Amit Shah With NTR : అమిత్ షా-బాద్ షా భేటీ.. మీరు అనుకునే ప్రశ్నలు-సమాధానాలు ఇవేనేమో?-what is bjp political strategy behind jr ntr and amit shah meet know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Amit Shah With Ntr : అమిత్ షా-బాద్ షా భేటీ.. మీరు అనుకునే ప్రశ్నలు-సమాధానాలు ఇవేనేమో?

Amit Shah With NTR : అమిత్ షా-బాద్ షా భేటీ.. మీరు అనుకునే ప్రశ్నలు-సమాధానాలు ఇవేనేమో?

Anand Sai HT Telugu
Aug 22, 2022 03:01 PM IST

Amit Shah With NTR : మునుగోడులో అమిత్ షా ప్రసంగం కంటే.. తర్వాత కలిసిన వ్యక్తుల గురించే చర్చ. ఎన్టీఆర్ ను కలవడంపై ట్విట్టర్ కూతపెట్టింది. బీజేపీ మాత్రం RRR సినిమా గురించి అభినందించేందుకేనని చెబుతోంది. మరి రామ్ చరణ్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఏదో మతలబు ఉండే ఉంటుందని అందరికీ అర్థమైపోయింది.

అమిత్ షా ఎన్టీఆర్ భేటీ
అమిత్ షా ఎన్టీఆర్ భేటీ (twitter)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం భారతదేశంలో శక్తివంతమైన వ్యక్తి. ఆయన అడుగేస్తే ఏదో వ్యూహం ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఉత్తర భారతంలో బీజేపీకి ఎదురులేదు. దక్షిణాదికి వచ్చేసరికి పరిస్థితి తారుమారు. ఎలాగైనా పట్టుసాధించాలనే మోదీ-షా ఆలోచన. అలాంటి అమిత్ షా.. ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వడంపై సహజంగానే అందరి దృష్టి ఆకర్శించింది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించే అయితే టీమ్ ను కూడా పిలవాలిగా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అనేక ప్రశ్నలు వాటికి సమాధానాలు ఊహించేసుకుంటున్నారు. అంతలా మీటింగ్ వెనక ఏం ఉంటుంది?

ఎన్టీఆర్-అమిత్ షా భేటీకి మధ్యవర్తిత్వం వహించింది ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన విజయేంద్రప్రసాద్ అని చర్చ ఉంది. ఇటు ఎన్టీఆర్, అటు బీజేపీతో సాన్నిహిత్యం కారణంగా ఈ సిట్టింగ్ ఏర్పాటు చేశారని ప్రచారం. అయితే మీడియా అటెన్షన్ కోసం అమిత్ షా ఇలాంటి సడెన్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారనే అంటున్నారు కొంతమంది. గతంలోనూ వివిధ రాష్ట్రాల్లో నటులతో ఇలా.. మీటింగ్స్ ప్లాన్ చేశారట. ఇలా చేస్తే.. బీజేపీకి ఎంతో కొంత మైలేజ్ అనే అభిప్రాయం ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ లో మీ యాక్టింగ్ సూపర్ అని చెప్పేందుకైతే.. ఫోన్ కాల్ చాలు కదా? లేదు లేదు కలవాలనే అనుకుంటే.. మరి రామ్ చరణ్ కూడా ఉన్నాడు కదా? తెలుగు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలివి.

ఇవన్నీ కాదు.. ఇటీవల విజయేంద్రప్రసాద్ ఆర్ఎస్ఎస్ మూవీ తీస్తానని ప్రకటించారు. అలా అనుకుంటే నేరుగా ఎన్టీఆర్ ను అడగొచ్చు కదా. మధ్యలో అమిత్ షాతో భేటీ దేనికనే ప్రశ్నలూ ఉన్నాయి. ఒకవేళ అదే విషయమైనా ఎన్టీఆర్ ఒకే చెబుతారని చెప్పలేం. బీజేపీకి ఫ్రీ మైలేజీ కోసమే ఇదంతా.. అయి ఉంటుందనే అభిప్రాయం ఉంది. మునుగోడు సభ తర్వాతే ఎన్టీఆర్ తో భేటీ వేయడంపై చర్చ ఎక్కువగా ఉంది. కానీ ఎన్టీఆర్ పొలిటికల్ గా వెళ్తే.. ఏపీనే ఎంచుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఎన్టీఆర్ లేరు. తెలంగాణ టీడీపీ ఓట్లు కొల్లగొట్టేందుకు కూడా అయి ఉండొచ్చు అనేది ఒక వాదన.

అయితే ఈ మీటింగ్ తో టీడీపీ కూడా కాస్త ఆలోచన పడినట్టుగా చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ ను వాడుకోవాలని బీజేపీ చూస్తోందనే అభిప్రాయాలూ ఉన్నాయి. కానీ అంతకుముందు ఎదురైన అనుభవాలతో ఎన్టీఆర్ అలాంటి సాహసం చేయరని.. ఎవరిని అడిగినా చెబుతారు. ఈ సమావేశంతో టీడీపీ నుంచి బీజేపీకి కొన్ని ఓట్లు వెళ్తాయని కొంతమంది టెన్షన్ పడుతున్నారట.. చర్చించుకుంటున్నారు అలా.

అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ 2014లో చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి నరేంద్రమోదీ హఠాత్తుగా వెళ్లిన సందర్భాన్ని గుర్తుకుతెస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ కాంక్ష ఇప్పటికైతే లేదు. భవిష్యత్ లో ఉందేమో. రజనీకాంత్ మాత్రం. రాజకీయ పార్టీని ప్రకటించి, ఆ తర్వాత విరమించుకున్నారు. రజనీకాంత్ మాత్రం అనేక విషయాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు.

సినీ నిర్మాత, మీడియా దిగ్గజం రామోజీరావుతో అమిత్ షా భేటీ కావడంతో టీడీపీ పట్ల బీజేపీ తన వైఖరిని మార్చుకుంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మోదీపై చంద్రబాబు చేసిన కామెంట్స్.. అంత ఈజీగా బీజేపీ మరిచిపోతుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. టీడీపీకి అలాంటి అవకాశం ఏమీ రానప్పటికి.. రాష్ట్రపతి ఎన్నికలలో ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని మద్దతు పలికారు.

ప్రస్తుతం సినిమా నటులకు రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉందో ఎన్టీఆర్ కు తెలుసు. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి పెద్ద వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాడు. వాళ్లు.. మళ్లీ వెనక్కు వచ్చి సినిమాలు చేసుకుంటున్న విషయం అర్థమవుతుంది. పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఎంతో కొంత పొలిటికల్ హీట్ పెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ సినిమాలను మాత్రం వదలడం లేదు. ఒకవేళ షా రాజకీయాల గురించి ఏదైనా మాట్లాడినా అంత ఈజీగా ఎన్టీఆర్ పడిపోడు అనేది ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ కు వచ్చే ఫాయిదా ఏం లేదు.

ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ ప్యాన్ ఇండియా. ఇక ఆయన నటనకు వంక పెట్టడానికి లేదు. ఇంత స్టార్ డమ్ పక్కన పెట్టేసి.. రాజకీయ క్షేత్రంలోకి దిగుతారా? అన్ని వదులుకోని జనం మధ్యలోకి వెళ్లాలి. ఎన్నో డక్కామెుక్కీలు తినాలి. మిగిలిన వారిని చూసి అంతటి సాహసం ఎన్టీఆర్ చేస్తాడా? అనే ప్రశ్న ఉంది.

ముందుగా రామోజీరావుతో అమిత్ షా భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తు కోసమే ఇలా సమావేశమయ్యారనే ఊహ అనుకున్నా.. ఆ కూటమికి ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? గతంలో టీడీపీ తరఫున కూకట్ పల్లిలో సుహాసిని పోటీ చేసినా.. ప్రచారానికి వెళ్లలేదు. గత విషయాలు ఎన్టీఆర్ కు మనసులో ఉన్నాయి కాబట్టే.. దూరంగా ఉన్నారని ప్రచారం ఉంది. ఈ మీటింగ్ వెనక ఉన్న ఉద్దేశం ఏంటనేది మాత్రం రహస్యమే.

మీటింగ్ పై కొడాలి కామెంట్స్

తాజాగా ఎన్టీఆర్ కు సన్నిహితుడైన ఏపీకి చెందిన ఎమ్మెల్యే.. కొడాలి నాని.. అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై మాట్లాడారు. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం​ మంత్రి అమిత్‌ షా ఎవరితోనూ మాట్లాడరు అని చెప్పారు. బీజేపీని విస్తరించేందుకే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారని తాను అనుకుంటున్నట్టుగా తెలిపారు. ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రయోజనం లేదనే.. మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

IPL_Entry_Point