TS Cabinet Decisions : రెండు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’- కేబినెట్ కీలక నిర్ణయాలివే!-hyderabad news in telugu ts cabinet key decisions 500 gas cylinder free power schemes approved ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cabinet Decisions : రెండు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’- కేబినెట్ కీలక నిర్ణయాలివే!

TS Cabinet Decisions : రెండు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’- కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Bandaru Satyaprasad HT Telugu
Feb 04, 2024 09:44 PM IST

TS Cabinet Decisions : మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంటో పాటు రాష్ట్ర అధికార గీతంగా 'జయజయహే తెలంగాణ' ను గుర్తించింది.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

TS Cabinet Decisions : హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీల అమలుకు కేబినెట్(Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ బదులుగా టీజీ అని మార్పు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర గేయంగా 'జయజయహే తెలంగాణ'ను గుర్తించింది. దీంతో పాటు ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ తల్లి(Telangana Talli Statue) విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో సైతం మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల గణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. గ్రూప్‌ -1లో 160 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్‌కు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు

కేబినెట్ నిర్ణయాలను(Cabinet Decisions) మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే ప్రక్రియ మొదలైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదన్నారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు(High Court) నూతన భవనాలకు 100 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ డేట్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించింది.

TS ను TGగా మార్పు చేయడంపై మంత్రి పొంగులేటి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు టీజీ అనే గుర్తించిందని, కానీ గత ప్రభుత్వం టీఎస్ గా మార్చిందన్నారు. తెలంగాణ అంటే TG గానే ఉండాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ తో సహా ఏదైనా TG గానే ఉంటుందన్నారు.

జయ జయహే తెలంగాణ గీతాన్ని రచయిత అందెశ్రీ రచించారు. ఈ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది.

"జయజయహే తెలంగాణ.. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్‌ జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి తరుగనిదీ నీత్యాగం మరువనదీ శ్రమ యాగం జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ ఎద జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!"

IPL_Entry_Point

సంబంధిత కథనం