Durba grass: దర్భ గడ్డి ఎందుకు ఎంత పవిత్రం? దీని వెనుక ఉన్న కథ ఏంటి?-what is kusha or durba grass why its important in hindu rituals ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Durba Grass: దర్భ గడ్డి ఎందుకు ఎంత పవిత్రం? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Durba grass: దర్భ గడ్డి ఎందుకు ఎంత పవిత్రం? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Gunti Soundarya HT Telugu
Dec 23, 2023 09:02 AM IST

Kusha grass: పూజలు చేసే ముందు చాలా మంది ఉంగరం వేలికి గడ్డితో చేసిన ఒక ఉంగరాన్ని ధరిస్తారు. దాన్ని దర్భ గడ్డి అంటారు. ఎంతో పవిత్రమైనదిగా ఆ గడ్డిని భావిస్తారు.

కుశ గడ్డి ప్రాముఖ్యత
కుశ గడ్డి ప్రాముఖ్యత (pexels)

Durba grass: హిందూ సంప్రదాయంలో దర్భ గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దర్భ అనేది ఒక గడ్డి మొక్క. దీన్ని కుశదర్భ అని కూడా పిలుస్తారు. ఈ దర్భ లేకుండా ఎటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు పూర్తి కావు. వివిధ సంస్కృతులలో ప్రత్యేకించి హిందూ మతంలో కుశదర్భ చారిత్రాత్మకంగా ముఖ్యమైనది. మతపరమైన వేడుకల్లో దీన్ని ఉపయోగిస్తారు.

దర్భ గడ్డి వెనుక ఉన్న కథలు

ఒకానొకప్పుడు వృత్రాసురుడు అనే రాక్షసుడు దేవతలని భయభ్రాంతులకి గురి చేసే వాడు. ఇంద్రుడి బలమైన ఆయుధం వజ్రాయుధం కూడా అతన్ని ఓడించలేకపోయింది. బ్రహ్మ జోక్యం చేసుకుని వజ్రాయుదాన్ని తన కమండలంలో నానబెట్టి మళ్ళీ దాడి చేయమని ఇంద్రుడుకి సూచించాడు. ఈసారి ఆయుధం రాక్షసుడిని విజయవంతంగా ఓడించింది. తన ప్రతీకార కోపంతో వృత్రాసురుడు శరీరం నీటిలో మునిగిపోతూ నీటికి ఉన్న శక్తిని తొలగించాలని చూస్తాడు. దీన్ని ఎదుర్కోవడానికి బ్రహ్మ నీటి వనరులను పవిత్ర దర్భ గడ్డిగా మార్చాడని చెప్తారు.

కుశ గడ్డి వెనుక మరొక కథ కూడా ఉంది. కూర్మ పురాణం ప్రకారం విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆ పర్వ రాపిడికి కూర్మము వంటి మీడ ఉండే కేశాలు సముద్రంలో కలిశాయి. అవి ఒడ్డుకుని కొట్టుకుని వచ్చి కుశముగా మారాయని చెప్తారు. క్షీర సాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కొన్ని చుక్కలు ఈ కుశ గడ్డి మీడ పడటం వల్ల వాటికి అంత పవిత్రత వచ్చిందని అంటారు. వరాహ పురాణం ప్రకారం ఈ దర్భలు వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహా విష్ణువు శరీర కేశాలని చెప్తారు. అందుకే కుశ గడ్డిని మహావిష్ణువు రూపాలని భావించి భాద్రపద మాసంలో దుర్గాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటికి ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల శక్తి ఉందని నమ్ముతారు.

హిందూ మతంలో దర్భ గడ్డి ప్రాముఖ్యత

కుశ గడ్డి హిందూ ఆచారాలు, వేడుకల్లో ముఖ్యమైనదిగా భావిస్తారు. మతపరమైన ఆచారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వేడుకలు, పూజలు, యజ్ఞాలు జరిగే స్థలాన్ని శుద్ది చేయడానికి, రక్షించడానికి ఉపయోగిస్తారు. దైవ ఆరాధన చేసేందుకు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావాలకి వ్యతిరేకంగా ఒక కవచాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు.

దర్భ గడ్డి కట్టలను తరచుగా పూజ చేసే సమయంలో ఉపయోగించే పవిత్రమైన కుంభాలలో ఉంచుతారు. ఇవి ప్రార్థన, ఆచరాల శక్తిని పెంపొందించి దైవానికి మనల్ని దగ్గర చేస్తాయి. దర్భ గడ్డిలో చేసిన ఉంగరాలను పూజారులు, పూజ చేసే వ్యక్తులు ధరిస్తారు. ఈ ఉంగరాలు ధరించే వారిని ప్రతికూల ఆధ్యాత్మిక శక్తుల నుంచి కాపాడుతుందని విశ్వసిస్తారు.

వివాహ ఆచారాలలో స్త్రీలు దర్భ గడ్డితో చేసిన పట్టీని ధరిస్తారు. అలాగే బ్రహ్మచారులు ఉపనయం చేసే సమయంలో ఈ దర్భ గడ్డి పట్టీని ధరిస్తారు. పితృలకు తర్పణం సమర్పించేటప్పుడు తప్పనిసరిగా దర్భ గడ్డి ఉంగరం ధరిస్తారు. పూర్వీకులని ఆవాహన చేసేందుకు ఈ దర్భ కట్టలు ఉపయోగించబడతాయి.

గ్రహణ సమయంలో

గ్రహణ సమయంలో ముఖ్యంగా సూర్య గ్రహణం సమయంలో కుశ గడ్డికి హిందూ ఆచారంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం గ్రహణ కాలం మొత్తం అపవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ సమయంలో వంట చేయడం, తినడం, ఇతర రోజువారీ పనులు నివారిస్తారు.

భక్తులు ఆహార పదార్థాలపై పచ్చళ్లపై కుశ గడ్డి పెడతారు. వీటకి శుద్ది చేసే గుణాలు ఉన్నాయని అవి ఆహారాన్ని శుభ్రపరుస్తాయని అంటారు. గ్రహణం ద్వారా నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి తరచుగా నీటి పాత్రలపైన గడ్డి ఉంచుతారు.

WhatsApp channel