Pushya paurnami: నేడు పుష్య పౌర్ణమి.. పూజా విధి, పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి?
Pushya paurnami: ఒకటి కాదు రెండు కాదు ఈ పౌర్ణమి రోజు ఐదు రాజయోగాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్య పౌర్ణమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది.
Pushya paurnami: హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. నేడు పుష్య పౌర్ణమి. ఈరోజు ఉపవాసం ఉంది చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు.

విష్ణువు, లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి కలుగుతాయని విశ్వాసం. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ధన సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారికి ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అష్టలక్ష్మీ స్త్రోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. రోజూ అష్టలక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.
పౌర్ణమి తిథి
శుక్ల పక్ష పౌర్ణమి తిథి ప్రారంభం జనవరి 24 రాత్రి 9.49 గంటల నుంచి జనవరి 25 రాత్రి 11.23 వరకు ఉంటుంది.
ఈ ఏడాదిలో వచ్చిన మొదటి పౌర్ణమి ఇదే. ఈరోజు ఉపవాసం ఉండి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.
ఐదు శుభ యోగాలు
ఈ ఏడాది వచ్చిన తొలి పౌర్ణమి రోజున ఐదు శుభ యోగాలు ఏర్పడ్డాయి. దీని వల్ల ఈ పౌర్ణమి ప్రాముఖ్యత మరింత పెరిగింది. సర్వార్ధ పుష్య పౌర్ణమి రోజు ప్రీతి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, గురు పుష్య యోగం, అమృత్ సిద్ధి యోగం, రవి యోగం వంటివి ఏర్పడ్డాయి. ఇది మాత్రమే కాదు త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడింది. గురు పుష్య యోగంలో లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు.
పౌర్ణమి పూజా విధి
పుష్య పౌర్ణమి రోజు చేసే స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు చాలా మంది పవిత్రమైన నదీ స్నానం ఆచరిస్తారు. అలా కుదరని సందర్భంలో గతంలో తీసుకొచ్చిన గంగా జలం నీటిలో కలుపుకుని పవిత్ర స్నానం ఆచరించాలి. ఈరోజు లక్ష్మీ నారాయణుడిని పూర్తి ఆచారాలతో పూజించాలి. పసుపు రంగు పండ్లు, పూలు, వస్త్రాలని విష్ణుమూర్తికి, గులాబీ లేదా ఎరుపు రంగు పూలు, అలంకరణ వస్తువులు లక్ష్మీమాతకి సమర్పించాలి. ఈరోజున సత్యనారాయణ కథను చదవడం పుణ్యప్రదంగా భావిస్తారు.
బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే మంచిది. పవిత్ర పుణ్యక్షేత్రంలో స్నానం చేయడం వల్ల పాపం నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పరిహారాలు పాటించాలి. అలాగే సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. పచ్చి పాలని పవిత్ర నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్ర దేవుని అనుగ్రహం పొందుతారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆనందం, ప్రశాంతత ఉంటుంది. ఈరోజు వీలైతే ఉపవాసం ఉండండి. గంగా జలంతో దేవతలందరికీ అభిషేకం చేయాలి.
ఈరోజున దాన ధర్మాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి. ఇంటి చుట్టుపక్కల ఆవు ఉంటే వాటికి ఆహారం పెట్టండి. ఇలా చేస్తే అనేక రకాల లోపాల నుంచి బయట పడొచ్చు. విష్ణువుని పూజించేటప్పుడు తప్పనిసరిగా భోగంలో తులసిని చేర్చాలి.