AP EAP CET 2024: నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ 2024, ఈ సెట్‌ 2024 దరఖాస్తుల గడువు.. మే 16నుంచి ప్రవేశపరీక్షలు-application deadline for ap eap cet 2024 will end today entrance exams from may 16 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eap Cet 2024: నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ 2024, ఈ సెట్‌ 2024 దరఖాస్తుల గడువు.. మే 16నుంచి ప్రవేశపరీక్షలు

AP EAP CET 2024: నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ 2024, ఈ సెట్‌ 2024 దరఖాస్తుల గడువు.. మే 16నుంచి ప్రవేశపరీక్షలు

Sarath chandra.B HT Telugu
Apr 17, 2024 10:18 AM IST

AP EAP CET 2024: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రెండు ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఏపీ ఈఏపీసెట్‌ 2024, ఏపీ ఈసెట్‌ గడువు నేటితో ముగుస్తుంది.

నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ గడువు
నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ గడువు

AP EAPCET 2024: ఏపీ ఈఏపీ సెట్ 2024 ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్స్‌ online Registrations గడువు నేటితో ముగియనుంది. ఏపీ ఉన్నత విద్యా మండలి APSCHE షెడ్యూల్‌ ప్రకారం జేఎన్‌టియూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.

ఈఏపీ సెట్ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కాకినాడ జేఎన్‌టియూ JNTU Kakinada అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నారు.

ఈఏపీ సెట్‌ 2024 పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బిఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవిఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బిఎస్సీ నర్సింగ్, బిఎస్సీ(సిఏ అండ్ బిఎం) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

విద్యార్ధులు సాధించే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డీమ్డ్ యూనివర్శిటీల్లో కూడా 25శాతం కోటాలను భర్తీ చేస్తారు. పరీక్ష సిలబస్, మోడల్ పేపర్ల కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా గత వారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈఏపీ సెట్‌ 2024 గడువు నేటితో ముగియనుంది.

విద్యార్హతలు...

కనీసం 45శాతం మార్కులతో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ఒకేషనల్ ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఇంటర్ రెండో ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈఏపీ సెట్‌ 2024ను ఆన్‌లైన్‌ పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మ్యాథ్స్‌ నుంచి 80ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.

ఇందులో బోటనీ నుంచి 40, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. కనీస అర్హతగా 25మార్కులు సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు...

జనరల్ అభ్యర్థులకు రూ.600, బీసీ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500గా ప్రవేశపరీక్ష ఫీజును నిర్ణయించారు. ఏప్రిల్ 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఇలా....

ఈఏపీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులకు సంబంధించిన అర్హతలు, ఫీజు చెల్లింపుకు సంబంధించిన విధివిధానాలను స్టెప్‌1 లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

రెండో దశలో ఫీజు చెల్లింపు స్టేటస్ తెలుస్తుంది.

మూడో దశలో ఫీజు చెల్లించిన అభ్యర్థులకు దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది.

నాలుగో దశలో దరఖాస్తులో పేర్కొన్న వివరాలు, అక్షరదోషాలు, అర్హతలు, మార్కుల వివరాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఐదో దశలో పూర్తి చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఆలస్య రుసుముతో…

రూ.500 ఆలస్య రుసుముతో ఈఏపీ సెట్ 2024 దరఖాస్తులను ఏప్రిల్ 30వ తేదీ వరకు సమర్పించవచ్చు. వెయ్యి రుపాయల ఆలస్య రుసుముతో మే 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్‌ మే 4 నుంచి 6వ తేదీ వరకు అనుమతిస్తారు. రూ.5వేల ఆలస్య రుసుముతో మే 10వరకు, రూ.10వేల పెనాల్టీతో మే 12వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఏపీ ఈఏపీ సెట్‌ 2024లో బాగంగా అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలను మే 16,17తేదీల్లో నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను మే 18 నుంచి 22వ తేదీవరకు దశల వారీగా నిర్వహిస్తారు.

ఈసెట్‌ గడువు కూడా నేటితో ఆఖరు…

ఏపీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షను కూడా కాకినాడ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మే 8వ తేదీన ఈసెట్ నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి ఈసెట్‌ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.2వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 29వరకు రూ.5వేల పెనాల్టీతో మే 2వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అందుబాటులో ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం