Basara temple: బాసరలో నదీ స్నానం.. సరస్వతీ దర్శనం.. ఒకే రోజులో వెళ్లి రావొచ్చు..
Basara temple: ఈ కార్తీక మాసంలో బాసర సందర్శిస్తే మీరు గోదావరి నదిలో కార్తీక స్నానం ఆచరించొచ్చు. సరస్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ విశిష్టతలు, ప్రయాణ వివరాలు మీకోసం
బాసర టెంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, కరీంనగర్, వరంగల్లు, తదితర పొరుగు జిల్లాల వారికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ నదీ స్నానం ఆచరించవచ్చు. అలాగే దేవీ దర్శనం చేసుకోవచ్చు. ఒక్క రోజులోనే రానుపోనూ ప్రయాణం చేసుకోవచ్చు. రోడ్డు, రైలు మార్గాన వెళ్లిరావడం చాాలా ఈజీ. వీకెండ్‌లో ప్లాన్ చేసుకోవడానికి అత్యంత అనువైన పుణ్య క్షేత్ర సందర్శన ఇది.
basara temple distance: బాసర టెంపుల్ నిజామాబాద్ నుంచి 34 కి.మీ. దూరం ఉంటుంది. నిర్మల్‌కు సుమార్ 70 కి.మీ. దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి 205 కి.మీ. దూరంలో ఉంటుంది.
Basara Train timings: బాసరకు రైలు వేళలు
బాసరకు వివిధ ప్రాంతాల నుంచి రైలు అందుబాటులో ఉంది. ఆలయానికి సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి రోజూ ఐదారు రైళ్లు బాసర మీదుగా వెళతాయి.
హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి KCG NRKR ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.10 నిమిషాలకు కాచిగూడలో బయలుదేరుతుంది. బాసరకు ఉదయం 11.03 గంటలకు చేరుకుంటుంది. అంటే 4 గంటల సమయం పడుతుంది.
సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 1.25కి దేవగిరి ఎక్స్‌ప్రెస్ బాసర మీదుగా వెళుతుంది. బాసరలో 4.20కి దింపుతుంది.
సికింద్రాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్ కూడా రాత్రి 8.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.30కు చేరుకుంటుంది.
ప్రతి రోజూ రాత్రి 06.50కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. కేవలం 3 గంటల్లోనే బాసరలో దింపుతుంది.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి సమయంలో 10.15 గంటలకు TDU PBN ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబరు 17663) ప్రారంభమై తెల్లవారుజామున 2 గంటలకు చేరుకుంటుంది. అంటే సుమారు 3.45 గంటల పాటు ప్రయాణ సమయం ఉంటుంది.
సోమ, మంగళ, శనివారాల్లో ఉదయం 7.55కు సికింద్రాబాద్ నుంచి ఎస్‌బీపీ-ఎన్‌ఈడీ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. ఉదయం 11.18 గంటలకు బాసర చేరుకుంటుంది. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ జేపీ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. దీనిలో మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.
ఇక బాసర నుంచి తిరుగు ప్రయాణంలో ఎన్ఈడీ -ఎస్‌బీపీ ఎక్స్‌ప్రెస్, ఎన్ఈడీ-బీఏఎం స్పెషల్, ఎన్ఎస్ఎల్-ఎన్ఎస్, అజంతా ఎక్స్‌ప్రెస్, దేవగిరి ఎక్స్‌ప్రెస్, కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఎన్ఆర్‌కేఆర్-కేసీజీ ఎక్స్‌ప్రెస్, ఎన్‌ఈడీ-టీడీయూ ఎక్స్‌ప్రెస్.. ఇలా చాలా రైళ్లు ఉన్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి ఉదయం వెళితే రాత్రి ఇల్లు చేరుకునేలా, సాయంత్రం వెళ్లినా తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం ఇల్లు చేరేలా రైలు సౌకర్యం ఉంది.
బస్సులు కూడా చాలా ఉన్నాయి. బాసరకు నేరుగా ఉండడంతో పాటు, నిజామాబాద్ వెళ్లినా అక్కడి నుంచి బాసరకు చాలా సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి.
Basara Temple Timings: బాసర ఆలయ వేళలు
బాసర టెంపుల్‌లో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 4.30 నుంచి 7.30 వరకు అభిషేకం, 7.30 నుంచి 12 గంటల వరకు అర్చన, సర్వ దర్శనం ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు హారతి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ఆలయం మూసి ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు సర్వదర్శనం, అర్చన, సాయంత్రం 6.30 నుంచి 7.00 వరకు ప్రదోష పూజ, 7 నుంచి 8.30 వరకు మహా ఆరతి, దర్శనం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు ఆలయం మూసి ఉంటుంది.
Basara Accommodation: బాసర వెళ్లేవారికి వసతి గృహాలు
బాసరలో బస చేయాలనుకునే వారికి ఆలయం ఆధ్వర్యంలోని వసతి గృహాలు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. గదులకు రూ. 100 నుంచి రూ. 1500 వరకు అద్దె వసూలు చేస్తారు. ఏసీ, నాన్ ఏసీ గదులు, డార్మెటరీ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. టీటీడీ తదితర పుణ్యక్షేత్రాల పాలక మండళ్లు నిర్మించిన అతిథి గృహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
Sevas in Basara Temple: బాసర ఆలయంలో పూజలు, సేవలు
బాసర టెంపుల్‌లో అభిషేకం, స్పెషల్ కుంకుమార్చన, అక్షరాభ్యాసం (అక్షర శ్రీకారం), సత్యనారాయణ స్వామి పూజ, స్పెషల్ అక్షర శ్రీకారం, నిత్య చండీ హోమం, ఉపనయనం, ప్రతి శుక్రవారం పల్లకీ సేవ, వ్యాస గృహ ప్రవేశం, జ్యోతి దీపం, శాశ్వత కుంకుమార్చన తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సువర్ణ పుష్పార్చన సేవ ఉంటుంది. ఇంకా వాహన పూజలు కూడా బాసర ఆలయంలో అందుబాటులో ఉంటాయి.
Basara Temple significance: బాసర ఆలయ విశిష్టతలు
మన దేశంలో సరస్వతీ దేవి పుణ్యక్షేత్రాలు చాలా అరుదు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ అరుదైన పుణ్యక్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని స్వయంగా వ్యాస మహర్షి ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధంలో ప్రాణనష్టాన్ని చూసి మనోవ్యథతో ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడని చెబుతారు. రోజూ ఉదయం గోదావరి స్నానం చేసిన అనంతరం వ్యాసుడు మూడు పిడికిళ్ల ఇసుక తెచ్చి మూడు వేర్వేరు కుప్పులుగా పోశాడని, ఆ కుప్పలే సరస్వతీ దేవి, లక్ష్మీదేవి, కాళికా దేవి ప్రతిమలుగా అయ్యాయని చెబుతారు. బాసర క్షేత్రంలో వ్యాసుడి సమాధి, ఆయన తపస్సు చేసిన స్థలాలను కూడా స్థానికులు చూపుతారు.
నదికి ఉత్తర భాగంలో బాసర సరస్వతీ ఆలయం ఉంది. గర్భాలయంలో సరస్వతీ దేవి, పశ్చిమ దిశలో లక్ష్మీదేవి, తూర్పు దిశలో కాళీ దేవీ దర్శనమిస్తారు.
Important festivals: బాసర ఆలయంలో ఉత్సవాలు
బాసర సరస్వతీ దేవి ఆలయంలో దేవీ నవరాత్రులు, వసంత పంచమి, వ్యాస పూర్ణిమ, మహా శివరాత్రి తదితర పండగలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక కార్తీక మాసం, ఇతర పండగలు, ఆధ్యాత్మిక వేడుకలకు భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడ సరస్వతీ దేవి కొలువై ఉండడం, సరస్వతి దేవీ, లక్ష్మీదేవి, కాళీదేవీ అమ్మవార్ల విగ్రహాలను స్వయంగా వ్యాస భగవానుడు ప్రతిష్టించారన్న పేరున్నందున ఇక్కడ అక్షరాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆలయ ప్రాంగణంలోనే దీనికి ప్రత్యేక టికెట్ తీసుకుని అక్షరాభ్యాసం జరిపించవచ్చు. అక్షరాభ్యాసం చేయించిన వారు పలక, బలపం, పుస్తకాలు, పెన్నులు అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనెను సమర్పిస్తారు.
ఆలయానికి ఆగ్నేయ దిక్కులో పాపహరిణి పేరుతో ఉన్న కొలనుకు దక్షిణ దిక్కులో వ్యాస భగవానుడికి ఆలయం ఉంది. ఇక్కడే దత్త మందిరం, దత్త పాదుకలు చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గుహలో సీతమ్మవారి నగలు ఉన్నాయని ప్రతీతి. అలాగే దీనికి సమీపంలో వ్యాసతీర్థం, వాల్మీకీ తీర్థం, విష్ణు తీర్థం, ఇంద్రతీర్థం, సూర్య తీర్థం, గణేశ తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం తదితర ఎనిమిది పుష్కరిణిలు ఉన్నాయి.
ఆలయానికి అత్యంత సమీపంలోనే గోదావరి నది ప్రవహిస్తుంటుంది. కార్తీక మాసంలో స్నానమాచరించేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ వెళ్లిరండి.
టాపిక్