AP EAPCET 2024 Postponed : విద్యార్థులకు అలర్ట్, ఏపీ ఈఏపీ సెట్ మే 16కు వాయిదా
AP EAPCET 2024 Postponed : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కారణంగా ఏపీ ఈఏపీసెట్ వాయిదా పడింది. మే 13 నుంచి జరగాల్సిన పరీక్షలను మే 16 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
AP EAPCET 2024 Postponed : ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష(AP EAPCET ) వాయిదా పడింది. మే 13న ఎన్నికల పోలింగ్ (Election Polling)కారణంగా ఈఏపీ సెట్ ను మే 16కి వాయిదా వేశారు. మే 13వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎన్నికల పోలింగ్ కారణగా మే 16 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదే విధంగా జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన ఏపీ పీజీ సెట్(AP PGCET) జూన్ 10వ తేదీకి వాయిదా వేశారు. ఏపీ పీజీసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఏపీ ఆర్ సెట్(AP RCET) జరుగనుంది.
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు
ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ నోటిఫికేషన్ కాకినాడ జేఎన్‌టియూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈఏపీ సెట్ 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కాకినాడ జేఎన్‌టియూ(JNTU Kakinada) అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీ సెట్(AP EAPCET) నిర్వహించనున్నారు. ఈఏపీ సెట్ 2024 పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(సీఏ అండ్ బీఎం) విభాగాల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
పరీక్షా విధానం
విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా 25 శాతం కోటాలను భర్తీ చేస్తారు. పరీక్ష సిలబస్, మోడల్ పేపర్ల కోసం ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈఏపీ సెట్ 2024ను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్(Computer Based Exam) పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మ్యాథ్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో బోటనీ నుంచి 40 ప్రశ్నలు, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో కనీస అర్హతగా 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు రూ.600, బీసీ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500గా ప్రవేశ పరీక్ష ఫీజును నిర్ణయించారు. ఏప్రిల్ 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అందుబాటులో ఉంటాయి.
సంబంధిత కథనం