Kalasham importance: పూజలలో కలశం ఎందుకు వాడతారు? కలశం ప్రాముఖ్యత ఏమిటి?-know about kalasham and its importance in detail ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kalasham Importance: పూజలలో కలశం ఎందుకు వాడతారు? కలశం ప్రాముఖ్యత ఏమిటి?

Kalasham importance: పూజలలో కలశం ఎందుకు వాడతారు? కలశం ప్రాముఖ్యత ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Sep 27, 2023 06:34 PM IST

Kalasham importance: పూజల్లో వాడే కలశానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కలశం అంటే ఏమిటి? ఎలాంటి పాత్ర కలశానికి వాడాలో వివరంగా తెలుసుకోండి.

కలశం ప్రాముఖ్యత
కలశం ప్రాముఖ్యత (freepik)

భారతీయ సనాతన ధర్మంలో పండుగలలో, వ్రతాలలో, పూజలలో కలశారాధన చాలా విశిష్టం. మనం ఆచరించే వ్రతాలు, పూజలలో సంకల్పం, పసుపు గణపతి పూజ, కలశారాధనకు ప్రత్యేక స్థానాలున్నాయి. నీళ్లు నింపిన కలశం దేవతలకు ఆసనంగా భావిస్తారు. జలం శుద్ధమైనది కనుక నీళ్లు ఎంత పవిత్రం, శుద్ధం అయితే ఈశ్వరీయ చైతన్య తత్త్వాన్ని అంతగా కలశంలోకి ఆకర్షింపచేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

కలశానికి ఎలాంటి పాత్ర వాడాలి?

కలశారాధన చేసేటప్పుడు వెండితో గాని, రాగితో గాని, బంగారంతోగాని చేసిన కలశాలను మాత్రమే ఉపయోగించాలి. పంచలోహాలతో చేసిన కలశాలను కూడా ఉపయోగించవచ్చు. కలాశారాధన చేసేటప్పుడు కలశంలో మంచినీరు లేదా అందుబాటులో ఉన్న పవిత్ర నదీ జలాల నీరును ఉపయోగించడం శేష్టం. కలశంలోని నీటిలో సుగంధ ద్రవ్యాలైనటువంటి గంధం, పసుపు, కుంకుమ వంటివి ఉండటం, అలాగే కలశంలో రాగినాణెం, పంచరత్నాలు, తులసి దళం వంటివి వాడటం శ్రేష్టం.

హిందూ సాంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు.. అంటే వివాహం, ఉపనయనం, గృహప్రవేశం వాటికి కూడా కలశారాధన చేయటం ముఖ్యం. రాగి, వెండి, బంగారం వంటి పాత్రలో నీటిని నింపి మామిడాకులు వేసి కొబ్బరికాయను పెట్టి పసుపు కుంకుమలు పెట్టిన పాత్రలను కలశం అని అంటారు.

పురాణాల ప్రకారం సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీమహావిష్ణువు తన శేషశయ్యపై పవళించుచుండగా అతని నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఉద్భవించిన బ్రహ్మ తన చేతిలో కలశముతో ఉద్భవించినట్లుగా ఆ కలశంలో ఉన్న నీటితోనే ఈ సృష్టిని పుట్టించినట్లుగా చెప్పబడింది. అందుకనే ఈ కలశారాధనలో భాగంగా కలశంలో వాడే మామిడాకులు, కొబ్బరికాయలను సృష్టికి ప్రతీకగా చెప్పబడ్డాయి.

కలశానికి కట్టే దారం సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచిస్తుంది. ఇలా రాగి పాత్రలో మామిడాకులు, కొబ్బరికాయ ఉంచి ఎరుపుదారము చుట్టబడిన పాత్రను కలశముగా ఆ పాత్రను బియ్యము లేదా నీటితో నింపబడడంచేత ఆ పాత్రను కలశం లేదా పూర్ణకుంభముగా చెప్పబడినది. ఇలా నింపబడిన కలశము దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక. భారతీయ సంప్రదాయంలో దేవతా ప్రతిష్టలకు, అభిషేకాలకు పండితులు, అతిథుల ఆహ్వానానికి కలశాన్ని ఉపయోగిస్తారు.

పురాణాలలో ఒక కథ ప్రకారం పాలసముద్రాన్ని దేవతలు, రాక్షసులు మధించినపుడు అందులో నుండి వచ్చినటువంటి అమృతం కలశరూపంలో వచ్చిందని అమరత్వాన్ని ప్రసాదించే అమృతం కలశంగా పేర్కొనబడినది. ఇంతటి విశిష్టత ఉంది కాబట్టే మన పూజలలో కలశాన్ని వాడతారని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

టాపిక్