తెలుగు న్యూస్  /  Lifestyle  /  From Menstrual Irregularities To Reduced Fertility, Heatwaves Can Impact Womens Reproductive Health

Heat- Women's Health। ఎండవేడికి మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు, గర్భిణీలు జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

30 May 2023, 11:26 IST

    • Women's Reproductive Health: తల్లి కావాలనుకునే వారికి హీట్ వేవ్ ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. విపరీతమైన వేడి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
Women's Reproductive Health
Women's Reproductive Health (istock)

Women's Reproductive Health

Women's Reproductive Health: విపరీతమైన వేడి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలం పాటు వడగాలులు, వేడి వాతావణంను అనుభవించడం వలన అది ప్రజల శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈరకమైన వేడి పరిస్థితులు ఋతుక్రమ మార్పులకు కారణమవుతుంది, ఇది వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, ఎండోమెట్రియోసిస్ వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

తల్లి కావాలనుకునే వారికి హీట్ వేవ్ ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. వారు తరచూ వేడి సంబంధిత అనారోగ్యాలకు గురవుతారు. గర్భధారణ సమయంలో ముందస్తు డెలివరీ, ప్రీక్లాంప్సియా, న్యూరల్ ట్యూబ్ లోపాల సమస్యలకు దారితీయవచ్చు. వేడి వాతావరణ పరిస్థితులు మహిళల పునరుత్పత్తి సామర్థ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో నిపుణులు వివరించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.

క్రమరహిత పీరియడ్స్

అధిక ఉష్ణోగ్రతలకు స్త్రీలు ఎక్కువసేపు గురికావడం వల్ల, ఇది వారిలో నిర్జలీకరణం, అలసట, వికారం సమస్యలను కలిగిస్తుంది. దీని ప్రభావం మొదటగా వారి ఋతుచక్రంపై పడుతుంది. తీవ్రమైన ఎండవేడి ఋతు చక్రానికి అంతరాయం కలిగిస్తుంది, క్రమరహిత పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం లేదా అధికంగా రావడం ఉంటుందని వైద్యులు అన్నారు.

సంతానోత్పత్తి సమస్యలు

వేడి వాతావరణంలో ఉండటం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి కూడా తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల వారి అండాశయంలో అండాలు దెబ్బతింటాయి, వాటి నాణ్యత తగ్గుతుంది, అండోత్సర్గము దెబ్బతింటుంది. దీంతో స్త్రీలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా, తద్వారా గర్భం దాల్చడం వారికి కష్టమవుతుంది.

గర్భధారణ సమస్యలు

హీట్‌వేవ్‌లు గర్భధారణ సమయంలో సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. వేడి వాతావరణం వల్ల కలిగే నిర్జలీకరణం వలన ఉమ్మనీరు తగ్గిపోవచ్చు, ఇది ముందస్తు ప్రసవానికి దారితీస్తుంది. నెలలు నిండకుండా పుట్టడం వలన శిశువులు తక్కువ బరువును కలిగి ఉంటారు. గర్భిణీ స్త్రీలు తీవ్రమైన వేడికి గురైనప్పుడు ఇతర గర్భస్థ సమస్యల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. మధుమేహం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇవి తల్లికి, కడుపులోని బిడ్డకు ఇద్దరికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.

స్త్రీలు వేసవిలో తీసుకోవాల్సిన చర్యలు

  • తీవ్రమైన వేడికి గురికాకుండా నీడలో ఉండండి. ముఖ్యంగా విపరీతమైన వేడికి గర్భిణీ స్త్రీలు త్వరగా జబ్బుపడే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
  • పుష్కలంగా నీరు త్రాగండి, గదిలో చల్లని వాతావరణం కల్పించుకోండి. ఎయిర్ కండిషన్ కలిగిన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి. వంటగదిలో వంట చేయడం, ఎండలో పనిచేయడం వంటి వేడిని పెంచే పనులను నివారించండి.
  • వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో శ్రమతో కూడిన కార్యకలాపాలను నివారించండి.
  • గర్భిణీ స్త్రీలు చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి.

వేడి-ప్రేరిత ఒత్తిడి, ఆందోళన, నిద్ర ఆటంకాలు మహిళల మానసిక శ్రేయస్సు, పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు.