తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Somu Veerraju On Jr Ntr : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. సోము కీలక కామెంట్స్

Somu Veerraju On Jr NTR : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. సోము కీలక కామెంట్స్

HT Telugu Desk HT Telugu

04 September 2022, 21:43 IST

    • కొన్ని రోజుల క్రితం కేంద్రమంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది. దీనికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్ చేయడమే.
అమిత్ షా ఎన్టీఆర్ భేటీ(ఫైల్ ఫొటో)
అమిత్ షా ఎన్టీఆర్ భేటీ(ఫైల్ ఫొటో) (twitter)

అమిత్ షా ఎన్టీఆర్ భేటీ(ఫైల్ ఫొటో)

కేంద్రమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కొన్ని రోజుల క్రితం.. పొలిటికల్ హీట్ పెంచింది. ఎన్టీఆర్ ను బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తోందని కామెంట్స్ వచ్చాయి. కానీ కలిసింది మాత్రం.. ఆర్ఆర్ఆర్ లో నటన చూసే అని బీజేపీ చెప్పింది. కానీ మరేదో విషయం ఉంటుందనే అభిప్రాయం ఇప్పటికీ అందరిలో ఉంది. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జూనియర్ ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ సేవలను అవసరమైన చోట బీజేపీ వినియోగించుకుంటోందని సోము వీర్రాజు ఇక్కడ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అవసరమైనప్పుడు అతని సేవలను అభ్యర్థిస్తానని వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ-టీడీపీ పొత్తు ఉంటుందా అని అడిగినప్పుడు 'వంశపారంపర్య రాజకీయాలకు దూరంగా ఉన్నామని మేం ఇప్పటికే స్పష్టం చేశాం.' అని అన్నారు.

ఈ సందర్భంగా కాకినాడ బల్క్ డ్రగ్ పార్క్ పై సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కాకినాడ జిల్లాకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కేటాయిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడటం సరికాదని మండిపడ్డారు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు కోరినా.. మోదీ ఆంధ్రప్రదేశ్‌కు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కేటాయించారని తెలిపారు. చంద్రబాబు అడ్డుపడుతూ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దని లేఖ రాయించడం సరికాదన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల సభలు నిర్వహిస్తామని చెప్పారు.

కోస్టల్ కారిడార్ అభివృద్ధి చెందడానికి 4 లైన్ల 216 రోడ్ ను అనుసంధానిస్తామని సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడలుగా మార్చటం కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కోసం కేజీకి 38 రూపాయలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అంటగడుతోందని ఆరోపించారు. నాసిరకం బియ్యాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసి వాటిని రీ మిల్లింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్టుగా వ్యాఖ్యానించారు.

'కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం తన పథకాలుగా చెబుతుంది. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేస్తాం. కోనసీమ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 40 బహిరంగ సభలు, జిల్లాలో 280 బహిరంగ సభలు నిర్వహిస్తాం. బహిరంగ సభల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ లను నియమించాం.' అని సోము వీర్రాజు చెప్పారు.