Datta Jayanti: దత్త జయంతి విశిష్టత.. పురాణ కథ ఇదీ-know datta jayanti significance and purana katha here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Datta Jayanti: దత్త జయంతి విశిష్టత.. పురాణ కథ ఇదీ

Datta Jayanti: దత్త జయంతి విశిష్టత.. పురాణ కథ ఇదీ

HT Telugu Desk HT Telugu
Dec 25, 2023 07:00 PM IST

దత్తాత్రేయుడు ఎవరు? దత్త జయంతి విశిష్టత ఏమిటి? వంటి వివరాలను ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

దత్తాత్రేయ జయంతి 2023
దత్తాత్రేయ జయంతి 2023

మార్గశిర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథిని దత్తజయంతిగా జరుపుకొంటారు. ఈరోజు దత్తాత్రేయుని అవతారము సంభవించింది. మార్గశిరమాసంలో దత్తాత్రేయుడిని కొలవడం వలన జీవనం పావనం అవుతుంది.

దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్‌

ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్‌

భస్మోద్దూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్‌

చతుర్భాహం ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్‌

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలు మహాషప్రతివత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకుంటారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణాలకు లోనయితే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని సర్వులకు తెలియచెప్పుటకో లేక దత్తుని అవతారానికి నాంది పలుకుటకో మరి నారదుని ఆంతర్యమేమిటో? ఏది అయితేనేమి? ఈ గుణాలు వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి.

వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంతవారించినా పెడచెవిని పెట్టారు ససేమిరా అన్నారు. వీరికి తోడు ఇంద్రాది దేవతల భార్యలు కూడా ఇదే కోరుతారు. ఇంక చేసేది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతం చేరుకుంటారు. వారి పాద స్పర్భకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్బాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి.

కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి అంకితమవ్వాలని ఏమిటో అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. ఈ అకస్మిక పరిణామమేమిటో? అని వారిని చూచిన పక్షులు కిలకిలారావాలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చ్భారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి.

ఇంత చక్కని ప్రకృతి అందాలకు అలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి. మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకులతో కలసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమవాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమయినారు.

మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని, మునిశ్రేష్టుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ, అతిథులను ఆదరిస్తూ తన పతి సేవతత్పరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్బాలకులు సహితం అణకువుగా ఉండేలా చేస్తున్న ఆ తల్లిని దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు.

ఆ సాధుపుంగవుల మువ్వురిను చూచిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలసి ముగ్గురు సాధవులు అసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్నా అనసూయతో చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు.

వారి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. అమె జ్ఞాననేత్రం తెరచకుంది. కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకుంది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము. ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా అనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తుంది.

ఒక ప్రక్క పాతివ్రత్యం మరోవైపు అతిథిసేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్మరించి ఓం శ్రీపతి దేవాయ నమః అంటూ కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది.

ఇంతలో బుషికన్యలు, బుషిబాలురు కలసి మెత్తని పూల పాన్పుతో ఊయలవేయగా వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి తొట్రుపడి మరలా తేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది తెలుసుకున్నాడు.

ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో, ఆడుతూ పాడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా మధురానుభూతిని మిగిల్బేది అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్యం అయోనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతోంది.

ఇలాఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు.

ఆ సమయాన అనసూయమ్మ తల్లి అ చిన్నారులకు పాలు ఇచ్చి, ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్మారములతో సుఖాసీనులను చేసింది. పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకుని పతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు.

అయితే మీమీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించుకోలేకపోయారు.

తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చెయ్యాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని వేడుకుంటారు. ఈ సృష్టి స్థితి లయాలను యధావిధిగా సాగేందుకు సహకరించమని ప్రాధేయపడతారు. అంతట అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రులకంటే ఎక్కువగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.

నాయనలారా! ఈపుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్యదంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము. మీ కీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్దానం అయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను దత్తనారాయణునికి ఇస్తారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభిచినారు. ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన శ్రీదత్తజయంతి నాడు ఆ స్వామిని షోడసోపచారములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner