పంచామృతం అంటే ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి?
పంచామృతం అంటే ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి.
భగవంతుడికి పంచామృత స్నానం, పంచామృత అభిషేకం చేయించాలని అంటారు. ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు. ప్రతి సోమవారం, శనివారం శివయ్యకు అభిషేకం చేయిస్తే మీ కష్టాలన్నీ తొలగినట్టే. పాలు, తేనె, నెయ్యి.. ఇలా అనేక పదార్థాలతో మనం అభిషేకం చేయిస్తుంటాం. మరి పంచామృతంతో అభిషేకం చేయాలన్నప్పుడు ఏం చేయాలి?
పంచామృతంలో ఉండాల్సిన పదార్థాలు
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పండ్ల నుంచి వచ్చే రసం గానీ, కొబ్బరి నీళ్లు గానీ కలిపితే పంచామృతం అవుతుంది. పంచామృతం కలిపి అభిషేకం చేయొచ్చ.. ఆయా పదార్థాలను విడివిడిగా అభిషేకం చేయొచ్చు. అయితే విడివిడిగా చేస్తే ప్రతి పదార్థంతో అభిషేకం చేసినప్పుడు ప్రతిసారి శుద్ధ జలంతో స్నానం చేయించాలి.
పంచామృత అభిషేకం చేశాక కూడా శుద్ధోదక స్నానం చేయించాలి. పంచామృతంలో వాడే ప్రతి పదార్థం శరీర కాంతిని పెంపొందించేవే. భగవంతుడికి నమక చమకములతో మంత్రోచ్ఛరణతో పంచామృతంతో అభిషేకం చేస్తే అపారమైన శివభక్తి పెరుగుతుంది.
పంచామృతములకు ఉన్న శక్తి
చక్కగా ప్రశాంతంగా మంత్రం చదువుతూ అభిషేకం చేసినా, చూసినా మీ మనస్సు తేజోవంతం అవుతుంది. భక్తి విశేషంగా పెరుగుతుంది. రుద్రం యొక్క శక్తి వల్ల మీరు అంతటా ఈశ్వరుడిని చూసే శక్తి వస్తుంది. పంచామృతంతో అభిషేకం చేస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం.