Navagraha dosha nivarana: నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి ఏ వస్తువులు దానం చేయాలి?
Navagraha dosha nivarana: కొంతమంది జాతకంలో గ్రహ దోషాలు ఉంటాయి. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ గ్రహం దోషానికి ఎటువంటి దోష నివారణ పాటించాలనే విషయం గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ వివరించారు.
Navagraha dosha nivarana: గ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి ఆయా గ్రహాలకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి. అలా చేయడం వల్ల గ్రహాల ద్వారా కలిగే అరిష్టాలు, రోగాలు నివారింపబడతాయి. వ్యక్తి జీవితం ఒడిదుడుకులు లేకుండా గడుస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సూర్యగ్రహ దోష నివారణకు సూర్యునికి సంబంధించిన వస్తువులు గోధుమలు, బెల్లం, కుంకుమపువ్వు, మాణిక్యం, బంగారం, ఎర్రని వస్త్రం, రాగి వస్తువులు, ఎర్రచందనం మొదలైనవి దానం చేయాలి. ఈ దానం ఆదివారం ఉదయం పూట చేయాలని చిలకమర్తి తెలిపారు.
చంద్రగ్రహ దోష నివారణకు చంద్రునికి సంబంధించిన వస్తువులు ముత్యం, రత్నం, బియ్యం, చక్కెర, తెల్లనివస్తాలు, పాలు, పెరుగు, వెండి మొదలైనవి పౌర్ణమి రోజున దానం చేయాలి. లేదంటే సోమవారం నాడు సూర్యాస్తమయ సమయం నందు దానం చేయాలి ప్రభాకర చక్రవర్తి తెలిపారు.
కుజ గ్రహ దోష నివారణకు కుజ గ్రహానికి సంబంధించిన వస్తువులు గోధుమలు, బెల్లం, పగడం, రాగి వస్తువులు, బంగారం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు, మసూర్ పప్పు, కుంకుమ పువ్వు దానం చేయాలి. శ్రేష్టమైన సమయం మంగళవారం మధ్యాహ్నం తరువాత దానం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బుధ గ్రహ దోష నివారణకు బుధగ్రహానికి సంబంధించిన వస్తువులు మరకతం, బంగారం లేదా కంచు, ఆకుపచ్చని వస్త్రాలు, ధాన్యం, పెసలు, కర్పూరం, పండ్లు మొదలైనవి ప్రాతఃకాల సమయంలో దానం చేయాలి.
గురు గ్రహ దోషంనుండి విముక్తి పొందడానికి గురువుకు సంబంధించిన వస్తువులు పసుపు రంగు వస్త్రాలు, పసుపు కలిపిన అన్నం, వెండి, బంగారం, పువ్వులు, శనగపప్పు, పసుపు, అరటిపండ్లు ఇవి కాక పసుపు రంగులో ఉన్నఏ పదార్ధం అయినా గురువారం సాయంకాలం దానం చేయడం ఉత్తమం.
శుక్ర గ్రహ దోషం నుండి నివారణ పొందడానికి శుక్రుని సంబంధించిన వస్తువులు బియ్యం, పాలు, నెయ్యి, మినుములు, వెండి, స్ఫటికం, తెల్లచందనం, తెల్లటి వస్త్రాలు, చక్కెర, కలకండ, ఇతర తెల్లని పదార్థాలు శుక్ర గ్రహం ప్రారంభ సమయంలో దానం చేయాలి.
శని గ్రహ శాంతి చేయడానికి శని గ్రహ సంబంధిత వస్తువులు నల్లని వస్త్రాలు, నల్లని గొడుగు, నల్ల నువ్వులు, మినుములు, ఇనుము మొదలైనవి దానం చేయాలి. నల్లని ఆవుకు తాను తినదలచుకున్న వాటిలో కొంతభాగం బెల్లంతో తినిపించాలి. నల్ల రంగులో ఉన్న కుక్కకు నల్లని మినుములతో చేసిన పకోడి తినిపించాలి. దీనివల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. శనికి మధ్యాహ్నం చేసే శనిగ్రహం దానం వలన విశేష ఫలితం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.