Magha paurnami 2024: మాఘ పౌర్ణమి రోజు ఇవి దానం చేస్తే ఈ దోషాలన్నీ తొలగిపోతాయి, సకల కోరికలు నెరవేరతాయి
Magha paurnami 2024: మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. ఆరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న వచ్చింది.
Magha paurnami 2024: హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మాసాలలో మాఘ మాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఈరోజు ప్రత్యేకగా భక్తులు చంద్రుడిని పూజిస్తారు. మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు.
పౌర్ణమి రోజున విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి. ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి వచ్చింది. ఆరోజు ఉపవాస ఉండటం వల్ల జీవితంలో తీరని కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
ముహూర్తం
పౌర్ణమి తిథి ప్రారంభం- ఫిబ్రవరి 23, మధ్యాహ్నం 3.33 గంటల నుంచి
పౌర్ణమి తిథి ముగింపు- ఫిబ్రవరి 24, సాయంత్రం 5.59 గంటల వరకు ఉంటుంది.
పూజా విధానం
పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఈరోజు విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి. ఈరోజు హనుమంతుడిని కూడా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి పవిత్రమైన రోజు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాఘ పౌర్ణమి రోజు ఫ్లోట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. భక్తులు విష్ణు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. సాయంత్రం వేళ చంద్రుడికి పూజలు చేస్తారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు. పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ వ్రత కథను చదువుతారు. గాయత్రీ మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు.
దానాలు ప్రధానం
మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు దక్కుతుంది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి బ్రహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్ర, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు దానధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేయాలి. చంద్ర గ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్ర దానం చేయడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. కుజ దోషం ఉన్న వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహు, కేతు దోషాలు ఉన్న వాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరిసంపదలు దక్కుతాయి.
మాఘ పౌర్ణమి రోజు పఠించాల్సిన స్త్రోత్రం
గ్రహాణాం చ యధా సూర్యో నక్షత్రాణాం చ చంద్రమాః|
మాసానాం హి తథా మాఘః శ్రేష్ఠః సర్వేషు కర్మసు||