BRS Harish Rao : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష - హరీశ్ రావు
Harish Rao On Congress Party : కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు హరీశ్ రావు. కేసీఆర్ ఉద్యమమే చేయకుంటే… రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చేదా ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని కామెంట్స్ చేశారు.
BRS MLA Harish Rao On Congress Party : బీఆర్ఎస్ ప్రస్థానంలో పూల బాటలు ఉన్నాయి, ముల్ల బాటలు ఉన్నాయన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు. శనివారం భద్రాచంలో మాట్లాడిన ఆయన… భద్రాచలం ఎమ్మెల్యేను గెలిపించినందుకు ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ నాడు సభ పెడితే 35 రోజులు ఇక్కడే ఉన్నానని… అందరితో కలిసి సభను విజయవంతం చేశామని గుర్తు చేశారు. 2009లో 10 స్థానాలు మాత్రమే గెలిచామని…. అధైర్యపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యేవాడు కాదు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని కామెంట్స్ చేశారు.
కేసీఆర్ పెట్టిన భిక్ష - హరీశ్ రావు
“రేవంత్ రెడ్డికి సీఎం పదవి, కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది, ఆయనకు నేడు సీఎం పదవి వచ్చింది. ఒక సీఎం అసభ్యంగా, అసహ్యంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారు. దేశంలోనే ఇంత అనాగరిక, సంస్కార రహిత, అనాగరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ నీతి మాటలు మాట్లాడటం తర్వాత, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీతి చెప్పు. ఈ రాష్ట్ర పరువు, మీ కాంగ్రెస్ పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. మార్పు తెస్తా అని, అభాగ్యులు, అన్నర్ధులు, పేదలకు నెల నెలా పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం గెలిస్తే 4000 అన్నారు. పింఛన్లు మాత్రం పెరగలేదు. పాతవి ఇవ్వలేదు. ఈ జిల్లా మంత్రి గారు ఆర్థిక మంత్రి. వాళ్లకు పింఛన్లు ఇవ్వక పోవడమే మీ ప్రాధాన్యమా….? పింఛన్లు ఇవ్వకపోవడమే మార్పా..? కరెంటు కోతలు పెట్టడమే మార్పా? 6 లక్షల మంది ఆటో సోదరులను రోడ్డున పడేయడమే మార్పా? రైతు బంధు ఫిబ్రవరి దాకా పడక పోవడం మార్పా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కృష్ణా నది ప్రాంత ప్రాజెక్టులను కేంద్రానికి తాము అప్పగించలేదని స్పష్టం చేశారు హరీశ్ రావు. ఈ ప్రభుత్వమే అప్పగించింది. “మీరు చేసిన పనుల వల్ల నీటి సమస్యలు వస్తాయి. తిట్ల పురాణం తప్ప మీరు చేసింది ఏముంది…? పార్లమెంట్ ఎన్నికల నోటిిఫికేషన్ లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేదా ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు. మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. ఫ్రస్టేషన్ లో సీఎం ఉన్నారు. రెచ్చగొట్టినా మేం రెచ్చిపోము. 420 హామీలు అమలు అయ్యేదాకా, మా పోరాటం ఆగదు. ప్రజల్లో మార్పు స్టార్ట్ అయ్యింది. నీళ్ళు, పాలు ఏంటో అర్థమైంది. భద్రాచలం కరకట్ట కోసం 39 కోట్లు ఇచ్చాం. మీరు పనులు త్వరగా పూర్తి చేయాలి. ఎంపి ఎన్నికల్లో విజయం సాధించాలి. మూడో సారి కూడా మహబూబాబాద్ ఎంపి గెలవాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే హామీలు అమలు అవుతాయి అన్నారు. 40 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అని మమతా బెనర్జీ అన్నారు. నితీష్, మమత, కేజ్రీవాల్ దూరం అయ్యారు. ఇండియా కూటమి కుప్పకూలింది. రాహుల్ ప్రధాని అవడం కలే. కేంద్రంలో అధికారంలోకి రావడం కల్ల. బిజెపి నీ నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. మమతా, కేసీఆర్, కేజ్రీవాల్ కు పోరాడే శక్తి ఉంది. బిజెపి తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా, తెలంగాణ కోసం పోరాటం చేసేది బి ఆర్ ఎస్ ఎంపిలే” అని పునరుద్ఘాటించారు హరీశ్ రావు.