AP EAP CET 2024: మే 13న పోలింగ్.. ఏపీలో ఈఏపీ సెట్ తేదీల మార్పు… పీజీ సెట్ తేదీల్లో కూడా మార్పు..
AP EAPCET 2024: ఆంధ్రప్రదేశ్ EAPCET 2024 పరీక్ష తేదీలు మారాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 13నుంచి మొదలు కావాల్సిన పరీక్షల్ని రీ షెడ్యూల్ చేశారు.
AP EAPCET 2024: ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించే తేదీలను మార్చాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ నిర్వహించే తేదీలను మార్చనున్నారు.
మే 13వ తేదీన ఏపీతో పాటు తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మరోవైపు అదే రోజు ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.
ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న ఏపీలో పోలింగ్ ఉండటంతో ఈఏపీ సెట్ పరీక్షలను మార్చాలని నిర్ణయించారు. తాజా షెడ్యూల్ ప్రకారం మే 15వ తేదీ నుంచి ఏపీ ఈఏపీ సెట్ తేదీలను ఖరారు చేయనున్నారు.
ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేయనున్నారు. పీజీ ప్రవేశాలకు సంబంధించిన సెట్ జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉండటంతో పీజీ సెట్ తేదీలను కూడా మార్చాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం….
ఏపీలో ఇంజనీరింగ్ Engineering, అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ నోటిఫికేషన్ జేఎన్‌టియూ కాకినాడ గతవారం విడుదల చేసింది.
ఈఏపీ సెట్ 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కాకినాడ జేఎన్‌టియూ JNTU Kakinada అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నారు.
ఈఏపీ సెట్ 2024 పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బిఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవిఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బిఎస్సీ నర్సింగ్, బిఎస్సీ(సిఏ అండ్ బిఎం) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
విద్యార్ధులు సాధించే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డీమ్డ్ యూనివర్శిటీల్లో కూడా 25శాతం కోటాలను భర్తీ చేస్తారు. పరీక్ష సిలబస్, మోడల్ పేపర్ల కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
విద్యార్హతలు...
కనీసం 45శాతం మార్కులతో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ఒకేషనల్ ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఇంటర్ రెండో ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఏపీ సెట్ 2024ను ఆన్‌లైన్ పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మ్యాథ్స్ నుంచి 80ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
ఇందులో బోటనీ నుంచి 40, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. కనీస అర్హతగా 25మార్కులు సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు...
జనరల్ అభ్యర్థులకు రూ.600, బీసీ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500గా ప్రవేశపరీక్ష ఫీజును నిర్ణయించారు. ఏప్రిల్ 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఇలా....
ఈఏపీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులకు సంబంధించిన అర్హతలు, ఫీజు చెల్లింపుకు సంబంధించిన విధివిధానాలను స్టెప్1 లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
రెండో దశలో ఫీజు చెల్లింపు స్టేటస్ తెలుస్తుంది.
మూడో దశలో ఫీజు చెల్లించిన అభ్యర్థులకు దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది.
నాలుగో దశలో దరఖాస్తులో పేర్కొన్న వివరాలు, అక్షరదోషాలు, అర్హతలు, మార్కుల వివరాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఐదో దశలో పూర్తి చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ ఈఏపీ సెట్ తేదీలు....
ఇంజనీరింగ్ అభ్యర్థులకు మే 15 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. అగ్రికల్చర్ -ఫార్మసీ అభ్యర్థులకు మే 17 నుంచి 19వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన సూచనలతో పాటు ఇన్ఫర్మేషన్ బుక్‌లెట్, ఎన్‌సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ,లోకల్ అర్హతలను వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం