Summer Walking । వేసవిలో నడక మంచి వ్యాయామం కానీ, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
27 May 2023, 10:06 IST
- Summer Walking: వేసవిలో ఎండ తొందరగా వచ్చేస్తుంది. చాలా మందికి నడకకు వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ బయటకు వెళ్ళలేరు, నడిచేటప్పుడు వేడిని అధిగమించడానికి ఇక్కడ మరిన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.
Summer Walking
Summer Walking: తేలికపాటి వ్యాయామం చేయడానికి నడక ఒక గొప్ప మార్గం. నడక ఏ వయసు వారికైనా అనుకూలంగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేడి వేసవి నెలల్లో సాధారణంగానే చెమట ఎక్కువ పడుతుంది. ఎండవేడికి త్వరగా అలసట, నీరసం వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన వ్యాయామాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అయితే ఈ వేసవిలో మీ ఫిట్‌నెస్ స్థాయిలు సరిగ్గా ఉంచుకోవడం కోసం నడక మీకు సరైన వ్యాయామంగా ఉంటుంది. నడిచినపుడు మీ శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి, ఇది మీ మానసిక స్థితిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, మీరు కేలరీలను బర్న్ చేస్తారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడవడం వలన అధిక రక్త పోటు, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటీస్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు, తేమ వాతావరణం కారణంగా చాలా మందికి నడకకు వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ బయటకు వెళ్ళలేరు, ఉదయం కూడా లేచి నడవాలనిపించదు. అయితే ఈ వేసవిలో నడిచేటప్పుడు వేడిని అధిగమించడానికి ఇక్కడ మరిన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.
చల్లగా ఉన్నప్పుడు నడవండి
వేసవిలో ఎండ తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి సూర్యతాపం తక్కువ ఉన్నప్పుడు చల్లని ఉదయాన్నే నడవండి. మీకు ఉదయం పూట వీలు కాకపోతే సాయంత్రం లేదా రాత్రికి నడవండి. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలనేం లేదు. వ్యాయామానికి రోజులో కొంత సమయం కేటాయిస్తే చాలు. కాబట్టి ఈ ఎండకాలంలో చల్లని సమయంలో ఎప్పుడైనా నడకకు వెళ్ళండి.
నీడపట్టున నడవండి
మీరు నడకకు వెళ్లినపుడు ఎండగా ఉన్నట్లయితే చెట్లకింద నుంచి భవనాల అంచుల నుంచి నడవండి. నీడ ఉన్న మార్గాన్ని అన్వేషించండి. ఆ మార్గంలోనే మీ నడకను కొనసాగించండి.
తేలికైన వస్త్రాలు ధరించండి
ఎండాకాలంలో నడకకు వెళ్లినపుడు తేలికైన వదులుగా ఉండే వస్త్రాలు ధరించండి. పూర్తిగా కప్పిఉంచే దుస్తులు కాకుండా మీ చర్మం బహిర్గతం అయ్యేలా ఉండే దుస్తులు ధరించాలి. తద్వారా చెమట త్వరగా ఆవిరైపోతుంది. ఇదే సమయంలో మీ ముఖం, చేతులకు, కాళ్లకు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మరిచిపోవద్దు, లేదంటే మీ చర్మం సన్ ట్యాన్ కు గురై నల్లబడుతుంది.
దుస్తులు తడుపుకోండి
మీరు ఈ వేసవిలో నడకకు వెళ్లినపుడు తీవ్రమైన ఉక్కపోత కారణంగా మీ శరీరం వేడెక్కే ప్రమాదం ఉంది. ఈ సమయంలో కొన్ని నీళ్లను మీ చొక్కపై చిలకరించుకోండి. మీరు అక్కడికక్కడే ఎయిర్ కండిషనింగ్ పొందుతారు. నడిచేటపుడు చల్లటి అనుభూతి ఉంటుంది. నడక ఉల్లాసంగా అనిపిస్తుంది.
నీరు తాగండి
మీరు బయటకు వెళ్ళేటపుడు తప్పకుండా గడ్డకట్టిన ఐస్ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్ళండి, మీరు నడుస్తున్నప్పుడు దాహం వేస్తే క్రమం తప్పకుండా కొన్ని సిప్స్ తీసుకోండి. ప్రతి 15 నిమిషాలకు ఆరు నుంచి ఎనిమిది ఔన్సుల నీరు సరిపోతుంది. ఐస్ క్యూబ్ వాటర్ తీసుకెళ్తే వేడికి అది కరుగుతుంది, మీరు ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా నీరు తాగగలుగుతారు. డీహైడ్రేషన్ ను నివారించవచ్చు.
స్పోర్ట్స్ డ్రింక్స్ ప్రయత్నించండి
మీరు వేసవిలో ఎక్కువ నీరు త్రాగలేకపోతే, స్పోర్ట్స్ డ్రింక్‌ని తాగటానికి ప్రయత్నించండి. ఇవి మంచి రుచితో పాటు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. వేగంగా రక్తప్రవాహంలోకి శోషణ చెంది శక్తి లభిస్తుంది కాబట్టి మీరు మరింత ఎక్కువ దూరం నడవవచ్చు, వ్యాయామం తర్వాత అలసటను నివారించవచ్చు.