Medak District : కాపురానికి రాని భార్య...! మనస్తాపంతో భర్త ఆత్మహత్య-husband commits suicide because his wife is not coming in medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak District : కాపురానికి రాని భార్య...! మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Medak District : కాపురానికి రాని భార్య...! మనస్తాపంతో భర్త ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

Medak District Crime News : భార్య కాపురానికి రావటం లేదన్న కారణంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

భర్త సూసైడ్ representative image (photo source unshplash.com)

Medak District Crime News : పెళ్లయిన నెలన్నరకే భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో భర్త ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని దోభివాడకు చెందిన దుద్గోళ్ల పెదనర్సింహులు,నర్సమ్మ దంపతులకు నలుగురు కొడుకులు. కొంతకాలం క్రితం తండ్రి మరణించగా… తల్లి కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. కాగా వీరి చిన్న కుమారుడు ప్రశాంత్ (28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

పెళ్లైన 15 రోజులు మాత్రమే .....

2024 ఏప్రిల్ 3న ప్రశాంత్ కు,చేగుంట మండలం రామంతాపూర్ కు చెందిన మనస్వినికి ఘనంగా వివాహం జరిగింది. మనస్విని పెళ్లైన 15 రోజులు మాత్రమే అత్తవారింట్లో ఉండి భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత తల్లిగారింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన మనస్విని… ఆ తర్వాత తిరిగి రావటం లేదు.

భర్త ప్రశాంత్ పలుమార్లు ఫోన్ చేసి ఇంటికి రావాలని భార్యను కోరాడు. కానీ మనస్విని నర్సాపూర్ లో ఉంటే కాపురానికి రానని… హైదరాబాద్ లో కాపురం పెడితే వస్తానని చెప్పింది. ఈ క్రమంలో ప్రశాంత్ ఈ విషయాన్నీ మమసులో పెట్టుకొని ఒంటరిగా ఉండి బాధపడేవాడని తల్లి తెలిపారు. దీంతో ఈ నెల 29న మళ్లీ ప్రశాంత్ భార్యకు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరాడు. కానీ మనస్విని తనతో కాపురం చేయడం ఇష్టం లేదని… తాను రానని, ఫోన్ చేయవద్దని తెగేసి చెప్పింది. ఈ విషయాన్ని ప్రశాంత్ తన తల్లితో చెప్పి బాధపడ్డాడు. 

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్… అదే రోజు రాత్రి తన బెడ్ రూంలో  ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రశాంత్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రశాంత్ మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ వెల్లడించారు.

సిద్దిపేట జిల్లాలో మరొకరు ......

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లిలోనూ జరిగింది. వివరాల్లోకి వెళ్తే… శేరిపల్లి గ్రామానికి చెందిన పసునూరి శ్రీకాంత్ (30) కు ఏడు సంవత్సరాల క్రితం పొన్నాల కు చెందిన శ్రీలతతో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ సిద్దిపేటలో ఒక ప్రైవేట్ వాహన దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కాగా సంవత్సర కాలంగా బార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భార్య శ్రీలత 20 రోజుల క్రితం ఇద్దరు పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. కాగా శ్రీకాంత్ పలుమార్లు కాపురానికి రావాలని కోరిన భార్య శ్రీలత స్పందించడం లేదు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీకాంత్ గురువారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య శ్రీలత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.