No Sale of Uniforms : ప్రైవేట్‌ స్కూళ్లలో యూనిఫామ్‌, పుస్తకాలు అమ్మవద్దు - కీలక ఆదేశాలు జారీ-private schools cant sell uniforms and books says hyderabad deo ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  No Sale Of Uniforms : ప్రైవేట్‌ స్కూళ్లలో యూనిఫామ్‌, పుస్తకాలు అమ్మవద్దు - కీలక ఆదేశాలు జారీ

No Sale of Uniforms : ప్రైవేట్‌ స్కూళ్లలో యూనిఫామ్‌, పుస్తకాలు అమ్మవద్దు - కీలక ఆదేశాలు జారీ

Hyderabad DEO On Private Schools : ప్రైవేటు పాఠశాలలకు హైదరాబాద్ డీఈవో(విద్యాశాఖ) కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆయా పాఠశాల్లో పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మవద్దని స్పష్టం చేశారు.

ప్రైవేటు స్కూళ్లల్లో పుస్తకాల అమ్మకాలు నిషేదం

Hyderabad DEO On Private Schools: ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి హైదరాబాద్ డీఈవో కీలక ఆదేశాలను ఇచ్చారు. స్టేట్ లేదా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పేరుతో నడిచే అన్ని రకాల పాఠశాలల్లోనూ పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మవద్దని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లోనూ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని డీఈవో ఆదేాశాల్లో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఈ అమ్మకాలు జరగకుండా చూడాలని కోరారు.  ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 కోర్టు ఆదేశాల ప్రకారం…. పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావొచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యా కాలెండర్ విడుదల - ముఖ్య వివరాలివే

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్‌ 12, 2024 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. 

డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్‌ సెలవులు కాగా, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు, అప్పర్ ప్రైమ‌రీ స్కూల్స్ ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతుల వరకు అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూల్స్ పనిచేయనున్నాయి. జూన్ 12, 2024న ప్రారంభమై ఏప్రిల్‌ 23, 2025తో ముగుస్తాయి. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి.

అక్టోబర్ 13 నుంచి 25 వరకు మొత్తం 13 రోజుల దసరా సెలవులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో పాటు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండాయని ప్రకటించింది.

జులై 31, 2024లోగా ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షలు, సెప్టెంబర్ 30, 2024 లోపు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-2 పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షలు, డిసెంబర్ 12 లోపు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-3 పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. 

జనవరి 29, 2025 లోపు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-4 పరీక్షలను, వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి 29 వరకు సమ్మేటివ్‌ అసెస్మెంట్‌-2 పరీక్షలను(1 నుంచి 9 క్లాస్ లకు) నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు 2025 ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ నిర్వహించున్నారు. మార్చి, 2025లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొంది.