Maha shivaratri 2024: మహా శివరాత్రి రోజున బిల్వపత్రాలతో ఇలా చేయండి.. మీ కోరికలన్ని శివయ్య తీర్చేస్తాడు
Maha shivaratri 2024: హిందూ శాస్త్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. ఆరోజు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలతో ఇలా పూజిస్తే ఘోరమైన పాపాలన్నీ తొలగిపోతాయి. మీ కోరికలన్నీ తీరతాయి.
మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం జరుపుకునే అతి పెద్ద పండగలలో మహా శివరాత్రి ఒకటి. ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి జరుపుకోనున్నారు . ఈరోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనవి బిల్వపత్రాలు. వీటిని మారేడు దళాలు అని కూడా అంటారు. విష్ణుమూర్తి అలంకారి ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు. బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం. అందుకే ఈ శివరాత్రి రోజు బిల్వ దళాలతో ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిండిపోతుంది. సమస్యల నుంచి బయట పడేందుకు బిల్వపత్రాలతో ఈ విధంగా చేయండి.
బిల్వపత్రాలతో ఇలా చేస్తే కోరికలు తీరతాయి
శివాలయం సందర్శించి అక్కడ ఉన్న బిల్వ చెట్టు కింద ఏదైనా గులకరాయని శివుని ప్రాతినిధ్యంగా నమ్మి పూజించాలి. ఈ గులకరాయికి నీరు, బియ్యం, పచ్చి శనగలు సమర్పించాలి. ఓం నమః శివాయ అని పఠిస్తూ శివుడికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేయాలి.
శివుడి ఆశీర్వాదం పొందడానికి బిల్వ చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి సరైన ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలి. ఆర్థిక సమస్యలు నుంచి బయట పడేందుకు వీటితో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శివుడికి బిల్వ పత్రాలు అంటే మహా ప్రతీతి. అందుకు కారణం వీటిలో పార్వతీదేవి అన్ని రూపాలు ఉంటాయని స్కంద పురాణం చెబుతుంది.
పురాణాల ప్రకారం ఒక రోజు పార్వతి దేవి మందరాచల్ పర్వతాన్ని సందర్శించేందుకు వెళ్లినప్పుడు ఆమె చెమట చుక్కలు పర్వతంపై పడ్డాయి. వాటి ద్వారా బిల్వ చెట్టు వచ్చిందని చెబుతారు. గిరిజాదేవి రూపంలో పత్ర చెట్టు వేరులో ఉంటుందని, మహేశ్వరి దేవి రూపం నారలో ఉంటుందని, దక్షిణాయన దేవీ రూపం కొమ్మలలో ఉందని, పార్వతి దేవి రూపం బిల్వపత్రాలలో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
కాత్యాయనీ దేవి, గౌరీ దేవి రూపం బిల్వ చెట్టు పండులో ఉంటుందని నమ్ముతారు. బిల్వపత్రంలో పార్వతి దేవి ఉండటం వల్లే పరమ శివుడికి మారేడు ఆకులు అంటే మహా ఇష్టమని చెప్తారు. శివ పూజలో బిల్వపత్రాల సమర్పించడంలో భక్తుల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాన్ని దర్శించలేని వాళ్ళు బిల్వ చెట్టు మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు.
ఇంట్లో మారేడు చెట్టు ఉంటే కలిగే ప్రయోజనాలు
శివుడిని పూజించేటప్పుడు “ఏక బిల్వం శివార్పణం” అంటూ మారేడు దళాలు సమర్పిస్తారు. ఈ ఆకులతో పూజిస్తే ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతాయని అంటారు. సాధారణంగా ఒకసారి పూజకు ఉపయోగించిన వస్తువులు ఏవి మరొకసారి ఉపయోగించరు.
కానీ బిల్వ పత్రాలను పూజకి ఉపయోగించిన తర్వాత వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రాలు వాడిపోయినప్పటికీ పూజ చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి.
శివుడు మారేడు చెట్టు మీద నివసిస్తాడని అంటారు. అందుకే ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ చెట్టు తూర్పున నాటితే కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవిస్తారు. పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని, దక్షిణం వైపు ఉంటే యమ బాధలు తీరిపోతాయని విశ్వసిస్తారు.