తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation On The Fear You Let Build Up In Your Mind Is Worse Than The Situation

Monday motivation : భయం అనేది సహజం.. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తేనే అనర్థం..

19 September 2022, 6:00 IST

    • Monday motivation : భయపడటంలోనే పడటం ఉంది బాబాయ్.. మనం పడొద్దు అని ఓ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాశారు. నిజమేనండోయ్.. భయపడటంలోనే పడటం ఉంది. ఈ భయం ఒక్కసారి మొదలైందంటే అది మిమ్మల్ని కచ్చితంగా కిందకి పడేస్తుంది. కాబట్టి దానిని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Monday motivation : నిజం చెప్పాలంటే భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇది మనల్ని మరింత స్ట్రాంగ్​గా చేయగలదు. లేదంటే మిమ్మల్ని వీక్​గా మార్చవచ్చు. మీ భయం మీ బలం అయినంతవరకు అది మీకు మంచిదే. కానీ అది మీ బలహీనత అయితేనే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి భయపడండి. కానీ ఆ భయం మిమ్మల్ని భయపెడుతుందంటే మాత్రం.. దానిని అధిగమించడానికి ప్రయత్నించండి.

అందరికీ భయం ఒకేలా ఉండదు. కొందరు ఓడిపోతామనే భయంతో లేదా ప్రేమించిన వారిని కోల్పోతామనే భయంతో వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వాటిని దక్కించుకునేందుకు వారి భయాన్నే బలంగా మార్చుకుంటారు. దానికోసం తగినంత ప్రాక్టీస్ చేస్తారు. అది వారు మెరుగ్గా మారేందుకు సహాయం చేస్తుంది. ఇలాంటి భయం మీకు ఉంటే పర్లేదు. ఎందుకంటే ఆ భయం మిమ్మల్ని మీరు కోరుకునే దానికి దగ్గర చేసేందుకు సహాయం చేస్తుంది. దానికోసం మీరు ఎక్కువ కష్టపడేలా చేస్తుంది.

కానీ ఇతరులను కోల్పోతామని లేదా కోరుకున్నది దక్కదేమో అనే భయం మీకు ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ భయం మిమ్మల్ని, మీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. మీ భయం మిమ్మల్ని, మీ పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తుంది. ఆ సమయంలోనే మీరు తెలియకుండా ఎక్కువ తప్పులు చేసే అవకాశముంది. మీరు చేసిన తప్పులు మీ భయాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఒక్కోసారి మీరు కావాల్సినవి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు తగినంత జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా మసులుకోండి. పొరపాటున ఏది చేసినా.. దాని గురంచి నిరంతరం బాధపడాల్సి వస్తుంది.

భయం అందర్లోనూ ఉంటుంది. దానిని అధిగమించిన వారే సక్సెస్ అవుతారని గుర్తుంచుకోండి. భయం అనేది బలహీనత కాదని గుర్తుంచుకోండి. మనుషులకుండే ఎమోషన్స్​లో అది కూడా ఒకటి. కొందరికి నీరంటే భయముంటుంది. కానీ మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మీకు కొన్ని విషయాలపట్ల లేదా కొందరు వ్యక్తుల పట్ల భయం ఉండొచ్చు. మీరు భయపడేవాటికి అందరూ భయపడాలి అని రూల్ లేదు. ఇతరులు భయపడే వాటిపట్ల మీకు భయం ఉంటుందని గ్యారెంటీ లేదు. మీకు భయం ఉంటే.. మీరే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం. ఆలోచనలను అదుపులో పెట్టుకుంటే భయం కూడా మీ దగ్గరికి రాదు. కాబట్టి ఓవర్ థింక్ చేయడం మానేయండి. భయాన్ని అధిగమించండి. మీకు ఏదంటే భయముందో దానిని ఓసారి ఎదుర్కోండి. అప్పుడు మీకు దానిలోని ప్లస్​, మైనస్​లు తెలుస్తాయి. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైనా.. మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.

టాపిక్