దేవతలకు స్వర్గాధిపత్యం దక్కింది కూర్మావతారం వల్లే
దేవతలకు స్వర్గాధిపత్యం దక్కింది కూర్మావతారం వల్లేనని పురాణాలు చెబుతున్నాయి.
మహావిష్ణువు దశావతారాల్లో నేరుగా రాక్షస సంహారం గోచరించకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించినది కూర్మావతారం. పూర్వం దేవతలు దూర్వాస మహర్షి శాపంతో దానవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకొని అసురుల వేధింపులను తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలసి పురుషోత్తముని ప్రార్ధించారు.
కరుణాంతరంగుడైన శ్రీహరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. పాలసముద్రములో సర్వతృణాలు, లతలు, బెషధాలు వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి మహాసరాన్ని తరితాడుగా చేసి మధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని, అమృతం లభిస్తుందని పలికాడు. ఆ మేరకు ఇంద్రుడు దానవులను కూడా సాగర మధనానికి అంగీకరింపజేశాడు. దేవదానవులు మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకున్నారు. పాముకు విషం తలభాగంలో ఉంటుంది అది మృత్యుస్వ్పరూపం. రాక్షసులు తామసులు. తమస్సు పాపభూయిష్టం. దానిని అణచివేస్తే తప్ప లోకంలోనైనా మనస్సులోనైనా ప్రకాశం కలుగదు.
అందుచేత శ్రీహరి రాక్షసుల్ని మృత్యుస్వరూపమైన వాసుకి ముఖం వద్ద నిలిపాడు. మధనంలో బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడంతో పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు శ్రీహరి కూర్మావతారంలో వస్తాడు. బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంలో సుందర కూర్మరూపంలో మహావిష్ణువు అవతరించాడు.
పాలసముద్రములో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి తన కర్పరంపై నిలిపాడు. క్షీరసాగర మధనంలో చిట్టచివరిగా అమృత కలశాన్ని విష్ణువు మోహినీ రూపం దాల్చి దానవులను సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని ప్రసాదించాడు. అమృతము లభించకపోవడంతో రాక్షసులు దేవతల చేతిలో ఓడిపోతారు. దేవతలకు తిరిగి స్వర్గాధిపత్యము లభిస్తుంది. ఇది కూర్మావతార కథగా ప్రసిద్ధికెక్కింది.
శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై, విశ్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. ఈ కూర్మానికి వెన్నులో మేష, వృషభ రాశులు, తలలో మిథున, కర్మాటకాలు, ఆగ్నేయంలో సింహరాశి, దక్షిణ ఉదరభాగంలో కన్య, తులలు, నైరుతిలో వృశ్చికం, తోకపై ధనుస్సు, వాయువ్యాన మకరం, ఎడమవైపు కుంభం, ఈశాన్యంలో మీనరాశి ఆక్రమించుకొని ఉంటాయంటారు. దాన్నే కాలానికి ప్రతీకగా చెబుతారు.
-పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ