AP EAPCET 2024 Hall Tickets : ఏపీ ఈఏపీసెట్ అప్డేట్, మే 7న హాల్ టికెట్లు విడుదల
05 May 2024, 17:51 IST
- AP EAPCET 2024 Hall Tickets : ఏపీ ఈఏపీసెట్-2024 హాల్ టికెట్లు ఈ నెల 7 నుంచి వెబ్ సైట్ లో విడుదల చేయనున్నారు. మే 16 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ ఈఏపీసెట్ అప్డేట్, మే 7న హాల్ టికెట్లు విడుదల
AP EAPCET 2024 Hall Tickets : ఏపీ ఈఏపీసెట్-2024 హాల్ టికెట్లు(AP EAPCET Hall Tickets) మే 7న విడుదల కానున్నాయి. ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తుంది. మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ , అనుబంధ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తున్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇప్పటి వరకూ దరఖాస్తులు
ఏపీలోని కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy Courses) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్-2024కు 3,54,235 మంది అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది నిర్ణీత గడువులోగా 3,54,235మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు 2,68,309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు 84,791 మంది, రెండు విభాగాల్లో 1135 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈఏపీ సెట్(AP EAPCET Applications) దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.
ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తుకు అవకాశం
ఈఏపీ సెట్ నిర్వహణకు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంజినీరింగ్(Engineering) విభాగంలో ఆన్‌లైన్ పరీక్షలు(Online Exams) మే 18 నుంచి మే 22 వరకు జరగాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మే 23 తేదీన కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో పరీక్షలు మే 16,17 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీలో మే 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈఏపీ సెట్ షెడ్యూల్‌ను మార్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఈఏపీసెట్ కు ఆలస్య రుసుము రూ.1000 తో మే 5వరకు, రూ.5 వేల పెనాల్టీతో మే 10 వరకు, రూ.10 వేల పెనాల్టీతో మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీ సెట్ 2024(AP EAPCET) పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవిఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(సీఏ అండ్ బీఎం) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా 25 శాతం కోటాలను భర్తీ చేస్తారు.
పరీక్ష విధానం ఇలా?(AP EAPCET Exam Pattern)
ఈఏపీ సెట్-2024 ను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్(Computer Based Exam) పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మ్యాథ్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో బోటనీ నుంచి 40 ప్రశ్నలు, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో కనీస అర్హతగా 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అందుబాటులో ఉంటాయి.