Friday mistakes: శుక్రవారం రోజున పూజగదిలో మీరు చేయకూడని పనులు ఇవే-these are the things you should not do in the puja room on friday ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Friday Mistakes: శుక్రవారం రోజున పూజగదిలో మీరు చేయకూడని పనులు ఇవే

Friday mistakes: శుక్రవారం రోజున పూజగదిలో మీరు చేయకూడని పనులు ఇవే

Gunti Soundarya HT Telugu
Dec 22, 2023 12:07 PM IST

Friday: శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందుకే కొన్ని పనులు శుక్రవారం రోజు చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించవని అంటారు.

శుక్రవారం చేయకూడని పనులు ఇవే
శుక్రవారం చేయకూడని పనులు ఇవే (pixabay)

Friday: శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆరోజు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. తమ ఇంత లక్ష్మీదేవి పుట్టిందని అపురూపంగా చూసుకుంటారు. వారాల్లో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు.

శుక్రవారం పూట లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. ఆరోజు దానధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి వారి మీద కరుణ చూపిస్తుందని చెబుతారు. అలాగే శుక్రవారం మన ఇంట్లో ఉన్న పూజ గదిలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుంచి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు.

లక్ష్మీదేవిని నిమజ్జనం చేయకూడదు

లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పనులు చేస్తారు. కానీ శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. కొంతమంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి దాని స్థానంలో కొత్త దాన్ని తీసుకొచ్చి పెడతారు. కానీ శుక్రవారం రోజు పొరపాటున కూడా విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. కావాలంటే కొత్త ప్రతిమ తీసుకొచ్చి పూజ గదిలో ప్రతిష్టించుకోవచ్చు.

మహిళలు శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, జన్మ నక్షత్రం రోజుల తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు. అలాగే గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదు. ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయని కొట్టడం చేయకూడదు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ తప్పని సరిగా రాయాలి. అలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు.

వెన్న కరిగించకూడదు

శుక్రవారం దీపం పెట్టేటప్పుడు ఎవరూ నిద్రపోకూడదు. రెండు సార్లు దీపం పెట్టాలి. సూర్యోదయం 6 గంటల లోపు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయం కూడా ఆరు గంటల్లోపే దీపం వెలిగించాలి. శుక్రవారం పూట వెన్నని కరిగించకూడదు. వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఆ రెండు రోజుల్లో కరిగించకూడదు. వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మంగళ, శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు. అందుకే ఆ రోజుల్లో డబ్బులు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వరు, తీసుకోరు. అలా చేస్తే తమ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవని నమ్ముతారు.

పూజ గదిలో ఎప్పుడు అశుభ్రంగా ఉండకూడదు. వాడిపోయిన పువ్వులు, చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు, విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచకూడదు. అమ్మవారి ముందు తమలపాకులు, వక్క సమర్పించే ముందు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి. సరి సంఖ్యలో మాత్రమే తమలపాకులు పెట్టాలి. అంటే 2, 4, 6, 8 ఆకులు అమ్మవారి ముందు పెట్టాలి. అలాగే ప్యాకెట్ లో ఉండే వక్క పొడి పూజకి ఉపయోగించకూడదు.

ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు

దేవుని ముఖాలు కనిపించకుండా ఉండే మాదిరిగా పూలతో కప్పి ఉంచకూడదు. పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలని పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించేందుకు ఉపయోగించే పాత్రలు స్టీల్ వి పెట్టకూడదు. ఇత్తడి లేదా వెండి పాత్రల్లో మాత్రమే దీపాలని వెలిగించాలి. అలా కుదరకపోతే మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు.

శుక్రవారం పూట మహిళలు తమ చేతులకి వేసుకునే గాజులు తీసేయకూడదు. అవి పగిలితే అశుభంగా భావిస్తారు. పసుపు, కుంకుమ చెయ్యి జార్చుకోకూడదు. ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మి అత్తింటికి వెళ్ళిపోతుంది.