Panchamurtham: పూజలో పంచామృతం విశిష్టత ఏంటి? ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు?-what is the significance of panchamrutham why its important in pooja rituals ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Panchamurtham: పూజలో పంచామృతం విశిష్టత ఏంటి? ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు?

Panchamurtham: పూజలో పంచామృతం విశిష్టత ఏంటి? ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు?

Gunti Soundarya HT Telugu
Feb 23, 2024 11:25 AM IST

Panchamurtham: పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసే సమయంలో పంచామృతం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు పంచామృతం అంటే ఏంటి? ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు.

పంచామృతం విశిష్టత ఏంటి?
పంచామృతం విశిష్టత ఏంటి? (pinterest)

Panchamurtham: హిందువులు పూజ చేసే సమయంలోనూ, ప్రతి పండుగలోనూ పంచామృతం నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారు. ఐదు రకాల పదార్థాలతో తయారుచేసే ఈ పంచామృతానికి చాలా విశిష్టత ఉంటుంది. పంచామృతాలతో దేవుడికి అభిషేకం చేయడం వల్ల దైవ ఆశీస్సులు లభిస్తాయని భక్తులు విశ్వాసం.

ఒక యజ్ఞాలు, యాగాలు, పూజ చేసిన తర్వాత పంచామృతం అనేది ఇస్తారు. హిందూ మతాలలో ప్రతి ఆచారంలో పంచామృతాన్ని సేవిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతంతో తప్పనిసరిగా అభిషేకం చేస్తే పులకించిపోతాడు. పంచామృతం అనేది ఒక పవిత్రమైన అమృతం. ఐదు పదార్థాలతో తయారుచేస్తారు. ఇది సేవించడం వల్ల భక్తుడు స్వచ్ఛంగా దైవానికి దగ్గరగా ఉంటాడని నమ్ముతారు.

కొంతమంది పంచామృతంలో పళ్ల రసం కలుపుతారు. కానీ అసలు పంచామృతంలో తియ్యదనం కోసం మిశ్రి అనే పదార్థం కలుపుతారు. ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, మిశ్రితో దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మిశ్రికి బదులు చాలా మంది ఏదైనా పళ్ల రసం లేదంటే చక్కెర కలుపుతున్నారు. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు.

పాలు

పంచామృతంలో ఉపయోగించే మొదట పదార్థం పాలు. సాధారణం దొరికే గేదె పాలు ఇందులో కలపకూడదు. ఆవు పాలు మాత్రమే వినియోగించాలి. పాలు స్వచ్ఛతని సూచిస్తారు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆవుపాలు వేడి చేస్తాయి. దాన్ని తగ్గించేందుకు పెరుగు కలుపుతారు.

పెరుగు

పంచామృతంలో మరొక పదార్థం పెరుగు. పాల మాదిరిగానే పెరుగు కూడా స్వచ్ఛత, సంరక్షణ సూచిస్తుంది. హిందూ ఆచారాలలో దేవతలకు సమర్పించే నైవేద్యాలలో పెరుగుకు ముఖ్యమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలో శివుడికి పాలు, పెరుగు ప్రధాన నైవేద్యంగా పెడతారు. ఆరోగ్యకరంగా కూడా పెరుగు చాలా పోషక విలువలు కలిగినది. ఇందులో పేగులకు మేలు చేసే ప్రోబయోటిక్స్ ఉంటాయి. శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. ఆవు పాలతో తయారు చేసిన పెరుగు మాత్రమే వినియోగిస్తారు.

తేనె

పంచామృతం లో ఉపయోగించే మరొక తీపి పదార్థం తేనె. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి. హిందూ శాస్త్రం ప్రకారం దీనికి పవిత్రమైన హోదా ఉంది. తేనె తేజస్సు, దీర్ఘాయువు కోసం ఉత్తమ ఔషధంగా పరిగణిస్తారు. హిందూ సంస్కృతిలో తేనె ధైవంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. అందుకే తరచుగా దేవతలను శాంతింప చేసేందుకు తేనెను నైవేద్యంగా సమర్పిస్తారు.

నెయ్యి

పంచామృతంలో కలిపే మరొక పదార్థం నెయ్యి. ఎన్నో పోషక విలువలు కలిగిన నెయ్యి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. వైదిక సంప్రదాయాలలో నెయ్యి అగ్నిదేవుడికి ఇష్టమైనది కనుక అగ్నిలో పవిత్రమైన నైవేద్యంగా సమర్పిస్తారు. పూజని దేవుళ్ళకి ఇష్టంగా మార్చే గుణాలు నెయ్యిలో ఉన్నాయని నమ్ముతారు. ఇది దీవెనలు, బలం, విజయం, ఆశీర్వాదం ఇస్తుందని నమ్ముతూ దేవతలకు సమర్పిస్తారు.

పంచదార

పంచామృతంలో ఉపయోగించే మరొక పదార్థం పంచదార. పాతకాలంలో అయితే మిశ్రి అనే కండ చక్కెరని వినియోగించారు. కానీ ఇప్పుడు దానికి బదులుగా చక్కెరతో భర్తీ చేస్తున్నారు. దైవిక ఆశీర్వాదాల కోసం మీ కోరిక దేవుడి దగ్గర తెలియచేయడం కోసం ఇందులో పంచదార కలుపుతారు. జీవితాన్ని మధురంగా నింపమని కోరుకుంటూ దేవుడికి సమర్పిస్తారు.

తులసి ఆకులు

కొన్ని ప్రాంతాల వాళ్ళు తులసి ఆకులు కూడా పంచామృతంలో చేర్చి దేవతలకు సమర్పిస్తారు. ఇది కలపడం వల్ల పంచామృతం పవిత్రత రెట్టింపు అవుతుంది. తులసి ఆకులు స్వచ్ఛత, రక్షణ, ఆధ్యాత్మికతకు చిహ్నంగా భావిస్తారు. పవిత్రమైన మొక్కలలో తులసికి ప్రధాన స్థానం ఉంటుంది. తులసి ఆకులు ప్రతికూలత నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.