తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri Vratam Katha: శివుడు పార్వతీదేవికి స్వయంగా ఉపదేశించిన శివరాత్రి వ్రత మహిమ కథ ఇదే

Maha shivaratri vratam katha: శివుడు పార్వతీదేవికి స్వయంగా ఉపదేశించిన శివరాత్రి వ్రత మహిమ కథ ఇదే

HT Telugu Desk HT Telugu

08 March 2024, 8:09 IST

    • Maha shivaratri vratam katha: మహా శివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా శివుడు పార్వతీ దేవికి వివరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత మహత్యం గురించి పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 
శివరాత్రి వ్రత మహత్య కథ
శివరాత్రి వ్రత మహత్య కథ (pixabay)

శివరాత్రి వ్రత మహత్య కథ

Maha shivaratri vratam katha: మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. ఈ రోజున నియమనిష్టలతో ఆరాధిస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని భక్త కోటి విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, విశేష అర్చనలు, జప తపాలు, హోమాలు నిర్వహిస్తూ రోజంతా ఉపవాసం, జాగరణ చేసి శివానుగ్రహం కోసం పరితపిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శైవక్షేత్రాలు ఆలయాలు హరహర మహాదేవ, శంభో శంకరి, ఓం నమః శివాయ స్మరణలతో మార్మోగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ధన యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

May 09, 2024, 10:34 AM

మే 9, రేపటి రాశి ఫలాలు.. రేపు మీ ఇంట శుభకార్యాలు జరగడంతో బిజిబిజీగా ఉంటారు

May 08, 2024, 08:33 PM

Sun Nakshatra transit: సూర్యుడి నక్షత్ర మార్పుతో అదృష్టం పొందబోయే రాశులు ఇవే.. వీరికి కనక వర్షమే

May 08, 2024, 03:05 PM

Trigrahi Yogas: ఒకటి రెండు కాదు 3 త్రిగ్రాహి యోగాలు.. ఈ రాశుల వారిది మామూలు అదృష్టం కాదండోయ్

May 08, 2024, 10:44 AM

మే 8, రేపటి రాశి ఫలాలు.. కొత్తగా వ్యాపారాన్ని చేపట్టాలనుకునే వారి కోరిక తీరుతుంది

May 07, 2024, 08:45 PM

Mars Transit : కుజుడి దయతో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతాలు.. విక్టరీ మీ సొంతం

May 07, 2024, 04:07 PM

ఒకరోజు పార్వతీదేవి మహాశివుని ఈ విధంగా ప్రశ్నించింది. మర్ష్యలోకంలోని ప్రాణులు మీ దయకు పాత్రులు కావాలంటే సులభమైన వ్రతమైదైనా ఉందా? అప్పుడు స్వామి ఈ వ్రత విధానాన్ని వివరించి, కథను ఇలా చెప్పాడు.

మహా శివరాత్రి ఉపవాస మహత్యం కథ

ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి చెల్లించలేక పోయాడు. కోపంతో షావుకారు వేటగాడిని శివమఠంలో ఖైదు చేశాడు. అదృష్టవశాత్తూ ఆరోజు శివరాత్రి. వేటగాడు తద్ధగా శివుణ్ణి గురించి ధర్మపురాణాలు వినసాగాడు. చతుర్దశి నాడు శివరాత్రి కథ విన్నాడు. సాయంత్రం కాగానే షావుకారు తన దగ్గరకు పిలిచి అప్పు విషయమై మాట్లాడాడు. వేటగాడు “రేపు మీ బాకీ అంతా తీరుస్తాను” అని చెప్పి చెర నుంచి విముక్తి పొందాడు.

మామూలు ప్రకారం అడవిలో వేటకు వెళ్ళాడు. రోజంతా బందీగా ఉండడంతో ఆకలి బాధించింది. వేటాడడానికి ఒక బిల్వ వృక్షం నీడలో విడిది చేశాడు. ఆ చెట్టు నీడలో శివలింగం బిల్వపత్రాలతో కప్పబడి ఉంది. వేటగాడికి అది తెలియలేదు. చెట్టు కొమ్మలను విరిస్తే అవి శివలింగం మీద పడ్డాయి. ఈ విధంగా శివునికి బిల్వార్చన, ఉపవాసం అయిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రాత్రి ఒక రూము గడిచాక గర్భిణి అయిన ఒక లేడి చెరువులో నీరు తాగడానికి వచ్చింది. వేటగాడు వెంటనే బాణం సంధించాడు. లేడి ఇలా అంది. నేను గర్భిణిని. త్వరలో బిడ్డను కంటాను. నువ్వు ఒక్కసారే రెండు జీవులను హత్య చేయడం మంచిది కాదు. నేను నా బిడ్డను కన్న వెంటనే నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నన్ను చంపవచ్చు. వేటగాడు బాణం సడలించాడు. లేడి అడవి దుబ్బుల్లోకి వెళ్ళిపోయింది.

కొద్దిసేపటికి మరో లేడి అటుగా వచ్చింది. వేటగాడు అనందించాడు. లేడి తనకు దగ్గరకు రాగానే బాణం సంధించాడు. అది చూసి లేడి వినయంగా అంది. “ఇప్పుడే నేను రుతుక్రమం నివృత్తి అయి ఉన్నాను. కామాతుర విరహిణిని. నా ప్రియుడు కనిపించలేదు. వాని కోసం వెతుకుతున్నాను. నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తాను. వేటగాడు ఆ లేడిని వదిలేశాడు. రెండుసార్లు అవకాశం పోయిందే అని నెత్తి కొట్టుకున్నాడు. విచారంలో మునిగాడు. రాత్రి చివరి జాము నడుస్తోంది. అప్పుడు వేరొక లేడి తన పిల్లలతో పాటు అటువైపు వచ్చింది. వేటగానికి ఇది సువర్ణావకాశం. ఆలస్యం చేయకుండా బాణం సంధించాడు.

బాణం వదలబోతుండగా లేడి అంది “మహానుభావా! నేను మా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను. అప్పుడు నన్ను చంపవచ్చు.” వేటగాడు నవ్వాడు. “ఎదురుగ్గా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా? నేనంత మూర్ఖుడిని కాను. ఇంతకుముందు రెండు లేళ్లను వదిలేశాను. నా పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు.” లేడి అన్నది... “నీ పిల్లల మీద మమకారం నిన్ను ఎలా బాధిస్తుందో నా పిల్లలపై మమకారం నన్నూ అలానే వేధిస్తోంది. అందుకనే నా సంతానం కోసం కొద్దిసేపు జీవనదానం అర్ధిస్తున్నాను. నన్ను నమ్ము. నేను వీళ్లను వాళ్ల తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మాట నమ్ము.” అని వేడుకుంది.

లేడి దీనస్వరానికి వేటగానిలో జాలి కలిగింది. ఆ లేడిని వెళ్లనిచ్చాడు. ఏమీ తోచక బిల్వవృక్షం ఆకులు తుంచివేయసాగాడు. తెలతెలవారుతుండగా బలిష్టమైన ఒక లేడి అటుగా వచ్చింది. దీన్ని తప్పక వేటాడాలి అనుకున్నాడు. వేటగాడు బాణం సంధించడం చూసిన లేడి అమిత వినయంగా ఇలా అంది. “సోదరా! నా కంటే ముందు వచ్చిన లేళ్లను, పిల్లలను చంపి ఉంటే నన్నూ చంపడానికి ఆలస్యం చేయకు. ఎందుకంటే వారి వియోగంతో నేను ఒక్కక్షణం కూడా బతకలేను. నేను ఆ లేళ్లకు భర్తను. నువ్వు వారికి జీవితం ఇచ్చినట్లయితే నాకూ జీవనదానం చెయ్యి, నేను వాళ్లను ఒక్కసారి కళ్లతో చూసి తిరిగి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు చంపు.” మగలేడి మాటలు వినగానే వేటగానికి రాత్రి జరిగిన ఘటనలన్నీ గుర్తుకువచ్చాయి. జరిగినదంతా మగలేడికి చెప్పాడు. అప్పుడది ఇలా అన్నది. “నా ముగ్గురు భార్యలు ప్రతిజ్ఞ చేసి వెళ్లారు. నేను చనిపోతే వారు ధర్మం పాటించలేరు. వాళ్లను విశ్వాసపాత్రులుగా నమ్మి ఎలా పంపానో, నన్నూ అలానే నమ్ము నేను అందరినీ తీసుకుని నీ దగ్గరకు తప్పక వస్తాను.”

ఉపవాసం, జాగరణ, బిల్వపత్రార్చణ వీటన్నిటి వల్ల వేటగాని మనసు నిర్మలమైంది. ధనూర్భాణాలు చేతిలో నుంచి జారిపోయాయి. మహాదేవుని కరుణతో అతని హృదయంలో హింస తొలగి కరుణ స్థిరపడ్డది. గడిచిన దానికి దుఃఖించాడు. లేడి కుటుంబం తిరిగొచ్చింది. అడవి జంతువుల్లోని సత్య నిష్ట సాత్వికతత్వం సామూహిక ప్రేమభావన చూసి వేటగాడు సిగ్గుపడ్డాడు. లేడి కుటుంబాన్ని చంపలేదు. అతని కఠోర హృదయం కోమలంగా మారింది. మనసులో హింస తొలగి, దయ నిండింది. ఈ ఘటనను తిలకిస్తున్న దేవలోకం పుష్ప వర్షం కురిపించింది. వేటగాడు, లేళ్ళు మోక్షం పొందారు.

ఉద్యాపన

శివరాత్రి నాడు శివరాత్రి వ్రతం ఆచరించి, దానిని ఉద్యాపన చేయడంతో శంకరుడు సాక్షాత్మారించి ప్రసన్నుడవుతాడు. వ్రతం సంపూర్ణం కావడానికి ఉద్యాపన తప్పనిసరి. పద్నాలుగు సంవత్సరాలు మహా శివరాత్రి వ్రతం అనుష్టింపదగినది. త్రయోదశి నాడు ఏకభుక్తం, చతుర్దశిన ఉపవాసం అవలంబించాలి. ఆనాడు ఉదయం నిత్యకృత్యాలు తీర్చుకొని శివాలయానికి వెళ్లాలి. గుడిలో గౌరీతిలకమనే మండలం, దాని మధ్యన లింగంతో భద్రమను ముగ్గు వేసి దానిపై పద్నాలుగు కలశాలను వస్త్ర ఫల దక్షిణలతో కలిపి ఉంచాలి. మధ్యలో బంగారం లేదా వెండి లేదా రాగి ధాతువుల్లో ఏదైనా ఒక మహా కలశాన్ని ఉంచాలి. పార్వతీదేవితో కూడిన శంకరుని మూర్తిని మూడు తులాల నాలుగు మాసాల బంగారంతో గాని లేదా దానిలో సగం బంగారంతో గాని యథాశక్తిగా చేయించి, మధ్య కలశంపై పెట్టాలి. గౌరీశంకర మూర్తులను విడిగా చేయిస్తే ఎడమవైపు అమ్మవారిని కుడివైపు అయ్యవారిని నెలకొల్పాలి.

ఆచార్యుని, రుత్విజులను ఎన్నుకొని వారి ఆదేశాల మేరకు రాత్రి నాలుగు జాముల్లో నాలుగు పూజలు ఆచరించడంతో పాటు గీత, వాద్య, నృత్యాలతో గాని, శివనామ భజనలతో గాని జాగరణ చేయాలి. మరుసటి ఉదయం స్నానం సంధ్యల తర్వాత ఐదోసారి శివుని అర్చించి శివపంచాక్షరీ మహామంత్రంతో గానీ, రుద్రాధ్యాయంతో గాని, శివసహస్రనామాలతో గాని ప్రాజాపత్యం విధానంతో గాని గోఘృతంతో హవనం చేయాలి.

బ్రాహ్మణ దంపతులకు, ఆచార్య దంపతులకు భోజనం వస్త్రాలంకార దక్షిణలను, తాంబూలాలను సమర్పించాలి. ఆచార్యునికి మధ్య కలశాన్ని గౌరీ శంకర ప్రతిమను శివుడు సంతోషించుగాక అని మనసులో భావించి, దూడతో కూడిన ఆవును సమర్పించాలి. తరువాత దోసిలి ఒగ్గి, "మహాదేవా! శరణాగత వత్సలా! ఈ వ్రతంతో నాపై దయచూపు. నా భక్తి శక్తులను అనుసరించి వ్రతం ఆచరించాను. లోపాలను మన్నించు. తెలిసీ తెలియక చేసిన పూజ జపాదికమంతా నీ అనుగ్రహంతో సఫలమగుగాక!” అని ప్రార్ధించి, శివునికి పుష్పాంజలి నమస్కారం సమర్పించి వేడుకోవాలి. ఇలా మహాశివరాత్రి వ్రతం ఆచరించిన వారికి పరమేశ్వరుడు సర్వవిధ సౌకర్యాలను కల్పించి మనోభీష్టాలను తప్పక సిద్ధింపడేస్తాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ