Naivedyam: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏ దేవతకు ఎటువంటి నైవేద్యం సమర్పించాలి?
Naivedyam: దేవతలు, దేవుళ్ళకి ప్రతి ఒక్కరూ నైవేద్యం సమర్పిస్తారు. గుడిలో, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నైవేద్యం లేకుండా పూజ పూర్తి చేయరు. అయితే ఏ దేవతకి ఎటువంటి నైవేద్యం సమర్పించాలో తెలుసా?
భారతీయ సనాతన ధర్మంలో దేవతారాధనకి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మహా విష్ణువును పూజించేటటువంటి సాంప్రదాయాన్ని వైష్ణవ సాంప్రదాయంగా పిలుస్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన దశావతార ఆరాధనలలో వైష్ణవ సాంప్రదాయాలకు సంబంధించిన నైవేద్య విధానాలను ఆచరించడం తప్పనిసరి. ఏ దేవతలకి ఎటువంటి నైవేద్యం సమర్పించాలనే దాని గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ వివరించారు.
శివుడికి ఏ నైవేద్యం
ఆది గురువు శివుడికి సంబంధించిన ఆరాధనలలో విశేషంగా గణపతి, శివుడు సుబ్రహ్మణ్యుడు వంటి దేవళ్ళని పూజిస్తారు. శైవ సాంప్రదాయంలో దేవతల నైవేద్యానికి సంబంధించి విధి విధానాలున్నాయి. శక్తి ఆరాధనలలో విశేషించి మహాలక్ష్మీ, మహాసరస్వతి, మహాకాళి (పార్వతీ) వంటి దేవతలకు అటువంటి నైవేద్యాలు చెప్పబడి ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భగవంతుడికి భక్తితో చేసే ప్రార్ధన అన్నింటి కంటే ప్రాధాన్యమైనది. అలాగే భక్తితో సమర్పించే నివేదన తమ నైవేద్యము ఎటువంటిది అయినా శుభఫలితాలు ఇస్తాయి. భగవంతుడికి భక్తితో ఒక పువ్వును గాని, తులసి నీరు గాని, పాలను గాని లేదా చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా ఎలాంటి దోషము ఉండదని చిలకమర్తి తెలిపారు. వివిధ దేవతలకు సంబంధించిన వివిధ నైవేద్యాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.
శివుడి పూజలో చిమ్మిలి నివేదించాలి. గౌరీదేవికి పొంగలి నివేదించాలి. లక్ష్మీదేవికి వడపప్పు, పానకం నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతారు. విష్ణుమూర్తికి చిత్రాన్నం, అట్లు నివేదించాలి. శ్రీ లలితాదేవికి క్షీరాన్నం పులిహోర, గారెలు నివేదించాలి. వినాయకుడికి కుడుములు నివేదించాలి. చల్లని చూపు చూసే చంద్రునికి చలిమిడి, సూర్యునికి పాయసం నివేదించాలి.
అందరు దేవుళ్ళకు పువ్వులు, దీపాలు అంటే మహా ఇష్టం. లలితాదేవికి దానిమ్మ పళ్ళు, విత్తనాలతో తేనె జోడించి నైవేద్యం సమర్పిస్తే అభీష్టఫలసిద్ధి కలుగుతుంది. వినాయకుని అరటిపండ్లు, చెరకుగడలు సమర్పిస్తూ సంకటనాశక గణేశస్తుతితో అర్చించిన భక్తులకి సకల శుభాలు కలుగుతాయి. నాగేంద్రునికి వడపప్పు, చలిమిడి సమర్పిస్తే పుట్టలో నుండే నాగు చల్లగా చూస్తాడని శాస్త వచనం. పరమేశ్వరునికి అభిషేకం ప్రీతి. చెరుకురసం, తేనె, ఆవుపాలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ ఫలాల రసోదకం, రుద్రాక్షోదకాల రుద్రాభిషేకం చేస్తే అదే మహానైవేద్యంగా స్వామి వారు భావించి ప్రీతి చెంది భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.