Ganga water: హిందువులకు గంగా జలం ఎందుకంత పవిత్రం-why gangajal is holy water by hindu devotees ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganga Water: హిందువులకు గంగా జలం ఎందుకంత పవిత్రం

Ganga water: హిందువులకు గంగా జలం ఎందుకంత పవిత్రం

Gunti Soundarya HT Telugu
Dec 16, 2023 01:00 PM IST

Ganga water: హిందువులు గంగానది కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గంగాజలం ఇంట్లో పెట్టుకుంటే మంచిదని భావిస్తారు.

గంగానదిలో స్నానమాచారిస్తున్న భక్తులు
గంగానదిలో స్నానమాచారిస్తున్న భక్తులు (ANI)

Ganga water: హిందూ శాస్త్రంలో గంగాజలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గంగాజలం పవిత్రమైనదిగా భావిస్తారు. పురాతన కాలం నుంచి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగాజలం ఉపయోగిస్తూ వస్తున్నారు. అందుకే గంగాజలం లేకుండా ఏ పూజ పూర్తికాదు.

పాపాలు తొలగించుకోవడం కోసం హిందువులు గంగానది స్నానమాచారిస్తారు. గంగాజలం సేవించినా కూడా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. చనిపోయిన వారి నోట్లో గంగాజలం పోయడం వల్ల స్వర్గానికి వెళ్తారని భావిస్తారు. పవిత్రతకు గంగా నది చిహ్నం నిలిచింది. గంగ అనేది స్వర్గం నుంచి నేరుగా భూమి మీదకి వచ్చిన పవిత్ర నది. అందుకే గంగాజలం నేలపాలు అయితే అశుభంగా భావిస్తారు.

దేవతలు సైతం గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. చాలా మంది గంగాజలం తీసుకొచ్చి తమ ఇళ్లలోని పూజ గదిలో పెట్టుకుంటారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్చంగా ఉంటుంది. 2520 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రవాహంలో గంగానది ఎన్నో మూలికల్ని తనలో కలుపుకుంటుంది. గంగానదిలో మునగడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్తారు. అయితే పొరపాటున చేసిన పాపాలు మాత్రమే కదిగివేయబడతాయి. కావాలని చేసిన తప్పుల నుంచి విముక్తి లభించదు. గంగానదిలో మునిగితే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల పితృ దేవతలు తరిస్తారట.

గంగానది కథ

గంగ బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది. ఒకసారి శంకరుడు ఆలపించిన రాగానికి నారాయణుడు పరవశించిపోయాడు. విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చిన జలాన్ని బ్రహ్మ దేవుడు తన కమండలానికి తాకించగా నిరాకార గంగాజలంగా మారింది. శ్రీ మహా విష్ణువు వామనావతారంలో త్రివిక్రముడై ముల్లోకాలని కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటితోనే విష్ణు పాదాలు కడిగాడు. ఆ పాదము నుంచి ప్రవహించిందే దివ్య గంగ. భూమి మీద ప్రశాంతత కలిగించడం కోసం తన తల నుంచి గంగాజలాన్ని పంపించేందుకు శివుడు అంగీకరించాడు. అందుకే శివుడికి గంగాధరుడు అనే పేరు వచ్చింది.

గంగా నదిని మా గంగ అని కూడా పిలుస్తారు. గంగమ్మ దేవతగా కొలుస్తారు. మా గంగని స్వచ్చతకు పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇంటి చుట్టూ గంగా జలం చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి శుద్ధి చేయబడుతుందని హిందువుల నమ్మకం. గంగా నది ఒడ్డున యాగాలు, ధ్యానం చేయడం వల్ల మనసుకి హాయిగా ఉంటుంది.

మూడు లోకాల్లో ప్రవహించే నది గంగానది. అందుకే త్రిపథగ అంటారు. స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకంలో గంగానది ప్రవహిస్తుంది. చనిపోయిన వారి అస్థికలు గంగానదిలో కలపడం వల్ల విముక్తి లభిస్తుందని ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వారణాసి, ప్రయాగ, గయ వద్దకు వస్తారు. ఒక్కసారైనా గంగానదిలో మునిగితే సర్వ పాపాల నుంచి విముక్తులు అవుతారని అంటారు.

గంగాజలం మీద చేసిన అధ్యయనం ఏం చెబుతోంది?

హిమాలయాల్లోని గౌముఖ్ దగ్గర గంగా నది భగీరథుడిగా ఉద్భవించింది. అక్కడ నుంచి ప్రయాణించిన దేవ ప్రయాగలోని అలకనందలో కలుస్తుంది. గంగా నది ప్రత్యేక లక్షణాలు తెలుసుకోవడం కోసం దీని మీద అధ్యయనాలు, పరిశోధనలు కూడా చేశారు. గంగాజలంలో యాంటీ బ్యాక్టీరిల్ గుణాలు ఉన్నాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ఇవి తాగడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని చెబుతున్నారు.

గంగాజలంలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల అవి స్వచ్చంగా ఉంటాయి. ఎన్ని రోజులు నిల్వ ఉన్నా చెడిపోవు. హానికరమైన బ్యాక్టీరియాని తినే బట్రియాఫాస్ అనే బ్యాక్టీరియా గంగాజలంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల గంగాజలం స్వచ్చతను కాపాడుతుంది.

ప్రస్తుత పరిస్థితిలో ఎంతో పవిత్రమైన గంగా నది గురించి పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. భక్తులు పూజలు చేసిన తర్వాత పూలు, ఇతర వస్తువులు నీటిలో విడిచిపెడుతున్నారు. వాటి వల్ల నీరు కలుషితం అవుతుంది. కాలుష్య కోరల్లో గంగానది చిక్కుకోవడం వల్ల దాని స్వచ్చత సన్నగిల్లుతుందని అంటున్నారు. అందుకే నమామి గంగ పేరుతో గంగానది ప్రక్షాళన చేపట్టారు.

Whats_app_banner