Vasantha Panchami 2024: వసంత పంచమి రోజు పసుపు రంగు వస్త్రాలు ఎందుకు ధరిస్తారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?
Vasantha panchami 2024: వసంత పంచమి రోజు ఎక్కువగా పసుపు రంగు వస్త్రాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఆరోజు పసుపు మిఠాయిలు అమ్మవారికి సమర్పిస్తారు. పసుపు రంగు ఎందుకు ఎంచుకుంటారు? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది ఇక్కడ తెలుసుకోండి.
Vasantha panchami 2024: జ్ఞానం, ఏకాగ్రతని ప్రసాదించమని కోరుకుంటూ చదువుల తల్లి సరస్వతిని పూజిస్తారు. ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి జరుపుకుంటారు. ఏటా మాఘ మాసం శుక్ల పక్షం ఐదో రోజున వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈరోజు ఎక్కువగా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తారు. అమ్మవారికి సమర్పించే వస్త్రాల దగ్గర నుంచి దేవికి సమర్పించే నైవేద్యం వరకు అన్ని పసుపు రంగులోనే ఉంటాయి. పూజకి పసుపు రంగు పూలు ఉపయోగిస్తారు. అయితే వసంత పంచమికి పసుపు రంగు వస్త్రాలు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు.
పసుపు రంగు వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
పసుపు సాధారణంగానే శుభ సూచకం. ఎటువంటి శుభకార్యం అయినా సరే ముందు పసుపుతోనే ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంతోషానికి సూచికగా భావిస్తారు. వసంత పంచమి రోజున భూమి మీద పదే సూర్యుడి సూర్య కిరణాలు పసుపు రంగులోకి వస్తాయి. పసుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు.
వసంత రుతువు సూచికంగా కూడా పసుపు ఉంటుంది. ఇది శక్తి, ఉత్సాహానికి ప్రతీకగా ఉంటుంది. వసంత రుతువులో చలి తగ్గి ఎండలు మొదలవుతాయి. ఈ సమయంలో పంట పొలాలలో వేసిన ఆవాల పువ్వులు వికసిస్తాయి. ఈ పువ్వుల రంగులు కూడా పసుపు. చెట్లలో కొత్త ఆకులు కనిపిస్తాయి. వసంత కాలంలో ఎక్కడ చూసినా పసుపు రంగు కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పసుపు దేవగురువు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది.
జ్ఞానం, మేధస్సు వంటి వాటికి గురువు ప్రతీకగా భావిస్తారు. పసుపు ఉపయోగించడం వల్ల బృహస్పతి స్థానం బలపడుతుంది. గురు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి తెలివితేటలు, మేధస్సు అద్భుతంగా ఉంటుంది. అన్నింటా మంచి ప్రావీణ్యం సంపాదించి చదువులో రాణిస్తాడు. అందుకే వసంత పంచమి రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు వస్తువులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆరోగ్య పరంగా కూడా పసుపు మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ మాతని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు.
వసంత పంచమి రోజు పసుపు పరిహారాలు
వసంత పంచమి రోజు పసుపుని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పాలలో పసుపు కలిపి సరస్వతీ దేవికి అభిషేకం చేయడం వల్ల దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. సంతోషకరమైన జీవితం పొందుతారు. అది మాత్రమే కాదు కెరీర్ పురోగతికి ఈ పరిహారాలు ప్రభావవంతంగా పని చేస్తాయి.
చదువులో ఆటంకాలు ఎదురవుతుంటే ఈ పసుపు పరిహారం పాటించి చూడండి. వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని 108 పసుపు రంగు బంతి పూలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల చదువులోని సమస్యల్ని అధిగమించగలుగుతారు.
వసంత పంచమి రోజు అమ్మవారికి శనగపిండి లడ్డు లేదా బర్ఫీ వంటి పసుపు రంగు స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. వాటిని ఏడుగురు అమ్మాయిలకు పంచి పెట్టాలి. ఇలా చేస్తే సరస్వతీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారం పాటించడం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి.
వసంత పంచమి రోజు చదువుకి సంబంధించి వస్తువులు ఎక్కువగా దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వాటితో పాటు పసుపు రంగు అరటి పండ్లు, కాయధాన్యాలు, పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలు దానం చేయడం వల్ల తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.