వాటిని అక్కడే వదిలించుకుని వెళ్ళిపోవడం దీని వెనుక ఉన్న అర్థం.