Vasantha panchami 2024: వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని ఇలా పూజిస్తే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు
Vasantha panchami 2024: వసంత పంచమి రోజు సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయడం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోజు అమ్మవారికి ఇలాంటి వస్తువులు సమర్పిస్తే జ్ఞానం వరంగా లభిస్తుంది.
Vasantha panchami 2024: చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తూ వసంత పంచమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 న వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి రోజే సరస్వతీ దేవి జన్మించిందని చెప్తారు. ఈరోజు సరస్వతీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం, వివేకం లభిస్తాయి. విద్య, జ్ఞానం, వాక్కు దేవతగా సరస్వతీ దేవిని పరిగణిస్తారు.
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎంతో పవిత్రమైన వసంత పంచమి రోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆరోజు అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో ఉన్నతంగా రాణిస్తారని భావిస్తారు. వసంత పంచమి రోజు సరస్వతీ దేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తున్నారా? అయితే అమ్మవారి విగ్రహం ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
వాస్తు ప్రకారం ఎలాంటి విగ్రహం తీసుకురావాలి?
వాస్తు ప్రకారం సరస్వతీ దేవి విగ్రహం సున్నితంగా, ఆనందకర భంగిమలో ఉన్నదాన్ని కొనుగోలు చేయాలి. తామర పువ్వు మీద సరస్వతీ దేవి కూర్చున్న భంగిమలో ఉన్నది తీసుకోవాలి. వాస్తు ప్రకారం సరస్వతీ దేవి విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో పూజించడం శుభప్రదంగా పరిగణించరు. విరిగిన సరస్వతీ మాత విగ్రహాని ఆలయంలో ఉంచకూడదు. దీని వల్ల నెగీటివిటీ పెరుగుతుంది.
సరస్వతీ మాత విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. వసంత పంచమి రోజు రెండు విగ్రహాలు పెట్టకూడదు. అమ్మవారి చేతిలో వీణ ఉండాలి. తామర పువ్వు మీద కూర్చుని ఒక చేతిలో వీణ, మరో చేతిలో జపమాల, పుస్తకం పట్టుకుని ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అమ్మవారికి ఏం సమర్పించాలి?
వసంత పంచమి రోజు శుభ కార్యాలకు చాలా మంచిది. కళ్యాణం, నామకరణం, గృహ ప్రవేశం, షాపింగ్ వంటివి చేస్తారు. ఈరోజు వివాహం చేసుకునే వారికి అందరి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఆ దంపతుల బంధం ఏడేడు జన్మల పాటు కొనసాగుతుందని విశ్వసిస్తారు. ఈ ఏడాది వసంత పంచమి ప్రేమికుల దినోత్సవం రోజున వచ్చింది.
పురాణాల ప్రకారం బ్రహ్మ సరస్వతీ దేవిని సృష్టించాడు. లోకం మొత్తం మాట లేకుండా మూగ సైగలతో ఉండటం చూసి బ్రహ్మ సరస్వతీ దేవిని సృష్టించినట్టు చెప్తారు. ఆమె రాకతో అందరికీ వాక్కు వచ్చింది. అందుకే వసంత పంచమి రోజున తల్లి సరస్వతికి కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించి పూజ చేస్తారు. ఈ వస్తువులు సమర్పించి పూజ చేయడం వల్ల జ్ఞాన అనుగ్రహాన్ని పొందుతారు.
పసుపు పువ్వులను సరస్వతీ దేవికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. వాటిని ఇస్తే అమ్మ సంతోషించి జ్ఞానాన్ని వరంగా ప్రసాదిస్తుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. పూజ చేసేటప్పుడు పుస్తకం, పెన్ను వంటి వాటిని కూడా పెట్టాలి. దీని వల్ల జ్ఞానం పొందుతారు. సంగీత కళాకారులు అయితే సంగీత వాయిద్యాలు పెట్టవచ్చు.
నాట్యం చేసే వాళ్ళు కాలికి కట్టుకునే గజ్జలు పెడతారు. పసుపు రంగు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి. ఆచారాల ప్రకారం సరస్వతీ దేవిని పూజించిన తర్వాత పసుపు రంగు స్వీట్లు అమ్మవారికి సమర్పించాలి. శనగపిండి లడ్డూ, బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టవచ్చు.