Ganga Pushkaralau 2023: గంగానది శ్రీమన్నారాయణుడి పాదపద్మాల వద్ద జన్మించింది. భగీరథుని వల్ల భువి నుంచి దివికి దిగి వచ్చి మనల్ని తరింపచేసింది. గంగాదేవి విష్ణుపుత్రి, ఈశ్వరపత్ని. గంగకు మరోపేరు సుర నది. మూడులోకాల్లో ప్రవహించే పుణ్యనది గంగ. గంగాజలం దివ్య ఔషధుల సమ్మేళనం. గంగానది ప్రవహించడం వల్లే కాశీకి అంతటి శక్తి వచ్చిందని ప్రతీతి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భగీరథ యత్నంగా భువినుండి దిగివచ్చింది గంగ. ఆ అద్భుత ఘట్టం మన ఆర్ష సంస్కృతిలో ఎంతో కీలకం. వాల్మీకి రామాయణంలో గంగావతరణం ఎంతో ఆసక్తికర గాథ. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు... కేశిని, సుమతి. భృగుమహర్షి వరంతో కేశినికి అసంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి అరవై వేల మంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేథ యోగం సంకల్పిస్తాడు.
అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడి భయం. చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి, కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. అశ్వమే లేకుంటే అశ్వమేధ యాగమేమిటి? క్రతువు ఆగిపోతుంది అని సగరుడు కుమిలిపోతాడు. అతని అరవై వేల మంది తనయులూ ఆగ్రహంతో రగలిపోతారు. యాగాశ్వం జాడ తెలుసుకోడానికి బయల్దేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. కండబలంతో విర్రవీగుతున్న సగరపుత్రులు మహర్షి మీద అభాండాలు వేస్తారు. తపస్వికి కోపమొస్తుంది. అరవైవేల మందినీ కంటిచూపుతో కాల్చేస్తాడు.
అసమంజుని కొడుకు అంశుమానుడు. పినతండ్రుల జాడ వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. చుట్టూ బూడిద కుప్పలు చూడగానే విషయం బోధపడుతుంది. అరవై వేల పాపాల్ని ఒక్క దెబ్బతో కడిగేయగల శక్తి ఒక్క గంగకే ఉందని గరుత్మంతుడు సలహా ఇస్తాడు. సగరుడు, అంశుమానుడు, దిలీపుడి తరాలు అంతరించిపోయాయి. గంగను భువికి రప్పించడం ఎవరితరమూ కాదు.
అనంతరం భగీరధుడి పాలన మొదలవుతుంది. భగీరథ ప్రయత్నానికి శ్రీకారమవుతుంది. అతని కఠోర తపస్సుకు సంతసించి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమాతకు లేదని స్పష్టం చేస్తాడు. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉన్నది కాబట్టి ఆ మహాదేవుడిని ప్రార్థించమని సూచిస్తాడు. దాంతో భగీరథుడు... శివుడ్ని ప్రార్థిస్తాడు. తన తలపై గంగ ప్రవాహాన్ని ధరించడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు. శివుడి జటాజుటాల్లోంచి గంగావతరణ మొదలవుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భారతదేశంలో అతి పవిత్ర స్థలాల్లో హరిద్వార్ ఒకటి. శివాలిక్ పర్వత పాదాల వద్ద పావన గంగా కుడివైపు తీరంలో అమరి యున్న పుణ్యస్థలం. సప్త మోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామాంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ భక్తిమేర పిలుచుకుంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం ముఖ్య యాత్రాస్థలం.
సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తి పొందింది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహాపట్టణంగా కీర్తించబడింది. ఈ విషయ అబుల్ఫజల్ తన గ్రంథంలో రాశారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు. పావన గంగానది హిమాలయ పర్వత లోయల గుండా తన మార్గం సుగమం చేసికొని హరిద్వారా వద్ద సమయతల ప్రదేశంలో ప్రవేశిస్తూ (హరి) హరద్వారంగా తన నామాన్ని సార్ధకం చేస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కుంభమేళా ప్రతి పన్నెండు సంవత్సరాలకు అవతరించే గంగా పుష్కర సమయంలో విశేషంగా జరుగుతుంది.
బ్రహ్మాకుండ్: గంగా తీరస్నాన ఘట్టాలలో అతి పవిత్రమైనది, ముఖ్యమైనది. పావనగంగ శ్రీ మహావిష్ణువు పాద స్పర్శచే పునీతమైన స్వచ్ఛ జలాలు ఇక్కడ ప్రవహించటం ఒక గొప్ప విశేషం. శ్రీహరి పాదాలను నిక్షేపం చేస్తూ ఒక ఆలయం కూడా ఉంది. బిర్లా సంస్థ ఈ రేవును అతి సుందరంగా తీర్చిదిద్ది యాత్రికుల ఆహ్లాదానికి మరింత చేరువ చేశారు. ఈ స్వచ్ఛ జలాల్లో చేపలు తండోప తండాలు, యాత్రికులు వాటికి ఆహారాన్ని వేస్తూ ఆనందిస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో మత్స్యావతారం కూడా విశేషమే కదా!
చనిపోయినవారి ఆస్తికలు ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారు. 10-15 శోభాయమానమైన ఆలయాలు దర్శనీయాలు. ఇక్కడి ఈ పవిత్ర జలాలను యాత్రీకులు తీసుకెళ్తారు. గంగాతీరంలోని కుశావర్తం దగ్గర శ్రాద్ధ విధులను యాత్రికులు నిర్వహిస్తారు.
ముఖ్య మందిరాలు : గంగ, గాయత్రి, లక్ష్మీనారాయణ, బ్రహ్మ, సత్యనారాయణస్వామి, గణేశ ఆలయాలు ముఖ్యమైనవి. అన్నింటిలోనూ మరీ ముఖ్యమైనవి మయాదేవి, వల్వకేదారు బహాదేవు ఆలయాలు చాలా ముఖ్యం. ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన సాధు పుంగవులు, మునివరులు విశేషంగా దర్శనమిస్తారు.
కనాల్ : హరిద్వార్ స్టేషనుకు 4 కి.మీ. దూరంలో ఉన్నది. చాలా పురాతనమైనది. పురాణ ప్రసిద్ధమైనదిగా ప్రాచుర్యం పొందినది .దక్షయజ్ఞం జరిగిన చోటు. ఇక్కడ దక్ష ప్రజాపతి ఆలయం కూడా ఉంది. పక్కనే సతీకుండం కూడా ఉంది. వీటికి తోడు దక్షిణేశ్వర, మహావీరాంజనేయ ఆలయాలున్నవి. ఇక్కడి గంగా స్నానఘట్టాన్ని అగ్నికుండమంటారు. ముఖ్యమైనది రామఘాట్ చాలా పవిత్రమైనదిగా భావించబడుతోంది.
భీమగోడా: హరిద్వారానికి ఉత్తరంగా సుమారు 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి నుంచే పాండవులు మహాప్రస్థానం (అంతిమయాత్ర) గావించారని ప్రతీతి. ప్రాణాయామంతో తమ స్వర్గారోహణం చేశారని భారత కథ చెప్తుంది.
బిల్వకేశ్వరాలయం: ఊరికి పడమరగా చిన్న కొండమీద బిల్వవనాంతరంగా ఉన్న ఆలయం. పక్కనే గౌరీకుండం ఉన్నది. రమణీయమైన ప్రకృతి శోభతో నిండి ఉంది. ఈ చోటనే గృహాంతరంలో దుర్గాదేవి ఆలయం ఉన్నది. దగ్గరిలోనే గంగానదికి ఆవలితీరంలో చండీ పర్వతం ఉన్నది. భయంకరమైన అడవి ప్రాంతం. క్రూరమృగ సంచారం హెచ్చుగా గల ఈ కొండమీదనే చండీ ఆలయం, నీలేశ్వరాలయం, మానసా దేవి ఆలయాలు ఉన్నాయి.
ఇంకా ఈ ప్రదేశంలో దర్శనీయమైనవిగా గంగాజీ మందిర్, గోవూఘాట్, చౌబీస్ అవతార్, మాయాదేవి, ఆశాదేవి, మాయాపూర్, సప్తసరోవర్, నహర్గంగ మొదలయినవి వాసికెక్కాయి.
-పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
సంబంధిత కథనం