Sugar Alternatives: పంచదారకు బదులుగా వాడే స్వీటెనర్లు మంచివేనా!-know about different health effects of using artificial sweeteners ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sugar Alternatives: పంచదారకు బదులుగా వాడే స్వీటెనర్లు మంచివేనా!

Sugar Alternatives: పంచదారకు బదులుగా వాడే స్వీటెనర్లు మంచివేనా!

HT Telugu Desk HT Telugu
Nov 28, 2023 05:00 PM IST

Sugar Alternatives: మధుమేహులు పంచదారకు బదులుగా వాడే ఆర్టిఫిషియల్ స్వీటెనర్ల గురించి చాలా అనుమానాలుంటాయి. వాటి వాడకం మంచిదా కాదా అని వివరంగా తెల్సుకోండి.

కృత్రిమ స్వీటెనర్లు
కృత్రిమ స్వీటెనర్లు (freepik)

చాలా మంది డయాబెటిక్‌ పేషెంట్లు పంచదారకు బదులుగా కృత్రిమ స్వీటనర్లను వాడుతూ ఉంటారు. గత కొంత కాలంగా ఇలాంటి స్వీటనర్లు మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తినడం వల్ల చక్కెర మన శరీరంలోకి చేరదు. అలాగే కేలరీలూ రావు. అందువల్ల షుగర్‌ పెరగదు. ఇలాంటి ఉద్దేశంతోనే సింథటిక్‌ పదార్థాలను వాడి వీటిని తయారు చేస్తారు. కృత్రిమంగా తీపి రుచిని తెప్పిస్తారు. మరి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? అంటే అస్సలు కాదంటున్నారు వైద్య నిపుణులు. వీటి వల్ల చాలా దుష్ప్రభావాలు మన శరీరంపై ఉంటాయని అంటున్నారు. అవేంటంటే..

అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తాయి :

పంచదారకంటే అతిగా ఈ కృత్రిమ స్వీటనర్లు తియ్యగా ఉంటాయి. అందువల్ల ఇలా ఉండే అధిక కేలరీల ఆహారాలను మరింత తినాలనిపించేలా ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి. దీంతో ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినాలనే కోరిక మనకు పుడుతుంది. ఫలితంగా మనం అతిగా తిని బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

పేగుల ఆరోగ్యంపై దుష్ప్రభావం :

కృత్రిమ స్వీటనర్లు మన పేగుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు గ్లూకోజ్‌ని ఎక్కువగా తీసుకోలేనట్లుగా మార్చేస్తాయి. అందువల్ల గ్లూకోజ్‌ ఇంటోలరెన్స్‌, ఊబకాయం లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల గ్యాస్‌ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఇవి పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాలను పాడు చేస్తున్నట్లు తేలింది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరిగిపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు గమనించారు.

మెదడు పనితీరుపై ప్రభావం :

ఆర్టిఫిషియల్‌ స్వీటనర్ల వల్ల మెదడు పనితీరుపై దుష్ప్రభావాలు కలుగుతాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అలాగే వీటిని తినడం వల్ల ఎక్కువగా తీపి తినాలన్న కోరిక కలుగుతుందని తెలిసింది. ఆ రకంగా ఇవి మెదడును ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నాలుకపై ఉండే రుచి మొగ్గలు కూడా వీటి వల్ల పాడవుతాయని తేల్చారు.

ఆలోచనా తీరు మారాలి :

మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తీపిగా తాగినా రక్తంలో చక్కెరలు, పిండి పదార్థాలు చేరకుండా ఉంటాయి. కాబట్టి వారికి ఇవి కావాలని అనిపిస్తూ ఉంటుంది.

ఒకసారి వీటికి అలవాటు పడితే ఇవే కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఇవి లేకుండా టీ కాఫీలల్లాంటివి తాగేందుకు మనసు రాదు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే వీటిని వాడాలని చూడకూడదు. చప్పగా తాగడాన్నే అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారు ఎవరైనా సరే.. దీన్ని పాటించాల్సిందే.

Whats_app_banner