బిల్వపత్రం విశిష్టత.. శివపూజకు మారేడు ఆకు ఎందుకు అవసరమో తెలుసుకోండి
బిల్వపత్రం (మారేడు దళం) పరమశివునికి ప్రీతికరం. మారేడుదళాన్ని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు.
శివలింగార్చనతో కూడిన శివపూజకు బిల్వ పత్రం అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం పరిపాటి అని ప్రముఖ ఆధ్యాత్మి కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ బిల్వపత్రం అపురూపమైనది. ఆకులు విశిష్ట ఆకారంలో ఉంటాయి. మూడు ఆకులు ఒకే సమూహంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అలనాడు భక్తకన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కాళము, హస్తి శివపూజలో బిల్వపత్రాలు అలంకరించి మోక్షప్రాప్తి పొందాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
త్రిదళం త్రిగుణాకారం
త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మపాప సంహారం
ఏకబిల్వం శివార్పణం
ఈ శ్లోకం శివస్తుతిలో బహుళప్రాచుర్యం పొందింది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత వివరించబడి ఉంది. పరమపవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడుదళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. కోటి ఏనుగుల దానఫలం, నూరు యజ్ఞాలఫలం, కోటి కన్యాదానాలవల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రం శివపూజకు సమర్చించడం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని ప్రతీతి అని చిలకమర్తి తెలియజేశారు.
అఖండ విల్వపత్రేణ పూజితే
నందికేశ్వరే శుధ్యంతిసర్వపాపేభ్యో
ఏకబిల్వం శివార్పణం
సకల పాపాల నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది శివరపురాణం. ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతిదేవికి కనిపించిందట. ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోం తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మా పార్వతీదేవి! నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీ దేవి అడిగిందట.
అందుకు బిల్వపత్రం నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను.. ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ అని వేడుకొందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటినుంచి శివస్తుతి, శివారాధనపూజకు తప్పనిసరి అయింది బిల్వపత్రం. పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడువృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడువృక్షం పరమశివునికి ప్రీతికరం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరచక్రవర్తి శర్మ అని తెలిపారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివపూజ చేయాలని సూచించారు.