Bride essentials: పెళ్లికూతురు దగ్గర… తప్పకుండా ఉండాల్సిన 4 వస్తువులు..
Bride essentials: పెళ్లి కూతురు దగ్గర తప్పకుండా ఉండాల్సిన కొన్ని వస్తువులున్నాయి. అవి చిన్న చిన్న సమస్యలకు మంచి పరిష్కారం. అవేంటో తెలుసుకోండి.
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందంటే.. రోజుల తరబడి షాపింగ్ చేయాల్సిందే. బట్టలు, ఆభరణాలు, మేకప్ సామాగ్రి… ఒక్కటేంటి ఎన్ని రోజులైనా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అయితే షాపింగ్ కి వెళ్లినప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనడం మర్చిపోకండి. అవి చూడటానికి చిన్నవే అయినా చాలా బాగా ఉపయోగపడతాయి. మీ హ్యాండ్‌బ్యాగులో వాటిని సర్ది అందుబాటులో ఉండేలా చూసుకోండి. అవేంటో వివరంగా చూద్దాం.
1. డబుల్ సైడెడ్ ఫ్యాబ్రిక్ టేప్:
లెహెంగాలు, చీరలు, లంగాహోనీలు కట్టుకున్నప్పుడు దుపట్టా లేదా చీరకొంగు ఒక దగ్గర ఉండకుండా పక్కకు జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి సర్దుకోవడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడు భుజం దగ్గర లేదా బ్లవుజు, కొంగు కలిపి ఈ డబుల్ సైడెడ్ ఫ్యాబ్రిక్ టేప్ అంటించండి. దుపట్టా జారకుండా ఒకే దగ్గర ఉంటుంది. మళ్లీ ఎలాంటి మరక లేకుండా టేప్ తీసేయొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. బయట మార్కెట్లో దొరక్కపోతే ఆన్ లైన్ లో చూడండి. చాలా సైట్లలో అందుబాటులో ఉంది.
2. బ్లోటింగ్ పేపర్లు:
పెళ్లంటే గంటల తరబడి ఓపిగ్గా ఉండాలి. ఉత్తేజంగా కనిపించాలి. కానీ చెమట, వేడి వల్ల ముఖం మీదున్న మేకప్ పాడయి చర్మం డల్ గా కనిపిస్తుంది. ముఖం జిడ్డుగా, మెరిసినట్లు కనిపిస్తుంది. దానివల్ల ఫొటోలు కూడా సరిగ్గారావు. అందుకే ఒకసారి బ్లోటింగ్ పేపర్‌తో అద్దితే చెమట, జిడ్డు పీల్చుకుంటుంది. ముఖం మళ్లీ తాజాగా కనిపిస్తుంది. వీటిని సులువుగా హ్యాండ్ బ్యాగులో పెట్టేసుకోవచ్చు.
3. ఇయర్ లోబ్ సపోర్ట్ ప్యాచ్‌లు:
పెళ్లి రోజున పెద్ద పెద్ద జుంకాలు, చెవి దిద్దులు, చెంపస్వరాలు పెట్టుకుని చాలా సేపు ఉండాల్సి ఉంటుంది. వాటి బరువు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దాంతో చెవి రంధ్రం దగ్గర సాగినట్లు, బరువుగా అనిపిస్తుంది. నొప్పి కూడా వస్తుంది. అలాంటప్పుడు జుంకాలు పెట్టుకునే ముందే చెవి వెనకవైపు రంధ్రం మీద ఈ ఇయర్ లోబ్ సపోర్ట్ ప్యాచ్ అతికించాలి. ఆ తర్వాత జుంకా పెట్టుకుంటే చెవికి మద్దతుగా ఉంటుంది. సాగినట్లు అవ్వదు.
4. స్వెట్ ప్యాడ్స్:
చుట్టూ కెమెరా లైట్లు, వేడి వల్ల చెమట ఎక్కువగా రావచ్చు. దాంతో అండర్ ఆర్మ్స్ దగ్గర చెమట ఎక్కువగా వస్తుంది. చెమట వల్ల బ్లవుజులకున్న వర్క్ పాడవ్వడమే కాదూ, మరకలూ అవుతాయి. అందుకే తప్పకుండా బ్లవుజుకు అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్ అంటించాకే వేసుకోవాలి. అవి చెమట పీల్చుకుంటాయి. ఒకసారి ఉపయోగించాక పడేయడమే. వాడకం చాలా సులువు. చూడటానికి ఎబ్బెట్టుగా అనిపించదు. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.