Meedu kattadam: మీదు కట్టడం అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? ఈ ఆచారం పాటిస్తే కలిగే ఫలితం ఏంటి?
Meedu kattadam: ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు పాటించే ఆచారం మీదు కట్టడం. అసలు ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు? ఎలా పాటిస్తారు. ఈ ఆచారం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చిలకమర్తి తెలియజేశారు.
ధర్మబద్ధమైన ఏ కార్యక్రమం ఆచరించినప్పుడు అయినా ఆ కార్యక్రమంలో దిష్టి దోషం వల్ల కావచ్చు, మరి ఏ ఇతర దోషము వలనైనా కావచ్చు ఆటంకములు కలుగు అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇలా ధర్మబద్ధంగా ఆచరించే చేసే పనులు వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశం వంటి శుభకార్యాలయందు కావచ్చు, యజ్ఞ యాగాది క్రతువులయందు కావచ్చు, దిష్టిదోషము, ఇతర దోషాల వలన కలిగేటటువంటి విఘ్నాలు, ఇబ్బందులు తొలగి ఆ కార్యక్రమాలు విజయాన్ని, సత్ఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరునికి మీదు కట్టి ఆ కార్యక్రమాలు ఆచరించినట్లయితే అవి దిగ్విజయంగా పూర్తవుతాయని శాస్త్రీయంగా ఉన్నటువంటి ఆచారమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మీదు కట్టడం ఎలా?
ముందుగా గృహంలోని సింహ ద్వారానికి మామిడి తోరణం కట్టాలి. బియ్యం పిండితో నేలపై పద్మం ఆకారంలో ముగ్గు వేసి, దానిపై పసుపు, కుంకుమలతో అలంకారం చేసి దానిపై క్రొత్త వస్త్రమును (పసుపుతో తడిపినది) వేసి దానిపై కేజింపావు బియ్యం పోసి, జత తమలపాకులు ఉంచి దానిపై పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడిని ఉంచి గణపతికి షోడశోపచారములతో పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు పూజచేయవలెను.
తరువాత తిరగలికి పసుసు రాసి కుంకుమ బొట్టు పెట్టి తిరగలి పిడికి తోరణము కట్టి, ఒక ముత్తైదువుచే తిరగలిలో 5 గుప్పెళ్ళు శెనగలు పోసి విసరవలెను. ఈవిధంగా ఐదురుగు ముత్తైదువులతో చేయించాలి.
తర్వాత గణపతిని ఒక చిన్న పెట్టెతో ఉంచి బియ్యం, విసిరిన శెనగలు ఈ క్రొత్త టవలులో ఉంచి మూటకట్టి దేవుని గదిలో భద్రపరచాలి. 16 రోజుల పండుగ రోజు లేదంటే ఆ లోపుగానీ ఆ మూటను తీసి శెనగపప్పు బియ్యముతో ఉండ్రాళ్ళు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి తరువాత అందరికి పంచి పెట్టాలి.
ఆచారాన్ని బట్టి మినప వడియాలుకూడా పెడతారు. దీనినే మీదుకట్టే విధానం అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.