Magha snanam: మాఘస్నానం అంటే ఏమిటి? ఈ స్నానం ఆచరించడం వల్ల కలిగే పుణ్య ఫలాలు ఏంటి?
Magha Snanam: మాఘ మాస స్నానానికి ఉన్న ప్రాముఖ్యత, మాఘ స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Magha snanam: మాఘ మాసంలో ప్రతిరోజూ అంటే ముప్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతిరోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొాంటున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘ స్నాన మహిమ కథ
మాఘ పురాణం తొలి అధ్యాయంలో స్నానమహిమకు సంబంధించిన కథ ఉంది. అది ఏంటంటే..
రఘు వంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు. ఆయన ఓ రోజు వేటకోసం హిమాలయ ప్రాంతాలలో ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన రాజుని చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘ స్నానం చేసినట్టుగా లేదు. త్వరగా చెయ్యి అని చెప్పాడు.
మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడుని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తనదోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నానం ఫలితం వివరించమని వేడుకొన్నాడు.
అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతాఇంతా కాదు. పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మకర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు.
తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులూ ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన ఆ మహర్షి అది మాఘ మాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని, పాపాలు, వాటివల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు.
మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడి ముఖం అందంగా తయారైంది. ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఒక మాట చెప్పాడు. మాఘస్నానం చెయ్యటం తెలియని వారికి దాని విశేషం చెప్పి చేయించడం, ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చినవారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్యఫలితాన్ని పొందడం కూడా శ్రేయస్కరం అంటాడు సూతుడు.
దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పటం ఇలాంటిదే. ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల ఉదయం కాలంలో చేసే స్నానం వల్ల అరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలోని వైద్యులు కూడా చెప్పటం కనిపిస్తుందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘమాస మహత్యము తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. ఈ మాఘమాస నదీస్నానం అత్యంత ఫలదాయకమైనది. ఈ మాఘమాస నదీస్నానం చేయటం వల్ల లభించు పుణ్యఫలము మరే ఇతర యజ్ఞయాగాదులు, క్రతువులు చేసినా లభించదు. ఈ మాఘ మాస నదీస్నానం చేయుట వలన మనుష్యులు అత్యంత పుణ్యాత్ములు అవుతారు. ఈ మాఘ మాస స్నానం శాశ్వత పుణ్యలోక ప్రాప్తివచ్చును. అంతే గాని ఇతర యజ్ఞయాగాదులవలె తాత్మాలిక ఫలితమును ఇవ్వదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలెనన్న మాఘమాస నదీ స్నానమొక్కటే తరుణోపాయము. మరే ఇతర పుణ్య కార్యాలవలన ఇది సాధ్యం కాదు.
మాఘ స్నానం ఫలశ్రుతి
వశిష్టులవారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించితినని సూతమహర్షి శౌనకాది మునులతో అంటారు. ‘మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చినది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానములను నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్వాలయమును దర్శించి, శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి..’ అని వివరించారు.
మాఘస్నాన పుణ్యఫలమును వివరించు కథ
పరస్త్రీ వ్యామోహము పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘపురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్యఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ.
పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేదపాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేదపాఠాలతో మార్మోగుతూ ఉండేది. మిత్రవిందుడుకి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంటబెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు.
రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలసి రాక్షసులను సంహరించేందుకు ముందుకు వెళ్ళాడు. కాని ఇంద్రుడి మనస్సు ముని పత్నిమీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారేవేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు.
ఆ సమయానికి మిత్రువిందుడు వచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఈ వేళ ఏంకోరుకొని ఇక్కడకు వచ్చావు అని ముని మళ్ళీ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు.
ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు.
దివ్యశక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినడం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్రపరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండగుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండగుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం గడిపాడు దేవేంద్రుడు.
ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని వారికి శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వరగవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.
కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి తమకొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలు అనుభవించాల్సిరావడం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘస్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు.
మాఘ మాసంలో ఒక్క రోజున నియమంగా నదీస్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశాడు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘ మాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఆయనను తీసుకువచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి శాపం, పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చిందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.