Revanth Reddy : అప్పుడు వైఎస్ కు, ఇప్పుడు జగన్ కు సహకరించింది కేసీఆరే- తెలంగాణ నీళ్లు ఏపీకి దారాదత్తం:సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy sensational comments on kcr harish rao water sharing between ap ts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : అప్పుడు వైఎస్ కు, ఇప్పుడు జగన్ కు సహకరించింది కేసీఆరే- తెలంగాణ నీళ్లు ఏపీకి దారాదత్తం:సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : అప్పుడు వైఎస్ కు, ఇప్పుడు జగన్ కు సహకరించింది కేసీఆరే- తెలంగాణ నీళ్లు ఏపీకి దారాదత్తం:సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Feb 04, 2024 04:02 PM IST

CM Revanth Reddy : కేసీఆర్, హరీశ్ రావే నీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్, కేసీఆర్ ఇంటికి వచ్చి చర్చించి రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీటి తరలించుకుపోయారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేశారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నీటి పంపకాలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. కేసీఆర్, హరీశ్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగిస్తుందని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోయారన్నారు. దీనికి అప్పుడు కేసీఆర్, హరీశ్ రావు సహకరించారని విమర్శించారు. ఆ తర్వాత సీఎం జగన్, కేసీఆర్ ఇంటికి వచ్చి కృష్ణా నీటి పంపకాలపై 6 గంటలు చర్చించారని గుర్తుచేశారు. ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ జీవో 2020లో ఆమోదం పొందిందన్నారు. ఈ పంపకాలపై అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ కొట్లాడిందన్నారు.

ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందే బీఆర్ఎస్

బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలు కప్పిపుచ్చి కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి కోసం కుట్ర చేస్తున్నారన్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వమే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పిందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి నిర్ణయం తీసుకుందన్నారు. పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగే రాశారని అప్పట్లో కేసీఆర్ అన్నారన్నారు. విభజన సమయంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నారన్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పేందుకు కేసీఆరే పునాది వేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసింది కేసీఆరే

ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 2015 జూన్18,19 తేదీల్లో కేంద్రం సమావేశం నిర్వహించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ(Telangana) 299 తెలంగాణ వాడుకోవాలని ఒప్పందం చేశారన్నారు. అప్పడు తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని హరీశ్ రావు సంతకం పెట్టారన్నారు. మరి నీటి పంపకాల్లో 50 శాతం వాటా కావాలని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. హక్కుల ప్రకారం 68 శాతం అంటే 500 టీఎంసీలు పైగా తెలంగాణకు రావాలన్నారు. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసింది కేసీఆరే అని రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు.

పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి పంపకాలు జరగలేదు

కృష్ణ పరివాహకం తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి పంపకాలు జరగలేదని ఆరోపించారు. 500 టీఎంసీల నీటి హక్కులను కేసీఆర్(KCR) ఏపీకి దారదత్తం చేశారని విమర్శించారు. 2023 జనవరి 27న కేఆర్‌ఎంబీ మీటింగ్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని గత ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బోర్డుల నిర్వహణకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం