Vasantha panchami 2024: వసంత పంచమి విశిష్టత ఏంటి? సరస్వతీ దేవిని ఎందుకు పూజిస్తారు?-vasantha panchami 2024 date and muhurtham know the significance of saraswati puja on this festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vasantha Panchami 2024: వసంత పంచమి విశిష్టత ఏంటి? సరస్వతీ దేవిని ఎందుకు పూజిస్తారు?

Vasantha panchami 2024: వసంత పంచమి విశిష్టత ఏంటి? సరస్వతీ దేవిని ఎందుకు పూజిస్తారు?

HT Telugu Desk HT Telugu
Feb 06, 2024 01:58 PM IST

Vasanta panchami: వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజిస్తారు. వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి? ఆరోజు సరస్వతీ దేవిని ఎందుకు పూజిస్తారు అనేది పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

వసంత పంచమి విశిష్టత
వసంత పంచమి విశిష్టత (freepik)

మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి అని, శ్రీపంచమి అని అంటారు. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో 14 ఫిబ్రవరి 2024 రోజు మాఘ మాస శుక్ల పక్ష పంచమి శ్రీ పంచమి అని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. ఇది రుతు సంబంధమైన పర్వం. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది. వసంత రుతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుద్ధ పంచమినాడు (జనవరి- ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారత దేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు.

జ్ఞానానికి అధిదేవత సరస్వతీ దేవి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పటం మన సంప్రదాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు?

శ్రీపంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని బాసర క్షేత్రంలోను, ఇతర సరస్వతీ దేవాలయాలలో శ్రీ పంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. రతీమన్మథులను పూజించి మహోత్సవమొనరించవలెనని, దానము చేయవలెనని, దీనివలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపారు. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు.

“మాఘశుద్ధ పంచమినాడు వసంతరుతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజించవలెను. చైత్రశుద్ధ పంచమి వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను” అని వ్రత చూడామణిలో పేర్కొనబడిందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని అనుగ్రహిస్తుందంటారు. సత్వరజస్తమోగుణాలను బట్టి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు.

ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. అమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రితవరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది.

ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. ఉత్తర భారతంలో ఈపూజను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపదగా సరస్వతిని ఈరోజు పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీపంచమినే రతికామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామ దేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి, కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.

రుద్రుని భ్రుకుటి నుండి అనగా కనుబొమల నుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి. తారిణి, తరళ, తార, త్రిరూపా, ధరణీరూపా, స్తవరూపా, మహాసాధ్వీ సర్వసజ్జనపాలికా, రమణీయా, మహామాయా, తత్త్వజ్ఞానపరా, అనఘా, సిద్ధలక్ష్మి, బ్రహ్మాణి, భద్రకాళి, ఆనందా... అనేవి తంత్రశాస్తాల ఆధారంగా ఈ దేవతా దివ్యనామాలు. ఈ రోజున సరస్వతీ దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి, నేతితో చేసిన పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం నివేదించాలి. అమ్మవారిని ఇలా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది.

కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంది. పుష్య, మాఘ ద్వయంతో కూడిన అదివారం రోజున శ్రీపంచమి వస్తే, ఆరోజున సూర్యారాధన వల్ల కోటి గ్రహణ స్నాన పుణ్యఫలం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner