ధర్మ సందేహం: ధ్వజ స్తంభానికి ఎందుకు నమస్కారం చేయాలి?
ధర్మ సందేహం: ధ్వజ స్తంభానికి ఎందుకు నమస్కారం చేయాలి? వంటి ధర్మ సందేహాలకు ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సమాధానం ఇచ్చారు.
దేవాలయాలను దర్శించేముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసిన తరువాత గర్భగుడి ఆలయ దర్శనం చేయడం విధి విధానమని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు. ధ్వజస్తంభాల ప్రాశస్త్యము గురించి మనకు మహాభారతం తెలియచేస్తుందని చిలకమర్తి తెలిపారు.
మహాభారతం కథ ప్రకారం మణిపుర పాలకుడు మయూరధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధిస్తాడు. దీంతో అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మయూరధ్వజునితో యుద్దానికి దిగి ఓడిపోతారు. దీంతో ధర్మరాజు స్వయంగా మణిపురం బయలుదేరతాడు. అది గ్రహించిన కృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు. శ్రీ కృష్ణుడు, ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణుల వేషంలో మణిపురం చేరుకుంటారు. మయూరధ్వజుడు వారికి దానం చేయాలనుకొని ఏం కావాలో కోరుకోమంటాడు.
అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీ కృష్ణుడు బదులిస్తూ ‘అడవిలో ఒక మృగం నా సహచరుడి (మారువేషంలో ఉన్న ధర్మరాజును చూపిస్తూ) కుమారుడిపై దాడి చేసింది. విడిచిపెట్టమని ప్రాధేయపడగా బాలుడు దక్కాలంటే రాజు మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఆహారంగా తేవాలని ఆ మృగం అడిగింది. తమ శరీరం నుంచి సగభాగం దానమిస్తే పసిబాలుడిని కాపాడుకుంటాం..’ అని కోరుతాడు.
మయూరధ్వజుడు అందుకు ఒప్పుకుంటాడు. ఆ రాజు దానశీలతను చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే తమ నిజరూపాన్ని ప్రదర్శిస్తూ నీ దానశీలతకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అంటూ శ్రీ కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు మయూరధ్వజుడు తన శరీరం నశించినా, తన ఆత్మ ఇతరులకు ఉపయోగపడేలా, నిత్యం మీ ముందు ఉండేలా దీవించండి అని కోరుకుంటాడు. ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయని, వాటిలో నీ ఆత్మ చిరంజీవియై నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుందని శ్రీకృష్ణుడు దీవిస్తాడు. ముందు ద్వజ స్తంభాన్ని దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తరువాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారని వరమిస్తూ దీవిస్తాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు. అందుకే భక్తులు ధ్వజ స్తంభాన్ని ముందుగా దర్శించుకుని ప్రదక్షిణాలు చేస్తారని వివరించారు.