Men’s fertility: పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి?-what should be done to increase fertility in men ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Should Be Done To Increase Fertility In Men?

Men’s fertility: పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి?

HT Telugu Desk HT Telugu
May 29, 2023 10:51 AM IST

Men’s fertility: పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి? నిపుణుల సలహాలు ఇక్కడ చూడండి.

పురుషుల్లో సంతానాత్పత్తి సామర్థ్యం పెరిగేందుకు నిపుణుల సూచనలు
పురుషుల్లో సంతానాత్పత్తి సామర్థ్యం పెరిగేందుకు నిపుణుల సూచనలు

గడిచిన 45 ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ 51.6 శాతం మేర తగ్గినట్టు ఇటీవల హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తేల్చింది. జీవన శైలి ఎంపికలు, పర్యావరణంలోని హానికరమైన రసాయనాల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని అధ్యయన విశ్లేషించింది. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలని నొక్కొచెప్పింది.

ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ కోఫౌండర్, సీఈవో డాక్టర్ క్షితిజ్ ముర్దియా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను వివరించారు. ‘పురుషులు ప్రాథమికంగా అలవరచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆరోగ్యకరమైన, సమతులమైన ఆహారం తీసుకోవడం. ఇది తీసుకుంటే వీర్య కణాల పరిమాణం, నాణ్యత, కదలిక గణనీయంగా మెరుగుపడుతుంది..’ అని వివరించారు.

పురుషులు ఫెర్టిలిటీ కోసం చేయాల్సినవి:

  • పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి: పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, పప్పులు మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి వీర్య గాఢతను, కదలికను పెంచుతాయి.
  • చేపలు తినండి:  చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. స్పెర్మ్ మొటిలిటీ పెరగాలంటే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. మాంసాహారులైతే చేపలు మీ ఆహారంలో భాగం చేసుకోండి.
  • పిండిపదార్థాలు తగ్గించండి: కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం ఇన్సులిన్ స్థాయిన తగ్గించడమే కాకుండా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా వీర్య కణాల సంఖ్య, మొటిలిటీ పెరుగుతుంది.
  • జింక్ ఉండేలా చూడండి: పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే మీరు తినే ఆహారంలో జింక్ ఉండేలా చూడండి. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. చికెన్, పాలకూర, గుమ్మడి గింజలు, పప్పుదాన్యాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది.
  • యాంటీ-ఆక్సిడంట్లు: స్పెర్మ్ నాణ్యత పెరిగేందుకు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుకునేందుకు యాంటీ-ఆక్సిడంట్లు అవసరం. బెర్రీ పండ్లు, నట్స్, ఆకు కూరలు, కూరగాయలు, చిక్కుళ్లు, జామ, అరటి, అవకాడో, సిట్రస్ పండ్లలో యాంటీ-ఆక్సిడంట్లు పుష్కలంగా ఉంటాయి. 

సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి చేయకూడనివి

  • ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి: ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికం. అలాగే రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, కృత్రిమ బంక పదార్థాలు వంటివి ఉంటాయి. ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తాయి. అలాగే వీర్య కణాల్లో కదలికను తగ్గిస్తాయి. అందువల్ల పోషకాలు అధికంగా ఉంటే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
  • కొన్ని ఫుడ్స్‌కు టాటా చెప్పేయండి: పురుషులు మాంసం, అధిక కొవ్వులు ఉన్న డెయిరీ ఉత్పత్తులు ముఖ్యంగా వెన్న తీయని పాలు, క్రీమ్, చీస్ తగ్గించాలి. సోయా ఉత్పత్తుల్లో ఫైటోఈస్ట్రోజెన్లు ఉన్నందున వాటిని కూడా తగ్గించాలి.
  • పొగ తాగరాదు: పొగ తాగడం, పొగాకు వినియోగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి.

WhatsApp channel